Puneeth Rajkumar :దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈలోకాన్ని విడిచిపోయి నేటికి (అక్టోబర్‌ 29) ఏడాది గడిచిపోయింది. అయితే 'అప్పు'(రాజ్ కుమార్) లేరన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు సినిమాలు మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. అయితే పిన్న వయసులోనే గుండెపోటుకు గురై ఈ లోకాన్ని విడిచివెళ్లారు.  2021 అక్టోబర్ 29న అప్పు తుదిశ్వాస విడిచారు. పునీత్ రాజ్ కుమార్ మొదటి వర్ధంతిని పురస్కరించుకుని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. పునీత్‌కు కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. తెలుగునాట ఆయనకు అశేష అభిమానగణం ఉంది.  పునీత్ జ్ఞాపకార్థం గుంటూరు జిల్లా తెనాలిలో 21 అడుగుల ఫైబర్ గ్లాస్ విగ్రహాన్ని సిద్ధం చేశారు అభిమానులు. తెనాలికి చెందిన శిల్పులు కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష కలిసి ఈ భారీ విగ్రహాన్ని రెడీ చేశారు. 21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో ఈ విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలుస్తోంది.



కర్ణాటక రత్న అవార్డు 


ఈ విగ్రహాన్ని బెంగళూరుకు తరలించనున్నట్లు శిల్పులు తెలిపారు. ఈ విగ్రహం తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం పట్టిందన్నారు.  ప్రస్తుతం తెనాలిలోని సూర్య శిల్పశాల వద్ద పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శనగా ఉంచారు. నవంబర్ 1న పునీత్ రాజ్ కుమార్‌ గౌరవార్థం కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్టాత్మక కర్ణాటక రత్న పురస్కారాన్ని ప్రదానం చేయనుంది. ఈ కార్యక్రమంలో పునీత్ ఫైబర్ విగ్రహాన్ని ప్రదర్శించనున్నారని తెలుస్తోంది. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజినీకాంత్, టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్యఅతిథులుగా పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఇక అప్పు మొదటి వర్థంతిని పురస్కరించుకుని అభిమానులు కన్నడ నాట అన్నదానం, రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నాను. అలాగే అప్పు నటించిన గంధడ గుడి సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లలో మొక్కలను కూడా ప్రదానం చేయనున్నారు. పునీత్‌ కుటుంబ సభ్యులు కంఠీరవ స్టేడియంలోని అప్పు సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించారు.  


నవంబర్ 1న 


దివంగత కథానాయకుడు పునీత్ రాజ్ కుమార్ (Puneeth Rajkumar) ను కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అత్యున్నత పురస్కారంతో సత్కరించనుంది. ప్రతి ఏడాది నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 'కన్నడ రాజ్యోత్సవ' పేరుతో జరిగే కార్యక్రమంలో రాష్ట్ర పురస్కారాలను ప్రదానం చేస్తారు. ఈ ఏడాది పునీత్‌కు 'కర్ణాటక రత్న' (Karnataka Ratna Puneeth Rajkumar) పురస్కారం ఇవ్వనున్నారు.


ఎన్టీఆర్‌కు ఆహ్వానం!


బెంగళూరులోని విధాన సౌధలో నవంబర్ 1న 'కన్నడ రాజ్యోత్సవ' జరగనుంది. ఆ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ను కర్ణాటక ప్రభుత్వం ఆహ్వానించింది. ఎన్టీఆర్ అంటే పునీత్‌కు ఎంతో అభిమానం. 'యువరత్న' విడుదల సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు తారక్‌ను తన సోదరుడిగా పునీత్ పేర్కొన్నారు. పునీత్ 'చక్రవ్యూహ' సినిమాలో 'గెలియా గెలియా' పాటను ఎన్టీఆర్ పాడారు. ఇద్దరి మధ్య ఉన్న అనుబంధం నేపథ్యంలో యంగ్ టైగర్‌కు ప్రత్యేక ఆహ్వానం అందింది.