ఏపీలో టీడీపీతో జట్టుకట్టిన జనసేన, తెలంగాణలో బీజేపీతో దోస్తీకి సిద్దమయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీకి చెందిన తెలంగాణ నేత రాజ్యసభ సభ్యుడు కె. లక్ష్మణ్  ఈ మేరకు ఓ స్పష్టత నిచ్చారు. జనసేన తమ భాగస్వామ్య పార్టీ అని చెప్పడమే కాకుండా, జన సేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పడం  ద్వారా రెండు పార్టీలు జట్టు కట్టనున్నట్లు ప్రకటించడం విశేషం. అయితే, ఇప్పటికే మూడు విడతలుగా  తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. తొలి జాబితాలో 52 మంది పేర్లు ప్రకటించిన  కమలం, రెండో జాబితాలో ఒక్కరి పేరునే ప్రకటించింది. 35 మందితో మూడో జాబితాను ఇవాళ (నవంబరు 2) ప్రకటించింది.  


మిగిలిన స్థానాల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. అయితే జన సేన పార్టీతో కలిసి పోటీ చేయాలని బీజేపీ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో 9 స్థానాలను జనసేన పార్టకి కట్టబట్టేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇరు పార్టీల మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.  కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, తాండూరు  ఖమ్మం, కొత్తగూడెం, వైరా, అశ్వరావుపేట, కోదాడ, నాగర్ కర్నూలు స్థానాలను జనసేన పార్టీ అడుగుతున్నట్లు తెలుస్తోంది. అయితే శేరిలింగంపల్లి, కూకట్ పల్లి స్థానాల్లో బీజేపీనే పోటీ చేయాలని కమలం నేతలు గట్టిగా పట్టుబడుతున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం ఈ స్థానాల్లో మార్పు ఉంటుందా.. ఇవే స్థానాల్లో జనసేన అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలుస్తారా అన్నది వేచి చూడాలి. ఇప్పటికయితే.. రెండు పార్టీల మధ్య తెలంగాణలో పొత్తు పొడిచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


                                             (వై. సుధాకర్ రావు, అసిస్టెంట్ ఎడిటర్, ఏబీపీ దేశం)