Delhi MCD Polls 2022:


మురికి వాడలో ఉండే వారికి ఇళ్లు..


ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది బీజేపీ. దీనికి వచన్ పత్ర అని పేరు పెట్టింది. ఢిల్లీ ప్రజలందరికీ స్వచ్ఛమైన తాగు నీరు అందించటమే తమ లక్ష్యమని వెల్లడించింది. ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అందిస్తామని హామీ ఇచ్చింది. వీటితో పాటు మేనిఫెస్టోలో మరో కీలకమైన హామీని చేర్చింది. మురికివాడల్లో ఉండే వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రామిసరీ నోట్‌ను కూడా విడుదల చేసింది బీజేపీ. ఢిల్లీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశ్ గుప్తా కేజ్రీవాల్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. "ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచి నీళ్లు అందించాల్సిందే. కేజ్రీవాల్‌కు ఈ సమస్య పట్టదు. ఎందుకంటే ఆ పార్టీ ట్యాంకర్ మాఫియాతో చేతులు కలిపింది" అని మండి పడ్డారు. కేజ్రీవాల్ హామీలు ఇస్తారని, వాటిని తీర్చేది మాత్రం ఉండదని విమర్శించారు. ఇచ్చిన హామీలన్నింటినీ  బీజేపీ తప్పకుండా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మురికి వాడల్లో నివసించే వారికి ఇళ్లు ఇస్తానన్న హామీని నెరవేర్చారని, ఢిల్లీలోనూ ఇది పక్కాగా అమలు చేస్తామని వెల్లడించారు. కేజ్రీవాల్‌ ఢిల్లీని ఓ గ్యాస్ ఛాంబర్‌లా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






పొల్యూషన్ పాలిటిక్స్..


ఢిల్లీ కాలుష్య సమస్య రోజురోజుకీ సంక్లిష్టమవుతోంది. ఎయిర్ క్వాలిటీ పడిపోతూ వస్తోంది. మరోసారి అక్కడి గాలి నాణ్యత "అత్యంత ప్రమాదకర స్థాయికి" చేరుకుందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం...ఢిల్లీలో AQI 339గా నమోదైంది. అటు ఎన్‌సీఆర్ ప్రాంతంలోనూ దాదాపు ఇదే స్థాయిలో వాయునాణ్యత పడిపోయింది. నోయిడాలో 337, గురుగ్రామ్‌లో 338గావెల్లడైంది. System of Air Quality and Weather Forecasting And Research (SAFAR) ప్రకారం..వచ్చే మూడు రోజుల పాట ఢిల్లీలో ఇవే పరిస్థితులు కొనసాగనున్నాయి. రెండ్రోజుల క్రితం ఢిల్లీలో AQI 326గా నమోదైంది. పరిస్థితులు మరీ దిగజారుతున్నందున కేంద్రానికి చెందిన ఎయిర్ క్వాలిటీ ప్యానెల్ అప్రమత్తమైంది. ఢిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించింది. నిర్మాణాలు, కూల్చివేతలు జరుగుతున్న ప్రాంతాల్లో యాంటీ స్మాగ్ గన్స్ వినియోగించాలని సూచించింది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ కూడా కొన్ని చర్యల్ని సూచించింది. 

"పంజాబ్‌లో జరుగుతున్న దానికి పూర్తి స్థాయి బాధ్యత వహిస్తాం. మేము అధికారంలోకి వచ్చి కేవలం 6 నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ ఎన్నో కట్టడి చర్యలు తీసుకున్నాం. వచ్చే ఏడాది నాటికి రైతులు అలా గడ్డికాల్చకుండా జాగ్రత్తపడతాం" అని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.
ఇప్పుడిప్పుడే పంజాబ్‌లో శాంతి భద్రతలు అదుపులోకి వస్తున్నాయని, మిగతా సమస్యలు పరిష్కరించడానికి ఇంకాస్త సమయం ఇవ్వాలని చెప్పారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు. "కేంద్ర ప్రభుత్వం మాకు సహకరిస్తే కలిసి కట్టుగా ఈ కాలుష్య సమస్యను పరిష్కరించేందుకు వీలవుతుంది" అని స్పష్టం చేశారు. కేవలం తమ వైపే వేలెత్తి చూపించటం సరికాదని వెల్లడించారు. "ఢిల్లీలో కాలుష్య స్థాయి ప్రమాదకరంగా మారటానికి మా ప్రభుత్వం మాత్రమే కారణం కాదు" అని వెల్లడించారు.  


Also Read: Rajnath Singh: ఏ నిముషానికి ఏమి జరుగునో, యుద్ధానికి సిద్ధమవండి - సైన్యానికి రాజ్‌నాథ్ సింగ్ ఆదేశాలు