Telangana Origin Candidates Lost In UK Elections: బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak) ఓటమి పాలయ్యారు. గత 14 ఏళ్లుగా ఎదురులేని కన్జర్వేటివ్ పార్టీకి (Conservative Party) ఈసారి ఎదురుదెబ్బ తగిలింది. ఈ నెల 4న ఎన్నికలు ముగియగా శుక్రవారం ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో లేబర్ పార్టీ (Labour Party) భారీ మెజార్టీతో విజయం సాధించింది. ఆ పార్టీ తరఫున కీర్ స్టార్మర్ (Keir Stramar) ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు. ఈ పార్టీ మెజార్టీ మార్క్ దాటి 360కి పైగా స్థానాలను కైవసం చేసుకోగా.. ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్జర్వేటివ్ పార్టీ 80 సీట్లకు పైగా విజయం సాధించింది. అధికారం చేజిక్కించుకోవాలంటే 326 స్థానాల్లో గెలుపొందాలి. ఈ రెండు ప్రధాన పార్టీలతో పాటు లిబరల్ డెమోక్రాట్లు, గ్రీన్ పార్టీ, స్కాటిష్ నేషనల్ పార్టీ, ఎస్‌డీఎల్‌పీ, డెమోక్రాటిక్ యూనియనిస్ట్ పార్టీ, షిన్ ఫీన్, ప్లయిడ్ కమ్రి, వర్కర్స్ పార్టీ, యాంటీ ఇమ్మిగ్రేషన్ రిఫార్మ్ పార్టీతో పాటు పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా బరిలో నిలిచారు.
తెలుగు వ్యక్తుల ఓటమి
కాగా, ఈ ఎన్నికల్లో భారత సంతతి అభ్యర్థులకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. ఇద్దరు తెలుగు వ్యక్తులు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అంతర్జాతీయ వక్త, రచయితగా పేరొందిన ఉదయ్ నాగరాజు (Uday Nagaraju) లేబర్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు. ఆయన నార్త్ బెడ్‌ఫోర్డ్‌షైర్ స్థానం నుంచి పోటీ చేయగా.. ఊహించని ఫలితం ఎదురైంది. ఈ స్థానంలో కన్జర్వేటివ్ పార్టీకి చెందిన రిచర్డ్ ఫుల్లర్ 19,981 ఓట్లతో విజయం సాధించారు. నాగరాజు 14,567 ఓట్లతో రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఈయన స్వస్థలం తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా కోహెడ్ మండలంలోని శనిగరం. యూకేలోని ప్రఖ్యాత వర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్‌లో పాలనా శాస్త్రంలో పీజీ పూర్తి చేశారు. నాగరాజు భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు బంధువు.
అలాగే, మరో తెలుగు సంతతి వ్యక్తి చంద్ర కన్నెగంటి (Chandra Kanneganti) సైతం కన్జర్వేటివ్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈయన స్టోక్ ఆన్ ట్రెంట్ సెంట్రల్ స్థానం నుంచి బరిలో నిలిచారు. ఇక్కడ లేబర్ పార్టీకి చెందిన గారెత్ స్నెల్ విజయం సాధించగా.. చంద్ర 6,221 ఓట్లతో మూడో స్థానానికే పరిమితమయ్యారు. చంద్ర నిజామాబాద్ జిల్లా కోటగిరికి చెందినవారు. చదువు పూర్తైన తర్వాత లండన్ వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. జనరల్ ప్రాక్టిషనర్‌గా సేవలందిస్తూనే రాజకీయాల వైపు అడుగులు వేశారు. స్టోక్ ఆన్ ట్రెంట్ నగరంలో రెండుసార్లు కౌన్సిలర్‌గా, ఒకసారి మేయర్‌గా పనిచేశారు. ఈసారి ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలయ్యారు.
మరోవైపు, యూకే ఎన్నికల్లో ఓడిపోయిన రిషి సునాక్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. బంకింగ్‌హమ్ ప్యాలెస్‌లోని కింగ్ ఛార్లెస్‌ని కలిసి తన రాజీనామాని సమర్పించారు. ప్రజల ఆగ్రహాన్ని అర్థం చేసుకున్నానని.. ఎన్నికల్లో పార్టీ ఓటమికి పూర్తిగా తానే బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. దేశం కోసం తాను ఏమి చేయగలనో అన్నీ చేశానని.. ప్రజాతీర్పుని గౌరవించాల్సిన అవసరముందని అన్నారు.
Also Read: UK Election Results 2024: యూకే కొత్త ప్రధానిగా స్టార్మర్ ఖాయమైనట్టే, ఒక్క విజయంతో అరుదైన రికార్డు