Maruti Suzuki Q2 Results: దేశంలో అతి పెద్ద ప్యాసెంజర్ కార్ల కంపెనీ మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India), 2022 సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికం (Q2FY23) ఫలితాల్లో ఫోర్త్ గేర్‌లో దూసుకెళ్లింది. సంవత్సరం ప్రాతిపదికన (YoY) కంపెనీ స్వతంత్ర (స్టాండలోన్) నికర లాభం నాలుగు రెట్లు పెరిగి రూ.2,062 కోట్లకు చేరింది. Q2FY22లో లాభం రూ. 486.90 కోట్లుగా నమోదైంది. సమీక్ష కాల త్రైమాసికంలో కంపెనీ రూ.1,935 కోట్ల లాభాన్ని మిగుల్చుకోవచ్చన్న నిపుణుల అంచనాలను అధిగమించింది.
సెప్టెంబర్ త్రైమాసికంలో ఆదాయం దాదాపు 46% YoY పెరిగి రూ. 29,931 కోట్లకు చేరుకుంది. మార్కెట్ అంచనా అయిన రూ.29,558 కోట్ల కన్నా ఎక్కువ సంపాదించింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ. 20,550.90 కోట్లుగా ఉంది.
మెరుగైన ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్
ఎబిటా (EBITDA) మూడు రెట్లు పెరిగి రూ. 2,770 కోట్లకు చేరుకోవడంతో కార్యాచరణ పనితీరు బాగా మెరుగ్గా కనిపించింది. ఆపరేటింగ్ మార్జిన్ 5.09 శాతం లేదా 509 బేసిస్ పాయింట్లు పెరిగి 9.25 శాతంగా నమోదైంది. అనుకూలంగా ఉన్న విదేశీ మారకపు ద్రవ్యం, వ్యయాల తగ్గింపు చర్యలు, హయ్యర్ రియలైజేషన్లు కార్యాచరణ పనితీరును టాప్ గేర్‌లో ఉంచాయి. అయితే, ప్రకటనల ఖర్చులు పెరగడం, అధిక విద్యుత్ & ఇంధన ధరలు కొంత వ్యతిరేక ప్రభావం చూపాయి.
అమ్మకాల శాతం ప్రకారం ముడి వస్తువుల ధర గత సంవత్సరం కంటే 3.9 శాతం లేదా 390 బేసిస్ పాయింట్లు తగ్గిందని, ఇతర ఖర్చులు 1.9 శాతం లేదా 190 బేసిస్ పాయింట్లు తగ్గాయని కంపెనీ తెలిపింది. కంపెనీ లాభదాయకత పెరగడానికి ఇది కూడా ఒక కారణం.
రికార్డ్ సేల్స్
ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో మొత్తం 5,17,395 యూనిట్లను (వాహనాలు) మారుతి సుజుకి అమ్మింది. గత సంవత్సరం కంటే 36 శాతం ఎక్కువ యూనిట్లను సేల్ చేసింది. ఒక త్రైమాసికంలో అమ్మిన రికార్డ్ స్థాయి సేల్స్ ఇవి. కరోనా పరిస్థితులు సద్దుమణగడంతో, గత మూడేళ్ల మందగమనం దాటి ఈసారి వాహనాల డిమాండ్ బాగా పెరిగింది. అమ్మకాలు ఉత్సాహంగా సాగాయి.
2022 సెప్టెంబర్ క్వార్టర్ చివరికి 4.12 లక్షల వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని కంపెనీ వెల్లడించింది. ఇటీవల లాంచ్ అయి జనం మనస్సులు దోచిన గ్రాండ్ విటారా, న్యూ బ్రెజా మోడళ్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. 4.12 లక్షల ఆర్డర్లలో
1.3 లక్షల ఆర్డర్లు గ్రాండ్ విటారా, న్యూ బ్రెజా వంటి మోడళ్ల కోసమో వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో (ఏప్రిల్-సెప్టెంబర్) మారుతి సుజుకి 9,85,326 యూనిట్లను అమ్మింది. క్రితం ఏడాది ఇదే సమయంలో 7,33,155 వాహనాలను సేల్ చేసింది. దేశీయ విక్రయాలు 6,28,228 యూనిట్ల నుంచి 8,52,694 యూనిట్లకు, ఎగుమతులు 1,04,927 యూనిట్ల నుంచి 1,32,632 యూనిట్లకు పెరిగింది.
సెమీ కండక్టర్ల కొరత లేకపోతే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల వెహికల్ సేల్స్ లక్ష్యాన్ని చేరుకోగలమని కంపెనీ ప్రకటించింది.
ఫలితాలు హిట్ అవ్వడంతో శుక్రవారం కంపెనీ షేర్ ధర కూడా ఎగసిపడింది. BSEలో 4.95 శాతం పెరిగి రూ. 9,494.10 వద్ద ముగిసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.