బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాపై చీటింగ్ కేసు నమోదైనట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయినట్టు కూడా వార్తలు వచ్చాయి. ఢిల్లీలోక ఒక కార్యక్రమానికి సంబంధించి ప్రమోద్ అనే వ్యక్తి ఆమెను ఆహ్వానించాడు. అందుకు రూ.37 లక్షలు ఇచ్చినట్టు చెప్పాడు. డబ్బులు తీసుకున్నాక సోనాక్షి ఆ ప్రోగామ్‌కు వెళ్లలేదు, దీంతో ఆ వ్యక్తి చెల్లించిన నగదును తిరిగి ఇవ్వాలని కోరాడు. దానికి సోనాక్షి మేనేజర్ డబ్బులు ఇవ్వనని తెగేసి చెప్పినట్టు ప్రమోద్ పోలీసులకు తెలిపాడు. తనను చీట్ చేసినందుకు సోనాక్షిపై పోలీసు కేసు ఫైల్ చేశాడు. సోనాక్షిపై ఉన్న చీటింగ్ కేసు మొరాదాబాద్ కోర్టుకు చేరింది. అయితే సోనాక్షి కోర్టుకు హాజరుకాలేదు. దీంతో కోర్టు ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై సోనాక్షి సిన్హా స్పందించింది. 


అదంతా అబద్ధం...
తన మీద వచ్చిన ఆరోపణలన్నీ పచ్చి అబద్ధాలని చెబుతోంది సోనాక్షి.తానెక్కడికి వెళ్లలేదని, ఇంట్లోనే సురక్షితంగా ఉన్నానని చెప్పింది. తనకు వ్యతిరేకంగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిందని వచ్చిన వార్తల్లో నిజం లేదని తెలిపింది. ఆ విషయంలో తన వివరణ కూడా ఎవరూ తీసుకోలేదని అంది. కానీ ఆ వార్త మాత్రం బాగా వైరల్ అయి తన వరకు చేరిందని చెప్పింది. ‘ఒక వ్యక్తి నన్ను వేధించే ప్రక్రియలో ఇలా చేస్తున్నాడు.నేను మీడియా హౌస్‌లను, జర్నలిస్టులను, రిపోర్టర్లను కోరేది ఒక్కటే దయచేసి ఇలా ఫేక్ న్యూస్ ప్రచురించకండి. ఒక వ్యక్తి నాపేరు వాడుకుని పబ్లిసిటీ పెంచుకోవడానికి, నా నుంచి డబ్బు గుంజడానికి ఇదంతా చేస్తున్నాడు. ఎన్నో ఏళ్లుగా నేను కష్టపడి సంపాదించుకున్న పేరును మంటగలిపేందుకు ప్రయత్నిస్తున్నాడు.ఈ అంశం ప్రస్తుతం మొరాదాబాద్ కోర్టు పరిధిలో ఉంది. అలహాబాద్ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. నా లీగల్ టీమ్ ఈ విషయంపై ముందుకు వెళ్లేందుకు సిద్ధమైంది. సదరు వ్యక్తిని న్యాయపరంగా ఎదుర్కొనేందుకు నా లాయర్లు రెడీగా ఉన్నారు. కోర్టు తీర్పు వచ్చే వరకు ఈ అంశంపై నా వివరణ ఇదే...’ అని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది సోనాక్షి.