CMs Diwali Wishes: దీపావళి పండుగను (Diwali Festival) పురస్కరించుకుని ప్రజలందరికీ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ (CM KCR), జగన్ (CM Jagan) శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ అందరి ఇళ్లలో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంటా ఆనందం వెల్లి విరియాలని అన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ బాణాసంచా కాల్చాలని, కుటుంబ సభ్యులతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
చెడుపై విజయానికి ప్రతీక
దీపావళి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ తెలిపారు. చీకటిని పారద్రోలే వెలుగుల పండుగకు హిందూ సంస్కృతి, సంప్రదాయంలో విశేష ప్రాశస్త్యం ఉందని అన్నారు. 'దీపాల వెలుగులు మనలో అజ్ఞానాన్ని తొలగించి చైతన్యాన్ని రగిలించి నూతనోత్తేజంతో ముందడుగు వేసేలా ప్రేరణనిస్తాయి. జీవితం పట్ల స్పష్టతతో ఉంటే ప్రతి రోజూ పండుగే అవుతుంది. మనం పయనించే ప్రగతి పథంలో అడగడుగునా అడ్డుపడే నరకాసురుల నుంచి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.' అని సీఎం పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా, నిబంధనలు పాటిస్తూ, జాగ్రత్తగా కుటుంబ సభ్యులతో కలిసి బాణాసంచా కాల్చాలని దీపాల పండుగను ఉత్సాహంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. లక్ష్మీదేవి కృపా కటాక్షాలు తెలంగాణ ప్రజలందరిపై ఉండాలని, ప్రతి ఇంటా సుఖ సంపదలు కలగాలని ఆకాంక్షించారు.
'ప్రతి ఇంటా ఆనందం నిండాలి'
దీపావళి సందర్భంగా ప్రతి ఇంటా సంతోషం వెల్లివిరియాలని, దీపాల పండుగతో ఆనందం నిండాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. 'దీపావళి అంటనే కాంతి, వెలుగు. చీకటిపై వెలుగు, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయాలకు ప్రతీక. ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలి. అందరి జీవితాలు శోభాయమానంగా వెలుగొందాలి. ప్రతి ఇంటా ఆనంద కాంతులు విరాజిల్లాలని కోరుకుంటున్నా.' అంటూ పేర్కొన్నారు.