తెలంగాణలో ఆరు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్‌ ముగిసింది. ఆదిలాబాద్‌, నల్గొండ, మెదక్‌, ఖమ్మం జిల్లాల్లో ఒక్కో స్థానం, కరీంనగర్ లో రెండు స్థానాలకు మొత్తం 26 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీపడ్డారు. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. స్థానిక సంస్థల్లో ఎక్స్ ఆఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరిగింది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అత్యధికంగా 99.69 శాతం, 1,324 ఓట్లకు 1,320 ఓట్లు నమోదయ్యాయి. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. 


Also Read: నూతన సచివాలయ పనులను పరిశీలించిన కేసీఆర్.. త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశం


ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి : శశాంక్ గోయల్ 


కరీంనగర్ లోని జెడ్పీ కార్యాలయంలో పోలింగ్ కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ పరిశీలించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తెలిపారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు  జిల్లా యంత్రాంగం చేసిందని తెలిపారు. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున ఓటర్లు వచ్చారని, కరీంనగర్  జిల్లాలోని రెండు స్థానాలకు పోలింగ్ ప్రశాంతంగా జరిగిందన్నారు. 


Also Read: వచ్చే దసరాకు పాలనలో కొత్త వెలుగులు... రెడీ అవుతున్న తెలంగాణ కొత్త సెక్రటేరియట్ !


ఖమ్మంలో స్పల్ప ఉద్రిక్తత


ఖమ్మం పోలింగ్ కేంద్రం స్వల్ప ఉద్రిక్తత జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పోలింగ్ కేంద్రంలోనే గంటల తరబడి ఉంటున్నారని, వారిని బయటకు పంపాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. దీంతో పోలీసులు, కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం కాంగ్రెస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ నామా నాగేశ్వరరావు, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఓటు హక్కు వినియోగించుకున్నారు. 


Also Read: ఏపీలో ఓటీఎస్ తంటా.. ఉద్యోగులకు మొదలైన తలనొప్పులు.. అసలు ఈ ఓటీఎస్ ఎందుకంటే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి