Multibagger Defence Stocks: గత మూడు రోజులుగా, ఒక్క అడుగు ముందుకు వేయడానికి స్టాక్ మార్కెట్ ఆపసోపాలు పడితే, రెండు డిఫెన్స్ PSU స్టాక్స్ మాత్రం మిస్సైళ్లలా దూసుకెళ్లాయి.
రక్షణ రంగంలోని ప్రభుత్వ రంగ సంస్థలు GRSE, కొచ్చిన్ షిప్‌యార్డ్ (Cochin Shipyard) షేర్లు గత మూడు రోజుల్లో 40% పైగా ర్యాలీ చేశాయి. ఈ రెండు కంపెనీలు, జూన్ క్వార్టర్ రిజల్ట్స్‌ను స్ట్రాంగ్ నంబర్లతో మార్కెట్‌కు ముందుకు తెచ్చాయి.
గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ (GRSE)
యుద్ధనౌకల తయారీ సంస్థ GRSE షేర్లు గత మూడు సెషన్లలో 42% పైగా పెరిగాయి. ఇవాళ్టి (గురువారం, 17 ఆగస్టు 2023) ట్రేడింగ్‌లో ఈ షేరు 7% పైగా ర్యాలీతో రూ. 832 వద్ద కొత్త 52 వారాల గరిష్టాన్ని తాకింది.
Q1 FY24 ఫలితాల్లో, GRSE రికార్డ్ స్థాయిలో రూ.77 కోట్లు నికర లాభం ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.50 కోట్ల లాభంతో పోలిస్తే ఈసారి ప్రాఫిట్ 54% పెరిగింది. ఆదాయం కూడా రూ.621 కోట్ల నుంచి 33% గ్రోత్‌తో రూ.827 కోట్లకు చేరింది. ఎబిటా (EBITDA) రూ.74 కోట్ల నుంచి 58% జంప్ చేసి రూ.117 కోట్లకు చేరింది.
ప్రస్తుతం, దేశంలో కొత్తగా ఆరు యుద్ధ నౌకలు నిర్మించే ప్లాన్‌కు సంబంధించిన ప్రాసెస్ జరుగుతోంది. ఆ కాంటాక్ట్స్ కోసం కోసం బిడ్స్ వేసిన కంపెనీల పూర్తి చరిత్రను భారత అధికారులు మదింపు చేస్తున్నారు.
మధ్యాహ్నం ఒంటి గంటల సమయానికి, BSEలో GRSE షేర్లు 1.32% పెరిగి రూ.787 వద్ద ట్రేడవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఈ కౌంటర్ దాదాపు 70% లాభాలను కళ్లజూసింది. గత ఒక సంవత్సర కాలంలో దాదాపు 200% మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, GRSE సగటు టార్గెట్ ప్రైస్ రూ.525. ప్రస్తుత మార్కెట్ ప్రైస్ నుంచి 35% డౌన్‌సైడ్‌ని అది చూపుతోంది. ఈ స్టాక్ మీద ముగ్గురు ఎనలిస్ట్‌లు ఇచ్చిన సిఫార్సు 'హోల్డ్'.
కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్
కొచ్చిన్ షిప్‌యార్డ్ షేర్లు కూడా గత మూడు రోజుల్లో 40% పైగా పెరిగాయి. ఇవాళ్టి ట్రేడింగ్‌లో ఈ షేరు 12% పెరిగి కొత్త 52-వారాల గరిష్ట స్థాయి రూ.904.40 ను తాకింది.
FY24 జూన్ త్రైమాసికంలో, ఈ సంస్థ ఏకీకృత నికర లాభం రూ.42 కోట్ల నుంచి రూ.98.65 కోట్లకు పెరిగింది, 135% వృద్ధిని (YoY) సాధించింది. అదే సమయంలో, ఆదాయం 7.9% పెరిగి రూ.475.9 కోట్లకు చేరుకుంది, ఇది క్రితం సంవత్సరం రూ.440.9 కోట్లుగా ఉంది. ఎబిటా రూ.78.7 కోట్లుగా నివేదించింది. మార్జిన్లు 16.5%గా ఉన్నాయి.
మధ్యాహ్నం ఒంటి గంటల సమయానికి, BSEలో ఈ షేర్లు 8.22% లాభంతో రూ.887 వద్ద ట్రేడవుతున్నాయి. కొచ్చిన్ షిప్‌యార్డ్స్ కూడా తన పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్స్ అందించింది. గత ఒక సంవత్సరంలో ఈ స్టాక్ 165% పైగా ర్యాలీ చేసింది.
ట్రెండ్‌లైన్ డేటా ప్రకారం, కొచ్చిన్ షిప్‌యార్డ్ సగటు టార్గెట్ ప్రైస్ రూ.682. ఇది ప్రస్తుత మార్కెట్ ధర నుంచి 24% తగ్గుదలను చూపుతోంది. ఈ స్టాక్ కోసం నలుగురు విశ్లేషకులు చేసిన సిఫార్సు 'బయ్'.
మరో ఆసక్తికర కథనం: ఐటీసీ హోటల్స్ షేర్ ప్రైస్ ₹100 దాటే ఛాన్స్, కంపెనీ మార్కెట్ విలువను బట్టి ధర నిర్ణయం
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.