Mainpuri Bypolls 2022: ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్‌ ఉప ఎన్నికల బరిలో నిలిచారు. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలకు డింపుల్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దింపింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది.






ఈ స్థానానికి తొలుత అఖిలేశ్ బంధువు ధర్మేంద్ర యాదవ్ లేదా ఆయన మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే చివరకు డింపుల్ యాదవ్‌ పేరును ఖరారు చేశారు. ఈ స్థానానికి డిసెంబరు 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడిస్తారు.


కంచుకోట


మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996లో ములాయం తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మరో మూడుసార్లు 2004, 2009, 2019లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2014 ఉప ఎన్నికలో అఖిలేశ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటును గెలుచుకున్నారు.


ములాయం సింగ్ లేకుండా సమాజ్‌వాదీ పార్టీ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక ఇదే.



  1. ములాయం మూడు సార్లు ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో 1996-98 వరకు రక్షణ మంత్రిగా కూడా ఉన్నారు.

  2. ఎక్కువ కాలం పాటు పార్లమెంటేరియన్‌గా కొనసాగిన అతి తక్కువ మంది నేతల్లో ములాయం ఒకరు. ఆయన తన తుదిశ్వాస వరకు మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ఎంపీగా ఉన్నారు. గతంలో అజంగఢ్, సంభాల్ నియోజకవర్గాలకు పార్లమెంటు సభ్యుడిగా పనిచేశారు.

  3. నేతాజీగా ప్రజలు పిలుచుకునే ములాయం మొదటిసారిగా 1967లో ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభకు సభ్యునిగా ఎన్నికయ్యారు.

  4. ములాయం 1982-1985 మధ్య శాసన మండలి సభ్యుడిగా పని చేశారు. మొత్తం 10 సార్లు ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభకు ఆయన సభ్యుడిగా ఉన్నారు.

  5. ములాయం సింగ్ మాల్తీ దేవిని మొదటి వివాహం చేసుకున్నారు. అఖిలేశ్ యాదవ్.. ములాయం, మాల్తీ దేవిల కుమారుడు. సాధన గుప్తాతో ములాయం రెండో వివాహం జరిగింది. సాధన, ములాయంల కుమారుడు ప్రతీక్ యాదవ్.

  6. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్ ప్రకారం, ములాయం సింగ్ యాదవ్ 15 కోట్లకు పైగా ఆస్తులకు యజమాని. నామినేషన్ దాఖలు చేసే సమయంలో అఫిడవిట్‌లో తన చర, స్థిరాస్తులు రూ.16 కోట్ల 52 లక్షల 44 వేల 300గా ఆయన పేర్కొన్నారు.

  7. అంతకుముందు 2014 లోక్‌సభ ఎన్నికల్లో ములాయం సింగ్ తన అఫిడవిట్‌లో రూ.11 కోట్ల ఆస్తులను ప్రకటించారు.


Also Read: Gujarat Polls 2022: రవీంద్ర జడేజా భార్యకు భాజపా టికెట్- మరి ప్రచారం చేస్తాడా?