తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్‌ రిస్క్‌ దేశాల నుంచి 726 మంది శంషాబాద్‌ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్‌జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్‌ ఆర్‌టీ-పీసీఆర్‌ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు.


ఇప్పటివరకు ఎట్‌రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన 9,122 మంది ప్రయాణికులకు ఆర్‌జీఐఏలో కొవిడ్ ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. వారిలో 59 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్‌ని అధికారులు జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కి పంపించారు. వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్‌ నెగెటివ్‌ వచ్చింది. మిగిలిన వారిలో 24 మందికి ఒమిక్రాన్‌ పాజిటివ్‌గా తేలగా.. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది.


172 కరోనా కేసులు


తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 172 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,892కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,016కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 188 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,625 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.


దేశంలో


దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. కొత్తగా 5,326 కరోనా కేసులు నమోదుకాగా 453 మంది మృతి చెందారు. 8,043 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 79,097కు చేరింది.



  • యాక్టివ్ కేసులు: 79,097

  • మొత్తం రికవరీలు: 3,41,95,060

  • మొత్తం మరణాలు: 4,78,007

  • మొత్తం వ్యాక్సినేషన్: 1,38,34,78,181


దేశంలో టీకా పంపిణీ వేగంగానే సాగుతోంది. సోమవారం 64,56,911 మందికి టీకాలు అందించారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 1,38,34,78,181కి చేరింది.


Also Read: Corona Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా 5,326 మందికి కొవిడ్


Also Read: Corona Cases: ఏపీలో కొత్తగా 95 కరోనా కేసులు నమోదు.. వైరస్ కారణంగా ఒకరు మృతి