తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్‌కు త్వరలోనే విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. వరంగల్‌ జిల్లా మామునూరు విమానాశ్రయం నుంచి త్వరలో 19 సీట్ల చిన్న విమానాలను నడిపించేందుకు రంగం సిద్ధమవుతోంది. ప్రయోగాత్మకంగా దీనిని ప్రారంభించి, విస్తరించేందుకు క్రమం తప్పకుండా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర పౌరవిమానయాన శాఖ తాజాగా లేఖ రాసింది. ఈ అంశంపై త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఉన్నతస్థాయి సమావేశం జరగనుంది. ఆ తర్వాత వరంగల్‌ నుంచి విమాన సేవల ప్రారంభ తేదీ అధికారికంగా వెల్లడి కానుంది.


Also Read: TSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు సజ్జనార్ గుడ్ న్యూస్.. పండగ చేసుకుంటున్న సిబ్బంది?


త్వరలో సేవలు


కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చినప్పుడు సీఎం కేసీఆర్‌తో భేటీఅయ్యారు. ఆయన వినతి మేరకు వరంగల్‌ నుంచి త్వరలో చిన్న విమానాల సేవలను ప్రారంభిస్తామని, బసంత్‌నగర్‌, కొత్తగూడెం, దేవరకద్రలకు సైతం వాటిని విస్తరిస్తామని సింథియా హామీ ఇచ్చారు. దీంతో పాటు ఆదిలాబాద్‌లోని విమానాశ్రయాన్ని వాయుసేన ద్వారా నడిపిస్తామని స్పష్టం చేశారు. తాజా దిల్లీలో జరిగిన విమానయాన శాఖ సమీక్ష సమావేశంలో వరంగల్‌లో విమాన సేవలకు నిర్ణయించినట్లు తెలిసింది.


19 సీట్లతో విమానాలు


చిన్న విమానాశ్రయాల్లో నడిపేందుకు వీలుగా హిందుస్థాన్‌ ఎరోనాటిక్స్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎల్‌) సంస్థ సివిల్‌ డార్నియర్‌ 228 మోడల్ విమానాలను తయారు చేస్తోంది. వీటిని నిర్వహించేందుకు పౌరవిమానయాన శాఖ, హెచ్‌ఏఎల్‌ల మధ్య ఇటీవల ఒప్పందం కుదిరింది. 19 సీట్లతో తక్కువ రన్‌వేతో టేకాఫ్‌, ల్యాండ్‌ అయ్యేలా ఈ విమానాలు సిద్ధమవుతున్నాయి. వీటి నిర్వహణ వ్యయం తక్కువ. తొలుత అరుణాచల్‌ప్రదేశ్‌ నుంచి ప్రారంభించి, తర్వాత ద్వితీయ శ్రేణి నగరాలకు, జిల్లాలకు వీటిని విస్తరించాలని కేంద్రం భావిస్తోంది. 


Also Read: TS Assembly: మీ మాటలు వింటే జాలిగా ఉంది.. కేసీఆర్ అసంతృప్తి, అందరికీ అన్ని వివరాలిస్తామని వెల్లడి


నిజాం పాలనలోనూ విమానాశ్రయ సేవలు


మామునూరు విమానాశ్రయానికి చాలా చరిత్ర ఉంది. నిజాం పాలనలో 1930లో ప్రారంభమైన ఈ విమానాశ్రయంలో 1987 వరకు విమానాలు నడిచాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కొత్త విమానాశ్రయాల ప్రతిపాదనల్లో వరంగల్‌ పేరును ముందుగా చేర్చింది. ఇక్కడి మెగాజౌళి పార్కులో కొరియాకు చెందిన యంగ్‌వన్‌, కేరళకు చెందిన కేటెక్స్‌ కూడా భారీ పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఆయా సంస్థల ప్రతినిధులు విమాన సేవలను కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచింది. మామునూరులో దాదాపు 1160 ఎకరాల భూమిలో 1829 మీటర్ల రన్‌వేతో సర్వీసులు నడపడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇస్తే 1-2 నెలల్లో దీనిని సిద్ధం చేసి సర్వీసులు నడిపే  ఉందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.


Also Read:  నామినేషన్ దాఖలు చేసిన గెల్లు శ్రీనివాస్.. ప్రచారంలో పలువురు నేతల మద్దతు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి