Ice Cream Hotspot :  తెలంగాణ ఇప్పటి వరకూ ఐటీ , ఫార్మా రంగాల్లో అభివృద్ధి సాధించిందని అందరికీ తెలుసు. సేవలు.. తయారీ రంగంలో మేడిన్ హైదరబాద్ ఉత్పత్తులు ప్రపంచం మొత్తం వెళ్తూంటాయి. కానీ..  హైదరాబాద్ నుంచి ఐస్‌క్రీమ్‌లు ఎగుమతి అవుతాయని మాత్రం ఎవరికీ పెద్దగా తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకూ అలాంటి భారీ పరిశ్రమ రాలేదు. కొన్ని లోకల్ కంపెనీలు.. మరికొన్ని దిగుమతులు ఉండేవి. కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. తెలంగాణ నుంచి ఐస్‌క్రీములు ఎగుమతి చేయనున్నారు. ఎందుకంటే.. దేశంలోనే అతిపెద్ద ఐస్ క్రీం కంపెనీ జహీరాబాద్‌లో ప్రారంభమయింది. 


నాలుగు వందల కోట్ల పెట్టుబడితో యూనిట్ పెట్టిన హట్సన్ గ్రూప్ 


హట్సన్ కంపెనీకి చెందిన అరుణ్ బ్రాండ్ ఐస్ క్రీములు తయారు చేసే ప్లాంట్ నిర్మాణం పూర్తయింది. ఉత్పత్తి ప్రారంభించింది.  హ‌ట్స‌న్ కంపెనీ ద్వారా రోజుకు 7 ట‌న్నుల చాకోలెట్స్, 100 ట‌న్నుల ఐస్‌క్రీంను ప్రాసెస్ చేసే ప్లాంట్ల ప్రారంభోత్స‌వం జరిగింది. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో తెలిపి సంతోషం వ్యక్తం చేశారు. ఇండియాలో ఐస్ క్రీమ్స్ కు పుట్టినిల్లుగా జ‌హీరాబాద్ నిలిచింద‌ని పేర్కొన్నారు. తెలంగాణలో జ‌రుగుతున్న శ్వేత విప్ల‌వానికి ఇది నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. ఈ యూనిట్ లో ప్ర‌సిద్ధి గాంచిన‌ అరుణ్ ఐస్ క్రీమ్స్, ఐబాకో జ‌హీరాబాద్‌లో ఉత్ప‌త్తి చేస్తున్న‌ట్లు తెలిపారు. 



స్థానిక పాల వ్యాపారుల నుంచి పాల సేకరణ - నిరుద్యోగులకు ఉపాధి


ఈ ప్లాంట్ కోసం నాలుగు వందల కోట్ల రూపాయల వరకూ పెట్టుబడి పెట్టారు. ఈ పెట్టుబడులతో తెలంగాణలో శ్వేత విప్లవం వస్తుందని కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. హట్సన్ సంస్థ స్థానికత రైతులకూ మేలు చేస్తుందన్నారు.  ప్ర‌తి రోజు 10 ల‌క్ష‌ల లీట‌ర్ల పాల‌ను కొనుగోలు చేస్తుంద‌ని, దీని వ‌ల్ల 5 వేల మంది పాడి రైతులు లాభం పొందుతున్నార‌ని తెలిపారు. 1500 మందికి ఉపాధి కూడా ల‌భిస్తుంద‌ని కేటీఆర్ చెప్పారు. 


తెలంగాణలో పెరుగుతున్న పాల ఉత్పత్తి 
 
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 80 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతుంది.  ఈ ఉత్పత్తిని మరింత పెంచి ప్రతి మనిషి ఉపయోగించే పాల సగటును పెంచే ప్రయత్నంలో ప్రభుత్వముంది. ఐ.సి.ఎం.ఆర్. ప్రతి మనిషి రోజుకు 280 మిల్లిలీటర్ల పాలు వినియోగించాలని సిఫారసు చేసింది. తెలంగాణలో సగటు వినియోగం 350 మిల్లిలీటర్లు అయితే హైదరాబాద్‌లో పాల ఉత్పత్తిని మించి వినియోగ డిమాండ్ ఉంది. ఆ డిమాండ్‌ను తీర్చడానికి ఉత్పత్తిని మరింత పెంచాల్సి ఉంది. పాల ఉత్పత్తిలో 30 శాతం పెరుగుదల ఈ ఐదారేళ్లలో కనపడుతుంది. సాంప్రదాయక వ్యవసాయాన్ని తగ్గించడమే కాకుండా ఆర్థిక దిగుబడినిచ్చే ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తూ పశు సంపదను పెంచే పనిలో తెలంగాణ ప్రభుత్వముంది.