Mehbooba Mufti:


గెస్ట్‌హౌజ్‌లో ఉండొద్దని నోటీసులు..


కశ్మీర్‌లోని పీపుల్స్‌ డెమొక్రటిక్ పార్టీ (PDP) చీఫ్ మెహబూబా ముఫ్తీ తన ఇల్లు విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్‌లో ఆమెకు పెద్ద బంగ్లా ఉంది. 2005లో మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్‌ హయాంలో ఈ గెస్ట్ హౌజ్‌ను అప్పగించారు. అప్పటికే ఆయన సీఎంగా మూడేళ్ల పదవి కాలం పూర్తి చేశారు. పీడీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అప్పటికి జమ్ము కశ్మీర్‌ను పరిపాలిస్తోంది. 2016 నుంచి 2018 వరకూ సీఎంగా ఉన్న మెహబూబా ముఫ్తీ...ఆ పదవి నుంచి దిగిపోయాక కూడా అదే గెస్ట్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. 2018లో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. ఆ తరవాత కూడా ఆమె అదే బంగ్లాలో ఉండేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతానికి మెహబూబా ముఫ్తీకి ఏ పదవి లేదు. అందుకే...ఆమె ఆ గెస్ట్ హౌజ్‌ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 15న Estate Department అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే..మెహబూబా ముఫ్తీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పది రోజుల తరవాత అధికారులు మరోసారి నోటీసులు పంపారు. "అనధికారికంగా ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారు" అంటూ స్పష్టం చేశారు. 


అధికారం లేదు..


"ప్రభుత్వానికి చెందిన గెస్ట్‌హౌజ్‌లో నివసించేందుకు ఎలాంటి అధికారం లేదు" అని అధికారులు వెల్లడించారు. నవంబర్ 15వ తేదీలోగా కచ్చితంగా ఖాళీ చేయాల్సిందేనని ఆదేశించారు. అయితే..మెహబూబా మాత్రం ఈ నోటీసులపై మండి పడుతున్నారు. తనకు భద్రతా పరమైన కారణాలతో ఈ గెస్ట్‌హౌజ్‌లో ఉండేందుకు అనుమతినిచ్చారని, పదవులతో దీనికి ఎలాంటి సంబంధం లేదని వాదిస్తున్నారు. అటు ప్రభుత్వం మాత్రం ఈ వాదనను కొట్టి పారేస్తోంది. ఈ గెస్ట్‌హౌజ్‌కు ప్రత్యామ్నాయంగా వేరే నివాసం ఏర్పాటు చేస్తామని తేల్చి చెప్పింది. తుల్సీబాగ్‌లోని ఓ వీఐపీ బంగ్లాను ఆమెకు కేటాయించారు. ఈ ఇంట్లో ఉండేందుకు ఆమె ఆసక్తి కనబరుస్తున్నప్పటికీ..భద్రతా పరంగా ఎంత మేర సురక్షితం అని ప్రశ్నిస్తున్నారు పీడీపీ నేతలు. 


బంగ్లా బాలేదు: ముఫ్తీ


ఈ వీఐపీ బంగ్లా సరిగా లేదని కొందరు నేతలు విమర్శిస్తున్నారు. మెహబూబా కూడా దీనిపై స్పందించారు. "తుల్సీబాగ్‌లో నాకు ఇచ్చిన బంగ్లా బాగోలేదు. భద్రతా పరంగానూ అది సురక్షితం కాదు. నేను మా సోదరి వాళ్ల ఇంటికి వెళ్లిపోతాను. నాకు అంతకు మించి వేరే దారి లేదు. ప్రభుత్వం ఇచ్చిన బంగ్లాలో ఉండకూడదని నిర్ణయం తీసుకున్నాను" అని స్పష్టం చేశారు. అటు భద్రతా అధికారులు మాత్రం ఆ ప్రాంతంలో సెక్యూరిటీ రివ్యూ చేస్తున్నట్టు వెల్లడించారు. ఇలా ప్రభుత్వ అధికారులు, మెహబూబా మధ్య వాగ్వాదం కొనసాగుతోంది. అధికారులు తనతో ఏ మాత్రం చర్చించకుండానే నిర్ణయాలు తీసుకుంటున్నారని మెహబూబా ఆరోపిస్తున్నారు. జమ్ముకశ్మీర్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చిన తరవాత కేంద్రం ఇక్కడ ఎన్నో మార్పులు చేర్పులు తీసుకొచ్చింది. పరిపాలనా పరంగానూ మార్పులు వచ్చాయి. మరి కొద్ది రోజుల్లోనే ఇక్కడ ఎన్నికలు జరగనున్నాయి. 


Also Read: Delhi MCD Polls 2022: ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన ఢిల్లీ బీజేపీ, వాళ్లకు పక్కా ఇళ్లు ఇస్తామని హామీ