కరోనా సెకండ్‌ వేవ్ తర్వాత తెలంగాణ పాలిటిక్స్‌లో కొత్త ఊపు కనిపిస్తోంది. ఎప్పుడూ స్తబ్దుగా ఉండే రాజకీయాలు లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వేడెక్కాయి. ఇంకా చెప్పాలంటే... ఈటల రాజేందర్‌ రాజీనామా తర్వాత మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. 


సస్పెన్స్‌ థ్రిల్లర్‌లా ఈటల ఎపిసోడ్


పార్టీల్లో లీడర్స్‌ రావడం పోవడం చాలా కామన్. కానీ ఈటల రాజేందర్‌ వెళ్లిపోవడం ఓ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ను తలపించింది. ఆయనపై భూఆక్రమణలు వచ్చిన వెంటనే కేబినెట్‌ నుంచి బర్త్‌రఫ్‌ చేశారు. విచారణకు కూడా ఆదేశించారు. కరోనా టైంలో కూడా సుమారు నెల రోజుల పాటు ఈటల ఎపిసోడ్‌ చాలా రసవత్తరంగా సాగింది. ఆయనపై ఆరోపణలు వచ్చినప్పటి నుంచి మళ్లీ ఈటల బీజేపీలో చేరేంత వరకు కూడా చాలా ఇష్యూస్‌ తెరపైకి వచ్చాయి. ఈటల, టీఆర్‌ఎస్‌ నేతల మధ్య మాటల తూటాలు పేలాయి. అభివృద్ధి, కులాల ప్రస్తావన, ప్రభుత్వ పథకాలు ఇలా అన్నింటిపై డిబేట్స్‌ నడిచాయి. 





కారు జోరు


ఈటల ఎపిసోడ్‌ తర్వాత అధికార పార్టీ టీఆర్‌ఎస్‌లో మార్పు స్టార్ట్‌ అయింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోరు పెంచారు. జిల్లాలను చుట్టేస్తున్నారు. ప్రారంభోత్సవాలు, కొత్త పథకాలతో ప్రజలను షాక్‌కి గురి చేస్తున్నారు. వరంగల్, కరీంనగర్ లాంటి జిల్లాలపై స్పెషల్‌ ఫోకస్ పెట్టారు. ఎస్సీ ఎంపవర్‌మెంట్‌ పేరుతో కొత్త స్కీమ్‌ రెడీ చేసిన కేసీఆర్‌... బీసీలపై కూడా దృష్టి పెట్టారు. ఈటల రాజీనామాతో హుజురాబాద్‌ ఉపఎన్నిక తప్పనిసరిగా రానుంది. అందుకోసం ముందస్తు వ్యూహంతో కారు ప్లాన్స్‌ వేస్తోంది. ఆ దిశగానే పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణ చేరిక కూడా ఆ ప్లాన్‌లో భాగమే అంటున్నారు విశ్లేషకులు. గతంలో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన కౌశిక్‌ రెడ్డి కూడా పార్టీలో చేరబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు రాజకీయాలను, సంక్షేమ పథకాలను ఒకేసారి ప్రజల్లోకి తీసుకెళ్లి పొలిటికల్‌గా ప్రత్యర్థులకు షాక్‌ ఇవ్వాలని చూస్తోంది టీఆర్‌ఎస్‌. 




జలజగడంలో గులాబీ దళం 


ఈ రాజకీయంలో ఎవరిది పై చేయి అనే చర్చ నడుస్తున్న టైంలో వచ్చిందే కృష్ణాజలల వివాదం. ఏ పార్టీ కూడా దీనిపై పెద్దగా రియాక్ట్ అయింది లేదు. రాయలసీమలో ఏర్పాటు అవుతున్న ఎత్తిపోతల పథకంపై మొదటిసారిగా గొంతు సవరించుకుంది టీఆర్‌ఎస్‌ మాత్రమే. గతంలో కాంగ్రెస్, బీజేపీ విమర్శలు చేసినా ఈ సీజన్‌లో మాత్రం విమర్శల దాడిని పెంచింది గులాబీ దళం. ఏపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలకు మించి విమర్శలు చేశారు తెలంగాణ మంత్రులు. ఈ సీజన్‌లో ప్రజల్లో ఇదో హాట్‌టాపిక్‌గా మారింది. 





