PM Modi: NDA పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా నరేంద్ర మోదీ ప్రసంగించారు. తనకు మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు తెలిపారు. లక్షలాది మంది కార్యకర్తలు ఎండవేడినీ పట్టించుకోకుండా కష్టపడ్డారని ప్రశంసించారు. పార్లమెంట్‌ వేదిక నుంచి ఆ కార్యకర్తలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని వెల్లడించారు. తమను గెలిపించిన ప్రజలకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అని స్పష్టం చేశారు. విజయం సాధించి ఇక్కడి వరకూ వచ్చిన నేతలందరికీ అభినందనలు తెలిపారు. ఇంత మంది కీలక నేతలకు ఆహ్వానం పలికే అవకాశం రావడం ఆనందంగా ఉందని మోదీ వెల్లడించారు. లక్షలాది కార్యకర్తలు పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించారని అన్నారు. ఎన్నికలకు ముందు కూటమి కట్టి విజయం సాధించడం చరిత్రాత్మకం అని మోదీ స్పష్టం చేశారు. NDA కూటమి నాలుగో ప్రయాణానికి సిద్ధమైందని వెల్లడించారు. నమ్మకం అనే బంధమే తమ కూటమిని కలిపి ఉంచిందని తేల్చి చెప్పారు. 22 రాష్ట్రాల్లో NDA కి ప్రజల మద్దతు లభించడం గొప్ప విషయం అని అన్నారు. ఇవి తనకు భావోద్వేగ క్షణాలు అని వెల్లడించారు మోదీ. ఆదివాసీలు ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాల్లో 7 రాష్ట్రాల ప్రజలు NDAకి మద్దతునిచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. 






కూటమిలో ఏ పార్టీపైనా పక్షపాతం ఉండదని, అందరూ తనకు సమానమే అని తేల్చి చెప్పారు ప్రధాని మోదీ. ఈ సందర్భంగా కాంగ్రెస్‌కీ చురకలంటించారు. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ ఎంత తొందరగా ప్రభుత్వం ఏర్పాటు చేసిందో అంతే త్వరగా ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందని విమర్శించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఈ రెండు రాష్ట్రాల్లోనూ NDAకి భారీ మద్దతు లభించిందని వెల్లడించారు. ఈ సందర్భంగా EVMల పని తీరుపై అనుమానాలు వ్యక్తం చేసిన ప్రతిపక్షాలకీ చురకలు అంటించారు. కాంగ్రెస్ పదేళ్లలో కనీసం 100 సీట్లు కూడా సాధించలేకపోయిందని ఎద్దేవా చేశారు. జూన్ 4వ తేదీన ఫలితాలు వచ్చాక ప్రతిపక్షాలు EVMలను ప్రశ్నించడం మానుకున్నారని సెటైర్లు వేశారు. ఇది ప్రజాస్వామ్య బలం అని తేల్చి చెప్పారు.