చాణక్యుడు, కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు…ఏందుకీ గందరగోళం?
క్రీస్తపూర్వం నాలుగో శతాబ్దం, మూడో శతాబ్దం మధ్యకాలంలో జీవించిన గొప్ప మేధావి, రాజనీతిజ్ఞుడు కౌటిల్యుడు. ఈ పేరు చెప్పేసరికి ప్రపంచంలో అతి ప్రాచీన గ్రంధాల్లో ప్రత్యేకంగా చెప్పుకోదగిన అర్థశాస్త్రం గుర్తొస్తుంది. అపారమైన రాజనీతిజ్ఞత వందల సంవత్సరాలు నిరంతరాయంగా పాలించిన నందవంశాన్ని నిర్మూలించి…మగధ సింహాసనంపై చంద్రగుప్తుడిని కూర్చోబెట్టిన అపర మేధావి. నందవంశ నిర్మూలను…మౌర్య వంశ స్థాపనకు మూల కారకుడు కౌటిల్యుడే.
ప్రపంచ ప్రసిద్ధి గ్రీకు తత్వవేత్తలు ప్లేటో, అరిస్టాటిల్ సరసన కూర్చోబెట్టాల్సిన మేధావి కౌటిల్యుడు. జగజ్జేత అలెగ్జాండర్ కి అరిస్టాటిల్ గురువైతే…చాణక్యుడు చంద్రగుప్తుడికి గురువు. భారతదేశాన్ని కబళించేందుకు ఉద్యమించి , కొన్ని ప్రాంతాలను తమ అధీనంలోకి తీసుకుని ఇంకా ముందుకి రావాలని చూస్తున్న అలెగ్జాండర్ దూకుడికి కళ్లెం వేసి… అప్పట్లో విదేశీ పరిపాలన నుంచి భారతదేశానికి విముక్తి కల్పించిన చిరస్మరణీయులు చాణక్య చంద్రగుప్తులు.
అయితే కౌటిల్యుడి, చాణక్యుడు, విష్ణుగుప్తుడు. ఈ మూడు పేర్ల విషయంలో గందరగోళానికి గురయ్యేవారెందరో. ముఖ్యంగా చాణక్యుడు-కౌటిల్యుడు వేరు వేరు వ్యక్తులనే భావన చాలామందిలో ఉంది. ఇక ఎవ్వరిలోనూ అలాంటి కన్ఫూజన్ లేకుండా క్లారిటీ ఇస్తోంది మీ ఏబీపీ డిజిటల్ మీడియా.
కౌటిల్య అనేది కుటుంబనామం…అంటే ఇంటిపేరు
తండ్రి చణకుడు కాబట్టి చాణక్యుడిగా ప్రాచుర్యం పొందాడు
తల్లిదండ్రులు పెట్టిన పేరుమాత్రం విష్ణుగుప్తుడు
అర్థశాస్త్ర గ్రంధ రచయితగా కౌటిల్యుడు ప్రసిద్ధుడు… చాణక్యుడిగా సుపరిచితుడు....అర్థశాస్త్రంలో విష్ణుగుప్తుడు ఈ గ్రంధ రచయిత అని అక్కడక్కడా పేర్కొన్నారు.
చాణక్యుడి తర్వాతి కాలంలో యజ్ఞవల్క మహర్షి మొదలు..ఆచార్య వాత్స్యాయనుడు, అశ్వఘోషుడు ఇలా ఎందరో మేధావులు తమ గ్రంధాల్లో ఓ సందర్భంలో చాణక్యుడని…మరో సందర్భంలో కౌటిల్యుడని ఉదహరించడంతో… కౌటిల్యుడు-చాణక్యుడు అనేవారు ఒక్కరా-వేర్వేరా? అనే తర్కం మొదలైంది. కాలగమనంలో ఈ వివాదం ముగిసిపోయి కౌటిల్యుడు, చాణక్యుడజు, విష్ణగుప్తుడు ఈ మూడు పేర్లు ఒక్కరివే అనే భావం స్థిరపడిపోయింది.
కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం…ప్రపంచ భాషల్లో మొదటిసారిగా ప్రామాణికమైన రీతిలో భారతదేశం నుంచి వెలవడిన శాస్త్రంగా మేధావులు అంగీకరించారు. వాస్తవానికి అర్థశాస్త్రం కౌటిల్యుడు రాయడానికి ముందుకూడా భారతదేశం నుంచి అర్థశాస్త్రానికి సంబంధించిన గ్రంధాలు వెలువడ్డాయి. మొత్తం 14 అర్థశాస్త్రాల్లో కౌటిల్యుడి గ్రంధానికి ఉన్న ప్రపంచ ప్రఖ్యాతి మరే గ్రంధానికి లేదు. ఇందులో ఆర్థిక సంబంధమైన విషయాలు మాత్రమే కాదు…పరిపాలనా సంబంధమైన విషయాలకు కూడా విశేషమైన ప్రాధాన్యత ఇచ్చారు. కౌటిల్యుడి అర్థశాస్త్రం సైన్స్ అండ్ ఎకనమిక్స్ మాత్రమే కాదు… సైన్స్ అండ్ పాలిటిక్స్ ను గురించి చెప్పే గ్రంధం కూడా. చెడ్డమార్గం అనుసరించి అయినా లక్ష్యం చేరుకో అని చెప్పలేదు..ఎందుకంటే కౌటిల్యుడికి నైతికత చాలాముఖ్యం.