TGSRTC Special Buses On Fish Prasadam Distribution: మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా ఈ నెల 8, 9 తేదీల్లో చేప ప్రసాదం (Fish Prasadam) పంపిణీ చేపడుతున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో (Nampally Exhibition Ground) చేప మందు పంపిణీకి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ క్రమంలో టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) చేప మందుకు తరలివచ్చే వారి కోసం ప్రత్యేక బస్సులను నడపనుంది. ఈ నెల 7 నుంచి రైల్వే స్టేషన్లు, ప్రధాన బస్ స్టేషన్లు, విమానాశ్రయం నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకూ ఈ సర్వీసులు తిరగనున్నట్లు అధికారులు తెలిపారు. చేప మందు కోసం వచ్చే వారు వీటిని వినియోగించుకోవాలని సూచించారు.


ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు


సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 9 బస్సులు, కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి 7, జేబీఎస్ నుంచి 9, ఎంజీబీఎస్ నుంచి 9, ఈసీఐఎల్ క్రాస్ రోడ్ నుంచి 9, శంషాబాద్ విమానాశ్రయం నుంచి 7 బస్సులను నడిపిస్తున్నారు. ఇక సిటీలోని పలు ప్రాంతాల నుంచి 80 ప్రత్యేక బస్సులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు నడవనున్నాయి. దిల్ సుఖ్ నగర్ నుంచి 7, ఎన్జీవోస్ కాలనీ 7, మిథాని 7, ఉప్పల్ 7, ఛార్మినార్ 5, గోల్కొండ 5, రామ్‌నగర్ 5, రాజేంద్రనగర్ 7, రిసాలబజార్ 5, పటాన్ చెరు 5, కేపీహెచ్‌బీ కాలనీ 5, గచ్చిబౌలి నుంచి 5, జీడిమెట్ల నుంచి సర్వీసులను నడపనున్నారు. అటు, దిల్ సుఖ్ నగర్, అఫ్జల్ గంజ్ నుంచి వచ్చే సాధారణ బస్సులు, GPO ద్వారా నాంపల్లి మీదుగా డనవనున్నాయి. ప్రయాణీకుల సౌలభ్యం కోసం ప్రత్యేక కౌంటర్లను ఏర్పాట్లు చేశామని.. ఏమైనా సందేహాలుంటే సిబ్బందిని సంప్రదించాలని సూచించారు.


ఏర్పాట్లు పూర్తి


ప్రతీ ఏడాది మృగశిర కార్తె ప్రారంభం సందర్భంగా బత్తిని సోదరులు.. ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధిత బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు. ఈ మందు కోసం హైదరాబాద్ నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివస్తుంటారు. ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలివస్తారు. కొంతమంది 2 రోజుల ముందు నుంచే నగరానికి వచ్చి ఇక్కడ బస చేస్తుంటారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం(Nampally Exhibition Ground)లో  కౌంటర్లు ఏర్పాటు చేసి వరుస క్రమంలో ఈ మందు అందజేస్తారు. రోగులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. బత్తిని కుటుంబం(Bathini Family) కొన్ని దశాబ్దాలుగా ఈ చేపమందును ఉచితంగా అందజేస్తోంది. బత్తిన శంకర్‌గౌడ్ వాళ్ల తాతకు ఓ సాధువు ఈ మందు తయారీ విధానం నేర్పించి ఉచితంగా అందజేస్తే కుటుంబానికి మేలు జరుగుతుందని చెప్పడంతో అప్పటి నుంచి ఈ చేపప్రసాదం అందిస్తున్నారు. ఇటీవలే హరినాథ్‌గౌడ్ మరణించినా... ఆయన కుటుంబ సభ్యులు ఈ ఏడాది చేపమందు పంపిణీ చేయనున్నారు. అయితే, ప్రసాదం ఉచితంగా అందిస్తున్నా.. చేపలను మాత్రం ఎవరికి వారే సొంతంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీని కోసం మైదానం ఆవరణలోనే ప్రత్యేక స్టాళ్లు పెట్టి కొర్రమీను చేప పిల్లలను విక్రయిస్తుంటారు.


Also Read: MLC Elections: నల్గొండ - ఖమ్మం - వరంగల్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ - క్షణక్షణ ఉత్కంఠ, విజేత ఎవరో?