Tellam venktrao : ఖమ్మం కాంగ్రెస్ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. పొంగులేటితో పాటు కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్, బీఆర్‌ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు సమక్షంలో హైదరాబాద్‌లో తన అనుచరులతో కలిసి ఆయన గులాబీ కండువా కప్పుకున్నారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు.
కాంగ్రెస్‌ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్లేనని కేటీఆర్ ఈ సందర్భంగా విమర్శించారు. కాంగ్రెస్ స్వభావం తెలుసుకోవడానికి తెల్లం వెంకట్రావుకు నెలకంటే ఎక్కువ సమయం పట్టలేదని అన్నారు.
తెల్లం వెంకట్రావు 2014లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసి ఓడిపోయారు. ఆయన అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. అప్పటి నుంచి బీఆర్‌ఎస్ భద్రాచలం భద్రాచలం నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కొన్నినెలల నుంచి పొంగులేటితో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగించారు. కాంగ్రెస్ లో చేరేముందు.. పొంగులేటి అన్ని నియోజకవర్గాల్లో తిరిగి.. తమ అభ్యర్థులను ప్రకటించారు. అలా భద్రాచలం నుంచి తన అభ్యర్తిగా తెల్లం వెంకట్రావు ను ప్రకటించారు. ఏ పార్టీలో చేరినా అందరికీ టిక్కెట్లు ఇప్పిస్తానని భరోసా ఇచ్చారు.
అయితే కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత తెల్లం వెంకట్రావుకు టిక్కెట్ దక్కడం కష్టమైపోయింది. భద్రాచలంలో కాంగ్రెస్ తరపున గెలిచిన పొదెం వీరయ్య ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనను కాదని .. తెల్లం వెంకట్రావుకు టిక్కెట్ ఇచ్చే పరిస్థితి లేదు. దీన్ని పసిగట్టిన బీఆర్ఎస్ ముఖ్య నేతలు వెంటనే తెల్లం వెంకట్రావుతో చర్చలు జరిపారు. టిక్కెట్ కూడా ఆఫర్ ఇవ్వడంతో ఆయన పార్టీలో చేరిపోయారు. ఒక్క తెల్లం వెంకట్రావే కాదు కొద్ది రోజుల నుంచి పొంగులేటి క్యాంప్ కు గుడ్ బై చెబుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. నియోజకవర్గ నేతలు గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇది ఒకందుకు మంచిదేనని.. వారందరికీ కాంగ్రెస్ లో టిక్కెట్లు దక్కడం అనుమానమేనంటున్నారు. మొత్తంగా పొంగులేటికి ఉన్న అనుచరవర్గం మొల్లగా బీఆర్ఎస్‌లో చేరిపోతూండటం మాత్రం.. పొంగులేటికి ఇబ్బందికరంగా మారింది.