I.N.D.I.A Alliance: 



నితీశ్ కుమార్‌ సంచలన వ్యాఖ్యలు..


I.N.D.I.A కూటమిలో ఐక్యత ఉందా లేదా..? అన్న అనుమానాలు ఎప్పటి నుంచో వ్యక్తమవుతున్నాయి. కలవనైతే కలిశారు కానీ ఎవరి దారి వాళ్లదే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు ఆ కూటమిలోని నేతలు. ఇప్పుడు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ (Nitish Kumar) చేసిన వ్యాఖ్యలు మరోసారి ఇవే అనుమానాలకు తావిస్తున్నాయి. I.N.D.I.A కూటమి ఏర్పాటైంది కానీ ఇప్పటి వరకూ ముందడుగు పడలేదని, కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ శ్రద్ధ అంతా రానున్న అసెంబ్లీ ఎన్నికలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిందని వెల్లడించారు. అందుకే కూటమి చడీచప్పుడు లేకుండా ఉండిపోయిందని అసహనం వ్యక్తం చేశారు. పట్నాలోని ఓ ర్యాలీలో పాల్గొన్న నితీశ్ ఈ వ్యాఖ్యలు చేశారు. భాజపా హఠావో, దేశ్ బచావో థీమ్‌తో జరిగిన ఆ కార్యక్రమంలో ఇలా మాట్లాడారు. ఆ సమయంలో అక్కడ సీపీఐ జనరల్ సెక్రటరీ డీ రాజా లాంటి సీనియర్ నేతలున్నారు. Janata Dal (United) పార్టీ అన్ని పార్టీలనూ ఒక్కటి చేసే బాధ్యత తీసుకుందని తేల్చి చెప్పారు నితీశ్ కుమార్. దేశ ప్రజలు బేజీపీకి ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారని అన్నారు. 


"మేం అన్ని పార్టీలతోనూ సంప్రదింపులు జరిపాం. చరిత్రను మార్చాలని చూస్తున్న బీజేపీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పాం. పట్నాతో పాటు పలు చోట్ల ఇప్పటికే కీలక సమావేశాలు జరిగాయి. I.N.D.I.A కూటమి ఏర్పడింది. కానీ పెద్దగా ఏమీ జరగడం లేదు. అంతా చడీచప్పుడు లేకుండా ఉంటున్నారు. త్వరలోనే 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ ఫోకస్ అంతా ఆ ఎన్నికలపైనే ఉంది. కాంగ్రెస్‌తో కలిసి వెళ్లేందుకు మేమెంతగానో ప్రయత్నిస్తున్నాం. కానీ ఆ పార్టీ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. 5 రాష్ట్రాల ఎన్నికల తరవాత ఆ పార్టీయే అందరినీ పిలిచి మాట్లాడుతుందని అనుకుంటున్నాను. మా కూటమిని కాంగ్రెస్‌ లీడ్ చేయాలని మేమంతా నిర్ణయించుకున్నాం. బహుశా అన్ని ఎన్నికలు పూర్తైన తరవాతే కాంగ్రెస్ ఈ బాధ్యత తీసుకుంటుందేమో"


- నితీశ్ కుమార్, బిహార్ ముఖ్యమంత్రి 


 






మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మిజోరం, తెలంగాణ రాష్ట్రాల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెలలో అన్ని రాష్ట్రాల్లోనూ ఎలక్షన్స్‌ ఉన్నాయి. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతానికి కాంగ్రెస్ దృష్టి అంతా ఈ ఎన్నికలపైనే ఉంది. ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాజస్థాన్‌లోనూ మరోసారి అధికారంలోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ప్రస్తుతానికి జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి ఈ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకుంది.


Also Read: యాపిల్‌కి కేంద్రం నోటీసులు, ట్యాపింగ్ ఆరోపణలపై సమాధానం చెప్పాలని ఆదేశాలు