Karnataka BJP MLA's:



కర్ణాటక బీజేపీలో అసహనం..


హైకమాండ్‌పై చాలా గుర్రుగా ఉన్న కర్ణాటక బీజేపీ (Karnataka BJP) ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆర్నెల్లవుతోంది. ఇప్పటికే ఓడిపోయామన్న బాధలో ఉన్నారు. దీనికి తోడు అధిష్ఠానం తీరు మరింత ఇబ్బంది కలిగిస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటై ఇన్ని నెలలవుతున్నా ఇప్పటి వరకూ Leader of Opposition ని నియమించకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప ( BS Yediyurappa) ఈ మధ్యే అందరు ఎమ్మెల్యేలతో ఓ మీటింగ్ పెట్టారు. ఆ సమావేశంలోని ఎమ్మెల్యేలంతా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతను నియమించకపోతే...త్వరలోనే జరగనున్న బెలగావిలో వింటర్ అసెంబ్లీ సెషన్‌కి హాజరు కామని బెదిరించారు. బెంగళూరులో జరిగిన సమావేశంలో యడియూరప్పతో గట్టిగానే వాదించినట్టు సమాచారం. పైగా కాంగ్రెస్ నేతలు పదేపదే బీజేపీ నేతల్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. ప్రతిపక్ష నేతనే నియమించుకోలేకపోయారంటూ ఎద్దేవా చేస్తున్నారు. దీనిపైనే బీజేపీ నేతలు అసహనంగా ఉన్నారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టలేకపోతున్నామని హైకమాండ్‌తో చెబుతున్నారు. 


స్పందించిన యడియూరప్ప..


అయితే...ఈ వివాదంపై యడియూరప్ప స్పందించారు. ప్రతిపక్ష నేతను నియమించడంపై బీజేపీ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టిందని, అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. బెలగావిలో జరగనున్న సమావేశంలో ఇది ఖరారు చేస్తామని చెప్పారు. అంతా హైకమాండ్ చేతుల్లోనే ఉందని వెల్లడించారు. అటు కాంగ్రెస్ మాత్రం బీజేపీపై విమర్శల్ని ఆపడం లేదు. ఆ పార్టీలో అంతర్గత కలహాలు పెరిగిపోతున్నాయని, రాష్ట్ర చరిత్రలోనే ప్రతిపక్ష నేతని నియమించడంలో ఎప్పుడూ ఆలస్యం కాలేదని మండి పడుతోంది. ఆర్నెల్లు దాటినా ఇంకా నిర్ణయం తీసుకోలేకపోతోందని విమర్శిస్తోంది. ఆ పార్టీ పరిస్థితేంటో ఇది చూస్తేనే అర్థమవుతోందని సెటైర్లు వేస్తోంది. ఈ ఏడాది మే 10వ తేదీన కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ 135 సీట్ల మెజార్టీతో విజయం సాధించింది. బీజేపీకి 66,జేడీఎస్‌కి 19 సీట్లు వచ్చాయి. 


పోస్ట్‌ల దుమారం..


కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై ఇటీవలే బీజేపీ అభ్యంతరకర ట్వీట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడుతోంది. ఆ పార్టీపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. సిద్దరామయ్యను కించపరిచేలా కొన్ని పోస్టర్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది బీజేపీ. సిద్దరామయ్య చీఫ్ మినిస్టర్‌కి బదులుగా సిద్దరామయ్య కలెక్షన్ మాస్టర్ (Siddaramaiah Collection Master)అని పోస్ట్‌లు పెట్టింది. డిప్యుటీ సీఎం డీకే శివకుమార్‌పైనా ఇలాంటి ట్వీట్‌లే చేసింది. దీంతో కర్ణాటక కాంగ్రెస్ భగ్గుమంది. కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగాయి. ఈ సోదాల్లో మొత్తం రూ.94 కోట్ల నగదుని స్వాధీనం చేసుకుంది. మరో రూ.8 కోట్ల విలువైన వస్తువుల్నీ సీజ్ చేసింది. ఈ క్రమంలోనే బీజేపీ సిద్దరామయ్యపై ఈ ట్వీట్‌లు చేసింది. ఇదంతా బీజేపీ కుట్రపూరితంగా చేస్తోందని కాంగ్రెస్ అసహనం వ్యక్తం చేసింది. ఎవరి ఇంట్లోనే దాడులు జరిగితే వాళ్ల పేర్లు తొలగించి సిద్దరామయ్య పేరుతో మార్ఫిగ్ చేసి మరీ ప్రచారం చేస్తున్నారని మండి పడింది. ట్విటర్‌లో వరుస పోస్ట్‌లు పెట్టి కాంగ్రెస్ నేతల్ని అవమానిస్తున్నారని పలువురు సీనియర్ నేతలు ఫైర్ అయ్యారు. 


Also Read: I.N.D.I.A కూటమిపై కాంగ్రెస్ ఫోకస్ చేయడం లేదు - నితీశ్ సంచలన వ్యాఖ్యలు