Asia Cup 2023 Final: చరిత్రలో తొలిసారిగా  రెండు దేశాల్లో జరుగుతున్న ఆసియా కప్‌లో నేడు ఫైనల్ జరుగబోతోంది.  ఆతిథ్య హక్కులు పాకిస్తాన్ వద్ద ఉన్నా  భద్రతా కారణాల దృష్ట్యా  శ్రీలంకలో కూడా జరుగుతున్న  ఈ టోర్నీలో   మరికొద్దిసేపట్లో ఆఖరి పోరు ఆరంభం కానున్నది. భారత్ - శ్రీలంకల మధ్య జరుగబోయే ఫైనల్‌కు కొలంబోలోని ప్రేమదాస స్టేడియం  నేటి తుదిపోరుకు ఆతిథ్యమిస్తున్నది. మరి  ప్రేమదాస స్టేడియం ఎవరికి దాసోహం కానుంది..? ఇక్కడ రికార్డులు ఎలా ఉన్నాయి..? భారత్‌కు ఈ వేదికపై  రికార్డులు ఎలా ఉంది..? వంటి వివరాలు ఇక్కడ చూద్దాం. 


ఎడ్జ్ మనకే..


భారత్ - శ్రీలంకల మధ్య ఇప్పటివరకూ  166 మ్యాచ్‌ (వన్డే)లు జరగగా అందులో  టీమిండియా గెలిచిన మ్యాచ్‌ల సంఖ్య 97 గా ఉంది.  శ్రీలంక  57 మ్యాచ్‌‌లను గెలుచుకోగా  11  మ్యాచ్‌లలో ఫలితం తేలలేదు.  ఒక్క మ్యాచ్ టై అయింది.  శ్రీలంకతో  మ్యాచ్ ఆడుతున్న క్రమంలో భారత్ విన్నింగ్ పర్సంటేజ్ 58.43శాతంగా ఉండగా లంకకు 34.33 శాతంగా ఉంది. 


ఆసియా కప్‌లో.. 


ఆసియా కప్‌లో ఇరు జట్లూ  22 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్, లంకలు తలా 11 మ్యాచ్‌లు గెలుచుకుని ఢీ అంటే ఢీ అనే రేంజ్‌లోనే  పోరాడుతున్నాయి. ఆసియా కప్‌లో భాగంగా భారత్ - లంకల మధ్య  ఆడిన గత ఐదు మ్యాచ్‌లలో ఆ జట్టు 3-2తో ఎడ్జ్ లో ఉండటం గమనార్హం. ఆసియా కప్ ఫైనల్‌లో ఇరు జట్లూ  ఏడు సార్లు తలపడ్డాయి.  ఇందులో నాలుగు సార్లు భారత్, మూడు సార్లు లంకేయులు   గెలిచి  టోర్నీ  దక్కించుకున్నారు.






లంకలో.. 


శ్రీలంక వాళ్ల స్వదేశంలో భారత్‌తో 65  మ్యాచ్‌లు ఆడింది.  ఇందులో కూడా భారత్‌దే ఆధిపత్యంగా ఉంది.  భారత్ 31 మ్యాచ్‌లలో గెలవగా లంక 28 మ్యాచ్‌‌లలో విజయాలు సాధించగా ఆరు మ్యాచ్‌లలో ఫలితాలు తేలలేదు. 


ప్రేమదాసలో.. 


శ్రీలంకలోని అత్యంత ప్రముఖ స్టేడియాలలో ప్రేమదాస ఒకటి.  ఇక్కడ  ఇంతవరకూ  146 వన్డేలు జరిగాయి. ఈ పిచ్ బ్యాటింగ్‌తో పాటు  స్లో టర్నర్.  స్పిన్‌ను ఎదుర్కుని నిలబడితే భారీ స్కోరు చేసేందుకు మంచి అవకాశం ఉంటుంది.  ప్రేమదాసలో  తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  146 మ్యాచ్‌లలో తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు 80 మ్యాచ్‌లను గెలుచుకోగా  ఛేదన  చేసిన జట్టు  56  మ్యాచ్‌లలో గెలిచింది. ఈ స్టేడియంలో శ్రీలంక మొత్తంగా 123 వన్డేలు ఆడి 76 గెలిచి, 40 మ్యాచ్‌లలో ఓడింది. ఏడు మ్యాచ్‌లలో ఫలితాలు  తేలలేదు.  తొలుత బ్యాటింగ్ చేస్తూ 40  సార్లు నెగ్గగా  ఛేదన చేస్తూ  34 సార్లు గెలుపొందింది.   






భారత్ - శ్రీలంకలు  ప్రేమదాసలో  37 మ్యాచ్‌లు ఆడాయి. ఇందులో 18 మ్యాచ్‌లు భారత్ గెలవగా  ఆతిథ్య జట్టు 16 మ్యాచ్‌లను గెలిచింది.   తొలుత బ్యాటింగ్ చేస్తూ భారత్ 11 వన్డేలలో విజయదుందుబి మోగించగా ఛేదన చేస్తూ ఏడు  మ్యాచ్‌లను గెలుచుకుంది.   ప్రేమదాసలో  యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోరు 230 గా ఉండటం గమనార్హం.  ఈ స్టేడియంలో కోహ్లీ  గత ఐదు ఇన్నింగ్స్‌లలో ఏకంగా నాలుగు  సెంచరీలు చేయడం విశేషం.











ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial