Bengaluru Zika Virus: 



జికా కలవరం..


మరోసారి జికా వైరస్ (Zika Virus) కలకలం రేపుతోంది. బెంగళూరులో ఇటీవల కొందరికి తీవ్ర జ్వరం వచ్చింది. వాళ్లను పరీక్షించగా జికా వైరస్‌ వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన వైద్య సిబ్బంది అందరి శాంపిల్స్ టెస్ట్ చేస్తోంది. చిక్కబల్లాపూర్‌లోని *(Bengaluru Zika Virus) ఓ వ్యక్తికి ఈ వైరస్ సోకినట్టు గుర్తించారు. ఆగస్టులోనే ఈ శాంపిల్‌ని టెస్ట్‌కి పంపారు. అప్పటి నుంచి అక్కడక్కడా కొంత మంది జ్వరంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ కారణంగానే అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తల్కెబెట్ట ప్రాంతానికి 5 కిలోమీటర్ల మేర అలెర్ట్ ప్రకటించారు. అక్కడి వాళ్లందరి శాంపిల్స్‌ని టెస్ట్ చేయనున్నారు. ఇప్పటికే 100 నమూనాలు సేకరించారు. ఓ దోమలో జికా వైరస్‌ని గుర్తించారు. 


"రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకూ 100 శాంపిల్స్‌ సేకరించాం. చిక్‌బల్లాపూర్‌ నుంచే 6 శాంపిల్స్ సేకరించారు. వీటిలో 5 నెగటివ్‌ వచ్చాయి. ఒకటి పాజివిట్‌గా తేలింది. వీళ్లలో ముగ్గురు బాధితులకు తీవ్ర జ్వరం వచ్చింది. పాథలాజికల్ అనాలసిస్ చేస్తున్నాం. ప్రస్తుతానికి వాళ్ల ఆరోగ్యం బాగానే ఉంది"


- వైద్యాధికారులు 


గతేడాది కూడా..


గతేడాది డిసెంబర్‌లోనూ కర్ణాటకలో జికా వైరస్ గుబులు పుట్టించింది. ఓ ఐదేళ్ల బాలికకి జ్వరం రాగా అన్ని పరీక్షలు చేశారు. ఆ బాలిక శాంపిల్స్‌లో జికా వైరస్‌ని గుర్తించారు. అదే డిసెంబర్‌లో మహారాష్ట్రలో ఓ వృద్ధుడికి జికా వైరస్ సోకింది. ఈ కేసులు పెరగకుండా ఈ సారి మరింత జాగ్రత్త పడేందుకు సిద్ధమవుతోంది కర్ణాటక ప్రభుత్వం. 


ఇలా సోకుతుంది..


జికా వైరస్ ఏడెస్ అనే దోమ నుంచి (Zika Virus Symptoms) మనుషులకు ఈ వ్యాధి సోకుతుంది. ప్రాణాంతకం కాకపోయినప్పటికీ... ఇప్పటి వరకు దీనకి మందు కనిపెట్టలేకపోయారు శాస్త్రవేత్తలు. ఈ వైరస్ సోకడం వల్ల కొందరిలో జ్వరం, దద్దుర్లు, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. పిల్లలకు ఈ జికా వైరస్ సోకినట్లు అయితే వారి ఎదుగుదలపై ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గర్భిణులకు ఈ వైరస్ సోకితే పుట్టబోయే శిశువు మెదడు సరిగా అభివృద్ధి చెందకుండా ఉండే అవకాశం ఉంటుంది. 1947 ప్రాంతంలో ఈ వైరస్ అడువల్లో ఉండే కోతుల్లో కనిపించింది. ఆ తర్వాత అంటే 1952లో మనుషుల్లోనూ గుర్తించారు. 2017లో తమిళనాడు, అహ్మదబాద్ లలో ఈ కేసులు నమోదైనట్లు తేలింది. దోమ వల్ల జికా వైరస్ సోకుతున్నందున.. ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో, ఇంటి బయట దోమలు నిల్వకుండా తరచుగా పరిసరాలను శుభ్రం చేసుకోవాలని వివరిస్తున్నారు. ఏదైనా జ్వరం, దద్దుర్లు వంటివి వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఏం కాదులే అని ఇంట్లోనే ఉంటే అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. దోమలను దరి చేరనీయకుండా మీరు తీసుకునే జాగ్రత్తలే మీకు జికా వైరస్ సోకకుండా చేస్తుందని చెబుతున్నారు. 


Also Read: Arvind Kejriwal: ఈడీ విచారణకు హాజరుకాని కేజ్రీవాల్- మధ్యప్రదేశ్‌ వెళ్లనున్నట్టు ఆప్‌ వివరణ