Top 10 Headlines Today: 


తెలంగాణ ఎన్నికల ప్రచారం - నేటి షెడ్యూల్


తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రతి రోజూ 3 లేదా 4 నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ప్రచారం వేగవంతం చేశారు. మరోవైపు, కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ శుక్ర, శనివారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్నారు. పాలకుర్తి, హుస్నాబాద్, కొత్తగూడెం సభల్లో ఆమె పాల్గొంటారు. అటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సైతం మరోసారి తెలంగాణలో పర్యటించనున్నారు. 3 రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం ఆర్మూర్, రాజేంద్రనగర్ లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించనున్నారు. మరోవైపు, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు బహిరంగ సభల్లో పాల్గొంటారు. అలాగే కామారెడ్డిలోని దోమకొండ, బీబీపేట కార్నర్ మీటింగ్స్ లో పాల్గొంటారు.


తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన


బంగాళాఖాతంలో అల్పపీడనం బలహీనపడటంతో రాష్ట్రంలో 3 రోజులు పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నల్గొండ జిల్లా దామరచర్లలో 27.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 26 వరకూ పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, భారీ వర్షాలు లేవని స్పష్టం చేశారు. అటు, ఏపీలోనూ రాబోయే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు.


విశాఖ ఫిషింగ్ హార్బర్ ప్రమాదం - పవన్ ఆర్థిక సాయం


విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో బోట్లు దగ్ధమై నష్టపోయిన బాధితులను జనసేనాని పవన్ కల్యాణ్ శుక్రవారం పరామర్శించనున్నారు. బోట్ల యజమానులకు రూ.50 వేల చొప్పున ఆర్థిక సాయం అందజేస్తారు. అనంతరం ఫిషింగ్ హార్బర్ ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధిత మత్స్యకారులతో మాట్లాడతారు. 


శ్రీవారి భక్తులకు శుభవార్త - నేడు టికెట్లు విడుదల


తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను శుక్రవారం ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. 2024, ఫిబ్రవరి నెలకు సంబంధించిన కోటాను ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. గదుల కోటాను శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచుతామన్నారు. www.tirumala.org అధికారిక సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని తెలిపారు.


తుది దశకు రెస్క్యూ ఆపరేషన్


ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులు శుక్రవారం బయటకు రానున్నారు. ఇప్పటికే ఓ పైప్‌ని అమర్చిన సిబ్బంది మరో పైప్‌ని జతచేసి ఎస్కేప్ రూట్‌ తయారు చేసేందుకు శ్రమిస్తోంది. ఆ పైప్‌ల ద్వారానే కార్మికులను బయటకు తీసుకురానుంది. వారిని స్ట్రెచర్స్‌ సాయంతో ఒకరి తరవాత ఒకరిని లోపలి నుంచి బయటకు తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. తొలుత ఒకరి తర్వాత ఒకరు పాక్కుంటూ బయటకు రావాలని సూచించినా వారి ఆరోగ్య  పరిస్థితి దృష్ట్యా ప్లాన్ మార్చారు. రెండు పైప్‌లు అమర్చిన తర్వాత NDRF సిబ్బంది వీటి ద్వారానే లోపలికి వెళ్లి ఒక్కొక్క కార్మికుడిని వీల్డ్ ఛైర్‌ ద్వారా బయటకు పంపుతారు. 


ఎస్టీల ప్రాతినిధ్యంపై సుప్రీం కీలక ఆదేశాలు


ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు అనుగుణంగా రాజ్యాంగ నిబంధనలకు లోబడి సరైన ప్రాతినిధ్యానికి భరోసా కల్పించేలా తాజాగా డీలిమిటేషన్‌ కమిషన్‌ను వేయాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే ఆ కమిషన్‌ ఇతర వర్గాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేలా చట్టాలను సవరించాలని పార్లమెంటుకు సూచించకూడదని, చట్టసభల్లో ఎస్టీలకు సంబంధించిన అంశాన్నే పరిశీలించాలని ఆదేశించింది. ఇతర వర్గాల రిజర్వేషన్లపై చట్టం చేసే అధికారం పార్లమెంటుదేనని అభిప్రాయపడింది. సిక్కిం, పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీల్లో లింబు, తమాంగ్‌ తెగలకు రిజర్వేషన్లను కల్పించాలని దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపి ఈ ఆదేశాలిచ్చింది. 


