Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ తరపున జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తెలిపారు. సీడబ్ల్యూసీ సమావేశాలు ఇక్కడ ఏర్పాటు చేయడం తెలంగాణకు ఎంతో కీలకం అని చెప్పుకొచ్చారు. బీఆరెస్, ఎంఐఎం, బీజేపీకి పరోక్ష మద్దతుదారులు ఈ సభలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ పార్టీని విమర్శించే అర్హత లేదని అన్నారు. కాళేశ్వరాన్ని సీఎం కేసీఆర్ ఏటీఎంలా వాడుకుంటున్నారని ఆరోపించారు. కాళేశ్వరం కూడా సరిపోక.. ఢిల్లీ లిక్కర్ స్కాంలో పాలు పంచుకున్నారని విమర్శించారు. మద్యం కేసులో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని... ఎన్నికల్లో గెలిచేందుకు కుమార్తెను జైలుకు పంపేందుకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధపడ్డారని అన్నారు. కవిత అరెస్టుతో సానుభూతి పొంది మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. కేసీఆర్, కిషన్ రెడ్డి వేరు కాదని... కేసీఆర్ అనుచరుడే కిషన్ రెడ్డి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కావాలనే సీడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నప్పుడే పోటాపోటీగా దినోత్సవాలు చేస్తున్నారన్నారు. కేసీఆర్ అవినీతిపై బీజేపీ ఎందుకు విచారణకు ఆదేశించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
అలాగే 2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాలపై నిన్న సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించామని పేర్కొన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై నేడు జరిగే సమావేశంలో చర్చిస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. సాయంత్రం జరిగే విజయ భేరిలో సోనియా గాంధీ హామీలను ప్రకటిస్తారని వెల్లడించారు. బోయిన్ పల్లి రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ కు సభలోనే శంఖుస్థాపన చేస్తారన్నారు. అలాగే తెలంగాణ ఇస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నట్టే.. ఇవాళ విజయ భేరిలో ఇవ్వబోయే హామీలను కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అమలు చేస్తుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజుల్లోనే అన్నీ హామీలు అమలు అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఈక్రమంలోనే ఈరోజు సాయంత్రం తుక్కుగూడలో జరిగే విజయ భేరి సభకు లక్షలాదిగా తరలి రావాలని విజ్ఞప్తి చేశారు.