Buddhist Diet: ఆహారం తినేది ఆరోగ్యం కోసమే. కానీ ఎంతో మంది ఆ ఆహారంతోనే ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు. చెడు ఆహారాన్ని తింటూ ఎన్నో రకాలు జబ్బులు తెచ్చుకుంటున్నారు. ఆరోగ్యం కోసం, బరువు తగ్గడం కోసం ఎన్నో రకాల డైట్లు ప్రచారంలో ఉన్నాయి. వాటిని ఫాలో అవుతున్న వారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. కానీ ఆ డైట్లేవీ కూడా సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేవి కావు. కానీ కేవలం సంపూర్ణ ఆరోగ్యం కోసం మాత్రమే  సిద్ధమైన డైట్ ‘బౌద్ధ డైట్’.  దీని ప్రకారం ఆహారం తింటే చక్కటి ఆరోగ్యం మీ సొంతమవుతుంది. క్రీస్తుపూర్వం 5 - 4వ శతాబ్దంలో బౌద్ధమతాన్ని స్థాపించాడు సిద్ధార్థ గౌతముడు. అతడే  బుద్ధుడయ్యాడు. ఈ రకమైన ఆహారం చాలా మందికి పూర్తిగా కొత్తది.  అయితే ఈ కథనాన్ని చదివిన తర్వాత మీకు దీనిపై ఒక స్పష్టమైన ఆలోచన వస్తుంది. 


శాకాహారమే
బుద్ధుని అయిదు నైతిక బోధనల ప్రకారం ఏ జీవి ప్రాణాలనైనా తీయడం నిషేధం. అందుకే బౌద్ధులు శాకాహారాన్ని మాత్రమే తింటారు. లాక్టో-శాఖాహార ఆహారాన్ని కూడా అనుసరిస్తారు. అంటే మాంసాహారం తినరు కానీ పాల ఉత్పత్తులను తీసుకుంటారు. అందుకే బౌద్ధ డైట్ పూర్తి శాకాహారాన్నే కలిగి ఉంటుంది. అలాగే తినే పద్ధతులు కూడా కొన్ని ఉన్నాయి. 


ఉపవాసం
బౌద్ధ డైట్ ప్రకారం ఉపవాసం చాలా ఆరోగ్యకరం. ఈ ఉపవాసంలో కొంత సమయం పాటూ ఏ ఆహారాన్నీ తినకుండా ఉండవచ్చు. లేదా కొన్ని రకాల ఆహారాలను తక్కువ పరిమితిలో తీసుకోవచ్చు. ఇది మీ ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. బౌద్ధ డైట్ ప్రకారం అప్పుడప్పుడు ఉపవాసం ఉండడం వల్ల పొట్ట క్లీన్ అవుతుంది. ఇక బౌద్ధుల విషయానికి వస్తే  వారు మధ్యాహ్నం నుండి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు ఉపవాసం ఉండేవారంట. 


మద్యం 
బౌద్ధ డైట్లో ఎప్పుడూ కూడా మద్యానికి చోటు లేదు. అది పూర్తిగా నిషేధించారు. ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచకుండా గందరగోళానికి గురిచేస్తుంది. బౌద్ధులు కేవలం మద్యమే కాదు లైంగిక కోరికలను పెంచే ఉల్లిపాయలు, వెల్లుల్లి, పచ్చిమిర్చి వంటివి కూడా తినరు. అంతేకాదు ఇవి కోపాన్ని కూడా పెంచుతాయి.


దొంగచాటుగా వద్దు
ఆహారాన్ని పంచుకునే తినాలి, అది కూడా అందరిముందే తినాలి. కానీ రహస్యంగా దాచుకుని తినడం బౌద్ధ ఆహార పద్ధతులకు విరుద్ధం. అలా దాచుకుని దాచుకుని తినడం వల్ల మానసిక ఆరోగ్యం క్షీణిస్తుంది.


నిశ్శబ్దంగా తినాలి
తినేటప్పుడు ఇతర ఏపనీ చేయకుండా, మాట్లాడకుండా నిశ్శబ్ధంగా తినాలి. చాలా మంది పేపర్ చదువుతూ, టీవీ చూస్తూ తింటారు. ఇలా చేయడం మంచిది కాదు. బౌద్ధులు ఆహారం తినేటప్పుడు చాలా నిశ్శబ్ధంగా ఉండాలని చెబుతారు. 


ఏం తినాలి?
అధిక కారం ఉన్న పదార్థాలను, మసాలా పదార్థాలను దూరం పెట్టాలి. కూరగాయలతో వండిన ఆహారానికే ప్రాధాన్యం ఇవ్వాలి. పాలు, పెరుగు తీసుకోవాలి. నీళ్లు అధికంగా తాగాలి. 


బౌద్ధ ఆహారపద్దతులను పాటించడం వల్ల కొన్ని రోజులకే మీకు మార్పు కనిపిస్తుంది. ప్రశాంతంగా అనిపిస్తుంది. కోపం తగ్గుతుంది.


Also read: పచ్చిమిర్చి పులావ్, ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ తింటారు