రేవంత్‌ చేతిలో కాంగ్రెస్‌


ఈటల ఎపిసోడ్‌తో సమాంతరంగా సాగింది కాంగ్రెస్‌ పీసీసీ లొల్లి. సుమారు 10 మంది వరకు సీనియర్ నేతలంతా ఈ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర చీఫ్‌ పదవి కోసం పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అదో రకమైన రాజకీయం. అంతా కలిసే ఉంటారు. కానీ ఎవరితో ఎవరికీ పడదు. నమ్మినట్టే ఉంటారు.. కానీ ఒకరిపై ఇంకొకరికి నమ్మకం ఉండదు. మొత్తానికి అన్ని వర్గాలను ఒప్పించామన్న ధీమాతో అధిష్ఠానం చివరకు పీసీసీ ప్రెసిడెంట్‌గా రేవంత్‌ రెడ్డిని ప్రకటించింది. రేవంత్‌రెడ్డిని పీసీసీ చీఫ్‌గా అంగీకరించేందుకు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంటి లీడర్లు సిద్ధంగా లేరు. ఛాన్స్ వచ్చినప్పుడల్లా సెటైర్లు వేస్తూనే ఉన్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డి ముందు ఉన్న టాస్క్‌... హుజురాబాద్‌ ఉపఎన్నిక. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పోటీ ఇవ్వలేకుంటే మాత్రం రేవంత్‌రెడ్డి వ్యతిరేక వర్గం మరింత పెరిగే ఛాన్స్ ఉంటుంది. 


హుజురాబాద్‌పై బీజేపీ ఆశలు 


దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల విజయాలతో జోష్‌ మీద ఉన్న బీజేపీకి కరోనా టైంలో పెట్టిన కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలు షాక్‌ ఇచ్చాయి. ఎక్కడా అనుకున్న స్థాయిలో పోటీ ఇవ్వలేకపోయిందా పార్టీ.  ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఘోరంగా ఓడిపోయింది ఆ పార్టీ. హైదరాబాద్‌ సిట్టింగ్ స్థానాన్నే కోల్పోయింది. ఈ ఎఫెక్ట్‌తో కాస్త సైలెంట్‌ అయిన కమలనాథులు... ఈటల రాకతో మళ్లీ స్పీడ్ పెంచారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. అందులోనూ కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి ప్రమోట్‌ అవ్వడం కూడా బీజేపీకి కలిసి వచ్చింది. 


సైకిల్‌ తొక్కే వాళ్లు కావాలి


తెలంగాణలో ఉనికి కోసం పోరాడుతున్న టీడీపీకి... ఎల్‌ రమణ రాజీనామా పెద్ద దెబ్బగానే చెప్పొచ్చు. బీసీ వర్గానికి చెందిన ఆయన వెళ్లిపోవడంతో తర్వాత అధ్యక్షుడి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు ఆ పార్టీ నేషనల్‌ చీఫ్‌ చంద్రబాబు. ప్రయోగాత్మకంగా యువతకు ఈ పదవి ఇస్తే ఎలా ఉంటుందనే ఆలోచన ఆయన చేస్తున్నట్టు తెలుస్తోంది. 


మరోసారి వైఎస్‌ నామ జపం


ఇప్పుడున్న పార్టీలకు భిన్నంగా తాము రాజకీయం చేస్తామంటూ పుట్టుకొచ్చింది షర్మిల పార్టీ. వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ పేరుతో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు షర్మిల. అన్నతో విభేదించి తండ్రి పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టారు. తల్లి మద్దతుతో గ్రాండ్‌గా పార్టీ పేరును అనౌన్స్‌ చేశారు. రాబోయే రోజుల్లో ఈ పార్టీ ఎఫెక్ట్‌ ఎవరిపై ఎలా ఉంటుందో అన్న చర్చ కూడా తెలంగాణలో జోరుగా సాగుతోంది. అప్పట్లో తండ్రి ప్రవేశ పెట్టిన పథకాలు... ప్రజల్లో ఆయనకు ఉన్న పేరును క్యాష్‌ చేసుకోవాడనికి షర్మిల ట్రై చేస్తున్నారు. వైఎస్‌ క్రెడిట్‌ షేరింగ్ విషయంలో కాంగ్రెస్‌, షర్మిల మధ్య చిన్న టైపు వార్ నడుస్తోంది. 


ఇలా కరోనా కేసులు తగ్గుతున్నట్టుగానే పొలిటికల్ హీట్‌ కూడా పెరుగుతోంది. ఇప్పట్లో హుజురాబాద్‌ బైపోల్‌ మినహా వేరే ఎన్నికలు లేకపోయినా రాజకీయలు చాలా చురుగ్గా ఉన్నాయి.