LIC Dividend-Bonus: కంపెనీ షేర్‌హోల్డర్లకు అక్షరాలా 1.81 లక్షల కోట్ల రూపాయలను పప్పు-బెల్లాల్లా పంచి పెట్టేందుకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) సిద్ధమవుతోంది. మీ దగ్గర LIC షేర్లు ఉంటే చాలు, ఈ డబ్బు మీ చేతికి వస్తుంది. అసలు షేర్‌హోల్డర్లకు ఇంత భారీ మొత్తం ఎందుకు ముట్టజెప్పాలని అనుకుంటోంది?, దీని వల్ల ఆ కంపెనీకి వచ్చే లాభం ఏంటి?
LIC మనీ స్కీమ్ వెనుక బలమైన కారణం ఉంది. ఈ ఏడాది మే నెలలో ఈ కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెట్టింది. ఒక్కో షేరు రూ. 949 ధర వద్ద ఎక్సేంజీల్లో లిస్ట్ అయింది. అప్పట్నుంచి షేరు ధరలో అడ్డకోత కనిపిస్తూనే ఉంది. లిస్టింగ్ ప్రైస్ నుంచి 32 శాతం పైగా క్షీణతతో ప్రస్తుతం రూ. 592.95 వద్దకు చేరింది. దీంతో 2.23 లక్షల కోట్ల రూపాయల మేర పెట్టుబడిదారుల డబ్బు ఆవిరైంది. కంపెనీ మీద మదుపరుల నమ్మకం సన్నగిల్లుతోంది. దీంతో, నష్ట నివారణ చర్యలను కంపెనీ చేపడుతోంది.
అగ్రస్థానం ఖాయమట!
ఒక్క దెబ్బతో రెండు పిట్టల్ని పడగొట్టినట్లు... పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగించడంతో పాటు తన మార్కెట్ విలువనూ పెంచుకునేందుకు ఈ ఇన్సూరెన్స్ బెహమోత్ చర్యలు చేపట్టింది. పాలసీ హోల్డర్లకు చెందిన సుమారు 1.81 లక్షల కోట్ల రూపాయల ఫండ్‌ను.. డివిడెండ్ లేదా బోనస్ రూపంలో ఇచ్చేందుకు నిర్ణయించిన ఫండ్‌లోకి బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రాయిటర్స్ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్‌లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన 11.57 లక్షల కోట్ల రూపాయల మిగులు మొత్తం నుంచి ఆరో వంతును, అంటే 1.81 లక్షల కోట్ల రూపాయలను బ్రహ్మాస్త్రంలా బయటకు తీస్తోంది. LIC డైరెక్టర్ల బోర్డ్ ఆమోదంతో, నాన్ పార్టిసిపేటింగ్ ఫండ్ నుంచి డబ్బును వాటాదారుల ఫండ్‌కు బదిలీ చేయవచ్చు. ఈ ప్రతిపాదన ఇంకా LIC డైరెక్టర్ల బోర్డ్ వద్దకు చేరలేదు.
షేర్‌హోల్డర్లకు నగదు బదిలీ పూర్తయితే, LIC నికర విలువ ప్రస్తుతమున్న రూ. 10,500 కోట్ల నుంచి దాదాపు 18 రెట్లు పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు. పోటీ కంపెనీలైన SBI లైఫ్, HDFC లైఫ్, మిగిలిన బీమా సంస్థలన్నింటి కంటే నెట్ వర్త్ చార్ట్‌లో అగ్రస్థానానికి చేరుతుందని లెక్క కట్టారు.
డివిడెండ్ లేదా బోనస్ షేర్‌ల జారీని LIC అధికారికంగా ప్రకటిస్తే... ఈ కంపెనీ షేర్లు కొనడానికి కొత్తవాళ్లు, ఇప్పటికే కొన్నవాళ్లు కూడా ఎగబడతారని, షేర్ ధర పుంజుకుంటుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
'బయ్' సిఫార్సులు
LICని ట్రాక్ చేస్తున్న మొత్తం 9 మంది ఎనలిస్ట్‌ల్లో, ఏడుగురు 'బయ్' లేదా 'స్ట్రాంగ్ బయ్' సిఫార్సు చేశారు. వీళ్లు ఇచ్చిన టార్గెట్ ప్రైస్‌ల్లో మధ్యస్థ ధర 840 రూపాయలు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.