ఎంపీలకే డిజిటల్ యాక్సెస్


తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ మహువా మొయిత్రా వ్యవహారం నేపథ్యంలో లోక్‌సభ సెక్రెటేరియట్‌ కఠిన చర్యలకు ఉపక్రమించింది. పార్లమెంట్‌ హౌజ్‌ పోర్టల్‌ లేదా పార్లమెంట్‌ యాప్‌ల పాస్‌వర్డ్‌లు, ఓటీపీలను ఎంపీలు ఇతరులతో షేర్‌ చేసుకోవడాన్ని నిషేధించింది. పార్లమెంట్‌ సభ్యులు మాత్రమే డిజిటల్‌ సంసద్‌ పోర్టల్‌ లేదా యాప్‌లను యాక్సెస్‌ చేసుకోవాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది. ఎంపీలు ఇకపై తమ అధికారిక ఈ – మెయిల్‌ పాస్‌వర్డ్‌ను వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులకు కూడా షేర్‌ చేయడం నిషిద్ధమని స్పష్టం చేసింది. సభలో ప్రశ్నలు అడగడం కోసం ముందుగానే నోటీసులు ఇవ్వడానికి, ట్రావెల్‌ బిల్లులు సమర్పించడానికి పార్లమెంట్‌ పోర్టల్, యాప్‌లను ఎంపీలు ఉపయోగిస్తుంటారు. 


నేటి నుంచే కాల్పుల విరమణ


ఇజ్రాయెల్‌, హమాస్‌ కాల్పుల విరమణ ప్రక్రియ శుక్రవారం ఉదయం నుంచి అమల్లోకి రానుంది. బందీల విడుదల ప్రక్రియ ప్రారంభం కానుంది. గురువారం సాయంత్రం వరకూ చర్చలు జరిపిన ఖతార్‌ చివరకు రెండు వర్గాలను అంగీకరింపజేసింది. శుక్రవారం నుంచి నాలుగు రోజులపాటు కాల్పుల విరమణ అమల్లో ఉంటుంది. ఈ సమయంలో బందీలను ఇజ్రాయెల్‌, హమాస్‌ పరస్పరం విడతల వారీగా విడుదల చేసుకుంటాయి. హమాస్‌ 50 మందిని విడుదల చేయనుండగా ఇజ్రాయెల్‌ 150 మందిని వదిలిపెట్టనుంది. విడుదలకు అర్హులైన 300 మంది జాబితాను ఇప్పటికే ఇజ్రాయెల్‌ విడుదల చేసింది. శుక్రవారం మధ్యాహ్నానికి 13 మంది బందీలు విడుదల కానున్నారు.


బ్రిటన్ వీసాల్లో భారతీయుల అగ్రస్థానం


బ్రిటన్‌ వీసాలు పొందుతున్న వారిలో భారతీయులు ముందంజలో ఉన్నారు. సెప్టెంబరుతో ముగిసిన 2023 వార్షిక గణాంకాలను బ్రిటన్‌కు చెందిన జాతీయ గణాంకాల కార్యాలయం (ఓఎన్‌ఎస్‌) గురువారం వెల్లడించింది. నైపుణ్యం గల ఉద్యోగులు, వైద్య, ఆరోగ్య సంరక్షణ రంగానికి చెందిన వారికి మంజూరైన వీసాలు కిందటేడాది కంటే రెట్టింపు (135%) కావడంతో ఆ సంఖ్య 1,43,990కు చేరుకుందని వెల్లడించింది. వీరిలో భారతీయులు (38,866) అగ్రస్థానంలో, నైజీరియన్లు (26,715), జింబాబ్వేయన్లు(21,130) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. 2023లో భారతీయ విద్యార్థులు 1,33,237 మందికి బ్రిటన్‌ వీసాలు మంజూరయ్యాయి. 


'కోటబొమ్మాళి'లో స్ట్రాంగ్ పొలిటికల్ సెటైర్స్  - ట్విట్టర్ రివ్యూస్


శతాధిక చిత్ర కథానాయకుడు శ్రీకాంత్, విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'కోట బొమ్మాళి పీఎస్'. ఇందులో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ జంటగా నటించారు. తేజా మార్ని ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే గురువారం రాత్రి టాలీవుడ్ ప్రముఖులు కొందరికి షోలు వేయగా, దర్శకులు హరీష్ శంకర్, చైతన్య దంతులూరితో పాటు హీరోలు శ్రీవిష్ణు, నిఖిల్ సినిమా చూశారు. కోటబొమ్మాళి పీఎస్' సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అని సెలబ్రిటీలు తెలిపారు. ముఖ్యంగా శ్రీకాంత్ & వరలక్ష్మీ శరత్ కుమార్ మధ్య సన్నివేశాలు ఉత్కంఠ కలిగిస్తాయని, సినిమాలో పొలిటికల్ డైలాగులు గట్టిగా ఉన్నట్లు తెలుస్తోంది.


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆


*T&C Apply