G20 Summit: తెలంగాణ చీరలు, సంస్కృతి ఖ్యాతి ఖండాంతరాలు దాటిపోతుంది. ఎప్పటికప్పుడు ఇక్కడ తయారయ్యే చీరలు అందరి మనసులను దోచేస్తున్నాయి. అయితే ఈసారి పుట్టపాక తేలియా రుమాలు ప్రపంచ ఖ్యాతి పొందనుంది. ఈనెల 8వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఢిల్లీలో జరిగే జీ-20 సదస్సులో భారతీయ హస్తకళల ప్రదర్శనలో భాగంగా పుట్టపాక చేనేత కళాకారులు తయారు చేసిన తేలియా రుమాలును ప్రదర్శించబోతున్నారు. మండే వేసవిలోనూ చల్లగా ఉండి, చలి కాలంలో వెచ్చగా ఉండే ఈ తేలియా రుమాలు తయారీ చాలా ప్రత్యేకమైనది. ఈ రుమాలులో వాడే రంగులు అన్నీ ప్రకృతి సిద్ధమైనవే కావడం గమనార్హం. ఆముదపు పొట్టు కాలిస్తే వచ్చే బూడిదను, వృక్ష సంబంధ రంగులతో పాటు ఆముదం లేదా నువ్వుల నూనెను సూర్యర్శి ద్వారా వేడైన నీటిలో కలిపి నూలును అందులో నానబెడతారు. అలా నానిన నూలును కనీసం 20 రోజుల పాటు రోజుకు రెండు పూటలా చేతులతో పిసుకుతారు. తర్వాత నూలను నీళ్లు లేకుండా పిండి ఆరబెడతారు. అది బాగా ఆరిన తర్వాత మళ్లీ నీటిలో నానబెడతారు. ఇలా 20 రోజుల పాటు చేయడం ద్వారా ద్వారాల్లోకి నూనె ఇంకి రంగులు చక్కగా అంటుకుంటాయి.
సహజ సిద్ధమైన వాటితోనే రంగుల తయారీ
పటికి, కరక్కాయ, హీరాకాసుతో ఎరుపు రంగును తయారు చేస్తారు. అలాగే నీలం, పసుపు, ఆకుపచ్చ వంటి రంగులను ఇతర చెట్ల నుంచి తయారు చేస్తారు. నూనెలు, సహజసిద్ధ రంగులు వాడడం మూలంగా తేలియా రుమాలుకు ఔషధ గుణాలు అందుతాయి. కాబట్టి వేసవి తాపం తప్పించి చల్లదనాన్ని అందిస్తుంది. ఉష్ణోగ్రత అధికంగా ఉండే గల్ఫ్ ప్రాంతాల్లో ఉండేవారు ప్రత్యేకంగా తేలియా రుమాలును కొనుగోలు చేస్తుంటారు. ఈ రుమాలు డిజైన్లను బట్టి రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు ధర పలుకుతుంది. పుట్టపాక తేలియా రుమాలు ఇక్కడి నుంచి ముంబయి, జర్మనీ, జపాన్, సింగపూర్, అమెరికా, నెదర్లాండ్, గుజరాత్, చెన్నై, సోలాపూర్, కోల్ కతా, అతరబ్ దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి భార్యకు దుబీయన్ చీరె బహుకరణ
దుబీయన్ వస్త్రం డిజైన్ పుట్టపాక చేనేత కళాకారుల సొంతం. ప్రపంచ వ్యాప్రంగా దుబీయన్ వస్త్రం డిజైన్ ఎక్కడ కూడా కనిపించదు. పుట్టపాక చేనేత కళాకారులు మాత్రమే ఈ వస్త్రం డిజైన్ చేస్తారు. ఈ వస్త్రం తయారీలో నిలువు ఇక్కత్ విధానం పాటిస్తారు. అలాగే డిజైన్ కూడా నిలువు ఇక్కత్ లోనే రూపొందిస్తారు. ఈ వస్త్రం తయారీలో వాడే దారాలు పలుచగా ఉంటాయి. ఈ వస్త్రంతో ఫ్యాబ్రిక్ దుస్తులు తయారు చేస్తారు. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడి భార్య బ్రిగిట్టే మెక్రాన్ కు దుబీయన్ చీరెను బహుకరించాలు. ఇలా పుట్టపాక దుహీయన్ చీర ఖ్యాతి ఖండాంతరాలకు దాటింది. ఇప్పుడు తేలియా రుమాలును జీ-20 సదస్సులో ప్రదర్శించడం తమకు చాలా సంతోషాన్ని కల్గజేస్తుందని అన్నారు.