తెలంగాణ సీఎం నిరుద్యోగులను ఉత్కంఠలోకి నెట్టారు. వనపర్తి జిల్లాలో  బహిరంగసభలో  సీఎం  కేసీఆర్ నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. బుధవారం ఉదయం పది గంటలకు నిరుద్యోగులంతా అసెంబ్లీ చూడాలని పిలుపునిచ్చారు. తాను అసెంబ్లీలో ఓ ప్రకటన  చేయబోతున్నానని ప్రకటించారు. ఏ విధమైన తెలంగాణ ఆవిష్కారమయిందో తాను అసెంబ్లీలో చెప్పానుకుంటున్నట్లుగా ప్రకటించారు. వనపర్తిలో ఇతర అంశాలపై కేసీఆర్ మాట్లాడినప్పటికీ ఆయన చేసిన ఉదయం పది గంటలకు అసెంబ్లీలో ప్రకటన అనే అంశం మాత్రం హాట్ టాపిక్‌గామారింది. ఉత్కంఠకు గురి చేసేలా.. అద్భుతమైన ప్రకటన  చేయబోతున్నట్లుగా కేసీఆర్ చెప్పడమే దీనికి కారణం.


అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, మన ఊరు-మన బడి కార్యక్రమానికి సీఎం కేసీఆర్ శ్రీకారం


నిరుద్యోగులు తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దానికి కారణం తెలంగాణ ఏర్పాటు అయినప్పటి నుండి సరైన నోటిఫికేషన్లు లేకపోవడమే. పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది.  తాము ప్రభుత్వ రంగంలో  ఇవ్వడమే కాదు..ప్రైవేటురంగంలోనూ పెద్ద ఎత్తున పరిశ్రమల్నితీసుకు వచ్చి... లక్షల మంది ఉపాధి కల్పించామని ప్రభుత్వం చెబుతోంది. అయినా నోటిఫికేషన్లకోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు మాత్రం అసంతృప్తిలో ఉన్నారు. ఇటీవలి కాలంలో పలువురు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. దీంతో ప్రభుత్వంపై విపక్షాలు తీవ్రమైన విమర్శలు చేశాయి.


‘కేసీఆర్ ఫాంహౌస్‌లో తాంత్రిక పూజలు, వాళ్లు నాశనం అవ్వాలనే’ - బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు


సీఎం కేసీఆర్ చాలా కాలం నుంచి ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు చేస్తున్నారు. ప్రతి ఉపఎన్నిక సందర్భంలోనూ ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు చేసేవారు. త్వరలో అని చెప్పేవారు. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూర్ నగర్, హుజురాబాద్, ఎమ్మెల్సీ ఎన్నికలు ఇలా ప్రతీ సందర్భంలోనూ ఉద్యోగాల భర్తీపై ప్రకటనలు వచ్చేవి కానీ ... నోటిఫికేషన్లు మాత్రం వచ్చేవి కావు. దీంతో ప్రభుత్వంపై నిరుద్యోగులకు మరింత అసంతృప్తి పెరిగింది. ఇటీవల కొత్తజిల్లాల వారీగా ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయడంతో ఖాళీలపై లెక్క తేలింది. అందుకే..అసెంబ్లీసాక్షిగా కేసీఆర్ ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో యాభై వేల ఉద్యోగాల  భర్తీ ఉంటుందని ప్రభుత్వం చెప్పింది. 


అయితే కేసీఆర్ అనూహ్యంగా మరింత భారీగా ఉద్యోగాల  భర్తీని ప్రకటించబోతున్నారని భావిస్తున్నారు. అందుకే నిరుద్యోగుల్ని అసెంబ్లీ సమావేశాలు చూడాలని ప్రత్యేకంగా కోరినట్లుగా తెలుస్తోంది. నిరుద్యోగుల అంచనాలు కేవలం ఉద్యోగాల భర్తీపైనే ఉంటాయి. అది కాకుండా కేసీఆర్ ఇంకే ప్రకటన చేసినా నిరుద్యోగులకు సంతృప్తి కలగదు. అందుకే...కేసీఆర్ టీజర్ ఉద్యోగాల భర్తీనేనని ఎక్కువ మంది నమ్ముతున్నారు.