‘‘ఫాంహౌజ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారు. తన రాజకీయ ప్రత్యర్థులు నాశనం కావాలనే ఉద్దేశంతో ఈ పూజలు జరుపుతున్నారు. గతంలో ఓ సీఎం ఇట్లనే చేసి ఆగమైపోయిన సంగతి కేసీఆర్ తెలుసుకోవాలి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఆయన కర్మన్ ఘాట్ లోని హనుమాన్ దేవాలయాన్ని మంగళవారం (మార్చి 8) సందర్శించారు. వేద పండితులు బండి సంజయ్‌కు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో స్వామి వారికి బండి సంజయ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బండి సంజయ్ రాక సందర్భంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ సందర్శన అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.


‘తెలంగాణ ప్రభుత్వం గోరక్షుకులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలి. రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి’ అని ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ‘‘ఫిబ్రవరి 22న గో రక్షకులపై ఇక్కడే దాడి చేసి హత్య చేసే కుట్ర చేశారు. అందుకే ఈ ఆలయాన్ని సందర్శించి గో రక్షకులను, ధర్మ రక్షకులను కాపాడాలని ఆంజనేయ స్వామిని కోరుకున్నా. శాంతి భద్రతలను కాపాడాల్సిన సీఎం రాష్ట్రానికి శాంతి భద్రతల సమస్యను తెస్తున్నరు. రాష్ట్రంలో నెంబర్ వన్ ద్రోహి కేసీఆర్. నిఖార్సైన హిందువని గొప్పలు చెప్పుకుంటున్నాడు. ఫాంహౌజ్ లో యంత్ర, తంత్ర పూజలు సీఎం చేస్తున్నాడు. ఇతరులు నాశనం కావాలని సీఎం తాంత్రిక పూజలు చేస్తున్నడు. ఫాంహౌజ్ లో జరిగేవన్నీ యాంత్రిక, తాంత్రిక పూజలే.’’


‘‘గతంలో ఓ సీఎం ఇట్లనే చేసిండు. చివరకు ఏమైందో కేసీఆర్ తెలుసుకోవాలి. సమాజ క్షేమం, హిందూ ధర్మం కోసం పూజలు చేసే వాళ్లు గోమాతను తొలుత పూజిస్తారు. అట్లాంటి గోమాతలను వధించే వారిని అడ్డుకునే గోరక్షకులను హత్య చేసే కుట్ర చేస్తున్నరు. హోంమంత్రి ఉన్నాడో లేదో.. ఆయనెవరో కూడా రాష్ట్ర ప్రజలకు తెలియదు. రోహింగ్యాలకు షెల్టర్ కల్పించడం తప్ప ఆయన చేసేదేమీ లేదు. గోరక్షకులను హత్య చేసే కుట్ర చేసిన వారిపై కేసులు పెట్టకపోవడం దారుణం. చివరకు గోరక్షకులపైనే పోలీసులు హత్య కేసు నమోదు చేసి జైలుకు పంపడం అన్యాయం. కేసీఆర్ పాలనలో సరిగా డ్యూటీ చేయలేకపోతున్నామని పోలీసులు బాధపడుతున్నరు. రాష్ట్రంలో గో వధ నిషేధ చట్టాన్ని అమలు చేస్తారా? చేయరా? కేసీఆర్ చెప్పాలి.’’


‘‘కేసీఆర్.. ఎన్ని తాంత్రిక, యాంత్రిక పూజలు చేసినా మమ్మల్ని ఏమీ చేయలేరని గుర్తుంచుకోవాలి. ఇప్పటికైనా గోవధ చట్టాన్ని అమలు చేయాలి. చెక్ పోస్టులను నిర్వహించాలి. గోమాతలను వధించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. కేసులు పెట్టి జైలుకు పంపాలి. గో రక్షకులపై పెట్టిన కేసులన్నీ ఉప సంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇవన్నీ అమలు చేసినప్పుడే కేసీఆర్ నిజమైన హిందువని భావిస్తాం.’’ అని బండి సంజయ్ డిమాండ్ చేశారు.