జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం తెచ్చిన వన్ టైమ్ సెలిట్మెంట్ (ఓటీఎస్) పై ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ నడుస్తోంది. వన్ టైమ్ సెటిల్మెంట్ అనేది పూర్తిగా స్వచ్ఛందం అని ప్రభుత్వం ప్రకటనలిస్తోంది, మరోవైపు అధికారులకు టార్గెట్ పెడుతోంది. ఒక్కో వీఆర్వో తన పంచాయతీ పరిధిలో రోజుకి కనీసం 10 ఓటీఎస్ లు అయినా చేయాలనేది ఈ టార్గెట్. అయితే ఇది బహిరంగంగా ఎక్కడా బయటకు రాదు. అధికారుల వాట్సప్ గ్రూపుల్లో, వారి అంతర్గత సమావేశాల్లోనే ఈ టార్గెట్ ప్రస్తావన ఉంటుంది. పొరపాటున ఫోన్లలో రికార్డ్ అయినా, పేపర్ స్టేట్ మెంట్ రూపంలో బయటకొచ్చినా అధికారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పంచాయతీ సెక్రటరీ ప్రసాద్.. ఇదే తరహాలో ఓ సర్క్యులర్ జారీ చేసి సస్పెండ్ అయ్యారు. ఓటీఎస్ కట్టనివారికి పెన్షన్, ఇతర పథకాలు నిలిపివేయాలంటూ ఆయన వాలంటీర్లకు ఓ సర్క్యులర్ జారీ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ సెక్రటరీని సస్పెండ్ చేశారు. సంబంధిత ఎంపీడీవోకి వివరణ ఇవ్వాలంటూ నోటీసులిచ్చారు.


నెల్లూరులో ఎంపీడీవోకి షోకాజ్ నోటీస్.. 
నెల్లూరు జిల్లాలో కూడా ఇదే తరహా వ్యవహారంతో మర్రిపాడు ఎంపీడీవో సుశ్మితా రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేశారు ఉన్నతాధికారులు. మర్రిపాడు మండల పరిధిలో ఓటీఎస్ పథకం ప్రోగ్రెస్ సరిగా లేదని, నయానో భయానో లబ్ధిదారులకు నచ్చజెప్పి ఈ పథకం కింద డబ్బులు వసూలు చేయాలని పంచాయతీ సెక్రటరీలకు ఎంపీడీవో ఆడియో మెసేజ్ పెట్టారు. అవసరమైతే పథకాలు ఆపేస్తామని బెదిరించి చూడాలని కూడా ఆమె తన సందేశంలో చెప్పారు. ఈ ఆడియో మెసేజ్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు జిల్లా జాయింట్ కలెక్టర్ షోకాజ్ నోటీసు ఇచ్చారు. 


ఎందుకీ ఓటీఎస్.. 
గతంలో ప్రభుత్వ పథకాల ద్వారా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం హౌసింగ్ కార్పొరేషన్ తరపున ఆర్థిక సాయం చేసింది. అయితే ఈ ఆర్థిక సాయంలో కొంత మొత్తం మాఫీ కాగా.. మిగతాది లబ్ధిదారుల పేరిట అప్పుగా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు దీనికి వడ్డీ కూడా పెరుగుతూ ఉంటుంది. సహజంగా ఇలాంటి పథకాల ద్వారా ఇల్లు నిర్మించుకున్న లబ్ధిదారులు ఈ అప్పు గురించి పెద్దగా హైరానా పడరు. అయితే క్రయ విక్రయాల సమయంలో ఈ అప్పువల్ల వారు ఇబ్బంది పడే పరిస్థితి. ఈ ఇబ్బందిని తొలగించేందుకు వైసీపీ ప్రభుత్వం ఓటీఎస్ ని తెరపైకి తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 10 వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 15 వేల రూపాయలు, కార్పొరేషన్ పరిధిలో 20 వేల రూపాయలు చెల్లిస్తే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం ద్వారా వారికి రుణవిముక్తి కలుగుతుందని.. బాకీ ఎంతున్నా మొత్తం మాఫీ చేస్తామని చెబుతున్నారు అధికారులు. అంతే కాదు.. సచివాలయాల్లోనే వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తామంటున్నారు. ఆ పత్రాలతో వారు బ్యాంకుల్లో కొత్తగా లోన్లు తీసుకోవచ్చని కూడా చెబుతున్నారు. అయితే ఇప్పటికిప్పుడు గ్రామీణ ప్రజలు 10 వేల రూపాయలు కట్టడానికి సిద్ధంగా లేరు. 




ప్రతిపక్షం విమర్శలు.. 
ఓటీఎస్ ద్వారా ప్రభుత్వం డబ్బుల వసూళ్లకు తెరతీసిందని, అన్యాయంగా పేదల వద్ద డబ్బులు వసూలు చేస్తోందని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. టీడీపీ, బీజేపీ, జనసేన కూడా వైసీపీ విధానాన్ని విమర్శిస్తున్నాయి. చంద్రబాబు ఓ అడుగు ముందుకేసి.. ఓటీఎస్ కోసం ఎవరూ డబ్బులు చెల్లించొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వస్తే పూర్తి ఉచితంగా రిజిస్ట్రేషన్ పత్రాలు ఇస్తామని హామీ ఇచ్చారు. 


స్వచ్ఛందమే కానీ..!
అయితే ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొడుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా అప్పుడు చంద్రబాబుకి ఈ ఉచిత హామీ ఎందుకు గుర్తు రాలేదని ఎద్దేవా చేస్తున్నారు మంత్రులు. ఓటీఎస్ పూర్తి స్వచ్ఛందమేనని చెబుతున్నారు. ఓటీఎస్ వల్ల లబ్ధిదారులకు మేలు జరుగుతుందని, పూర్తి అప్పు కట్టకుండా తక్కువ మొత్తం చెల్లించి రుణవిముక్తులు కావొచ్చని సూచిస్తున్నారు. అయితే ఓటీఎస్ స్వచ్ఛందమేనని నేతలు హామీ ఇస్తున్నా.. క్షేత్ర స్థాయిలో మాత్రం ఉద్యోగులపై తీవ్ర ఒత్తిడి ఉంది. టార్గెట్లు ఇచ్చి మరీ పని పూర్తి చేయాలని చెబుతుండే సరికి ఓటీఎస్ రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 


Also Read: East Godavari: ఆయ్.. గోదారోళ్ల కితకితలా మజాకా.... ఆత్మీయ కలయికలో ఆద్యంతం నవ్వులే...


Also Read: East Godavari: చెప్పిన పని చేయకపోతే చీరేస్తా... మహిళా ఎంపీడీవోకు స్థానిక నేత బెదిరింపులు... వైరల్ అవుతున్న వీడియో


Also Read: చిన్నారావును చితక్కొట్టారు... బాలికలతో అసభ్యప్రవర్తన రౌడీషీటర్ కు మహిళలు బడితపూజ


Also Read:  మూడో భార్యతో ఉంటూ.. రెండో భార్యను చంపాలని భర్త క్షుద్రపూజలు.. చేతబడికి పాస్ పోర్ట్ సైజ్ ఫొటో


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి