Farm hOuse Case :  ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నం చేశారంటూ నమోదైన కేసులో అరెస్టైన నిందితుల్ని పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. రామచంద్ర భారతి, నంద కుమార్, సింహయాజీ ల రెండు రోజుల పాటు కస్టడీ కి అనుమతిచ్చింది ఏసీబీ కోర్ట్ .  హై సెన్సిటివ్ కేస్ కావడం తో భిన్న కోణాల్లో దర్యాప్తు చేయాల్సి ఉందని కోర్టును పోలీసులు కోరారు. ప్రభుత్వం సిట్ సైతం ఏర్పాటు చేసిందని ఈ సమయం లో నిందితుల కష్టడి అవసరం ఉందన్నారు. దీంతో కోర్టు రెండు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది.  చంచల్ గూడా జైల్లో ఉన్న ముగ్గురు నిందితులను మొయినబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు.  


రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో పోలీసులు వారి స్టేట్ మెంట్ నమోదు చేసే అవకాశం ఉంది. వారి వద్ద లభించిన  నకిలీ ఆధార్ కార్డ్స్, పాన్ కార్డ్స్, వంద కోట్ల డీల్ పై పోలీసులు వివరాలు సేకరించే అవకాశం ఉంది.  ఉదయం 9గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు న్యాయవాది సమక్షంలో ప్రశ్నించాలని ఆ తర్వాత తిరిగి చంచల్​గూడ జైలుకు పంపించాలని న్యాయస్థానం షరతు విధించింది. ముగ్గురు నిందితులను ప్రశ్నించడం ద్వారా కేసులో పురోగతి సాధించవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మరో వైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ కేసు విచారణను హ్యాండోవర్ చేసుకోనుంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌కు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా న‌ల్ల‌గొండ ఎస్పీ రెమా రాజేశ్వ‌రి, సైబరాబాద్ క్రైమ్స్ డీసీపీ క‌మ‌లేశ్వ‌ర్ సింగేన‌వ‌ర్‌, శంషాబాద్ డీసీపీ ఆర్ జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, నారాయ‌ణ‌పేట ఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు, రాజేంద్ర‌న‌గ‌ర్ డివిజన్ ఏసీపీ గంగాధ‌ర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిని నియమించారు.   


ఫామ్ హౌస్ ఫైల్స్ పేరుతో ఈ డీల్స్‌కు సంబంధించిన ఆడియో వీడియోలన్నింటినీ కేసీఆర్ బహిరంగంగా విడుదల చేశారు. అన్ని మీడియా సంస్థలతో పాటు న్యాయమూర్తులకూ పంపించారు. ఈ కేసును సాదాసీదాగా చూడవద్దని కోరారు. అదే సమయంలో తెలంగాణ పోలీసులే కేసు విచారణ జరుపుతూండటం.. పూర్తి స్థాయ ఆధారాలు ఉన్నాయని సీఎం ప్రకటించడంతో సిట్ ఎలాంటి ముందడుగు వేయబోతోందన్న చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కోసం మొత్తం 23 మందితో ముఠా ఉందని కేసీఆర్ ప్రకటించారు. ఈ ముఠా నాయకుడు ఎవరన్నది కూడా తేలాల్సి ఉందని కేసీఆర్ అన్నారు. ఈ కోణంలో సిట్ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. 


ఈ కేసు విషయంలో  ఉన్న ఆధారాలన్నీ మాటల ద్వారానే ఉన్నాయి. డాక్యుమెంట్ల రూపంలో లేవు. డబ్బులు ఎలా తరలించారు.. ఎంత తరలించారు.. ఇతర రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలకు ఎలా చెల్లింపులు చేశారన్నది కూడా సిట్ బృందం బయటకు లాగే అవకాశాలు ఉన్నాయని  చెబుతున్నారు. తెలంగాణ పోలీసులు ఈ కేసు విషయంలో అన్ని ఆధారాలు సేకరిస్తే.. సీఎం కేసీఆర్ చెప్పినట్లుగా సంచలనం అయ్యే అవకాశాలున్నాయి.