Noida News: అత్యాచార కేసు నిందితుడైన ఓ వ్యక్తి.. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సెక్యూరిటీ గార్డుపైకి కారు పోనిచ్చాడు. నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఇదీ జరిగింది


నోయిడాలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. సెక్టార్‌ 120లోగల అమ్రపాలీ జోడియక్‌ సొసైటీలో నివాసం ఉండే నీరజ్‌ సింగ్‌ ఓ ప్రైవేటు కంపెనీలో జనరల్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అదే కంపెనీలో తన సహోద్యోగినిపై అతను అత్యాచారం చేసినట్లు స్థానిక పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది.






దీంతో నీరజ్‌ సింగ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు చాలా సార్లు ప్రయత్నించారు. ఎన్నిసార్లు అపార్ట్‌మెంట్‌ సొసైటీ వద్దకు వచ్చినా అతను తప్పించుకుని తిరుగుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులు మంగళవారం సాయంత్రం సమయంలో సింగ్‌ ఇంట్లోనే ఉన్నాడన్న సమాచారంతో అక్కడికి చేరుకున్నారు.


పారిపోయేందుకు


పోలీసులు నిఘా పెట్టారని తెలుసుకున్న నీరజ్‌.. వెంటనే తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో నీరజ్‌ తనకు అడ్డుగా వచ్చిన సెక్యూరిటీ గార్డును కారుతో బలంగా ఢీ కొట్టాడు. దీంతో సెక్యూరిటీ గార్డు కాలు, భుజాలకు తీవ్ర గాయాలైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: Mainpuri Bypolls 2022: ఉప ఎన్నికల బరిలో అఖిలేశ్ భార్య డింపుల్ యాదవ్