జడకి మూడు పాయలే ఎందుకు అల్లుతారు..?
జడ అల్లుకోవడం కూడా మన సంప్రదాయంలో భాగమే.
ఓ వాలు జడా మల్లెపూల జడా
ఓ పాము జడా సత్యభామ జడా
ఓ పట్టు జడా రసపట్టు జడా
బుసకొట్టు జడా నసపెట్టు జడా.... అంటూ...అబ్బో జడని ఎంతలా వర్ణించారో మన సినీ కవులు. జెడని దువ్వని పొగడని మొగుడు జఢపదార్ధమే జడా
అంటూ స్ట్రాంగ్ గా చెప్పారు.
నడుముదాటి జడ అల్లుకున్న అమ్మాయిని చూసి ముచ్చటపడని మగవారుంటారా? సంచెడు డబ్బులతో కానిపని...గుప్పెడు మల్లెపూలతో అవుతుందన్న సామెత కూడా జడను చూసే పుట్టుకొచ్చిందేమో. ఇప్పటి జనరేషన్లో అసలు జడ వేస్తున్న వారెంతమంది ఉన్నారు ? ఉన్న జుట్టుకి క్లిప్పో, రబ్బరు బ్యాండో పెట్టి వదిలేస్తున్నారు...లేదా...కట్ చేసి పోనీ టైల్ అంటున్నారు...ఇంకా కొందరు విరబోసుకుని తిరుగుతున్నారు. జడలో ఉండే అందం...జడ ఆగడాల గురించి బొత్తిగా తెలియదు. చివరికి పెళ్లిళ్లలో కూడా వాలు జడల స్థానంలో రెడీమేడ్ జడలు వచ్చి చేరాయి. అసలు జడ ఎందుకు వేస్తారో ఎంతమందికి తెలుసు?
సాధారణంగా జడ మూడు రకాలుగా వేసుకునేవారు. రెండు జడలు వేసుకోవడం, ఒక జడ వేసుకోవడం, ముడి పెట్టుకోవడం. అంటే జుట్టుని బట్టి జడ వేసుకోవడం కాదు...వయసుని బట్టి అల్లుకునేవారు. ఆడపిల్లలు రెండు జడలు వేసుకుంటే.. ఆమె ఇంకా చిన్న పిల్ల అని, పెళ్లి కాలేదని అర్ధం. అంటే ఆ అమ్మాయిలో జీవేశ్వర సంబంధం విడి విడిగా ఉందని అర్థం. అదే పెళ్లైన మహిళలు మొత్తం జుట్టుని కలిపివేసి ఒకటే జడగా వేసుకునే వారు. అంటే.. ఆమె తన జీవేశ్వరుడిని చేరి వివాహం చేసుకుని భర్త తో కలిసి ఉంటోందని అర్ధం. అలా కాకుండా.. జుట్టుని ముడి వేసుకుని కొప్పులా పెట్టుకుందంటే ఆమెకు సంతానం కూడా ఉందని, అన్ని బాధ్యతలను మోస్తూ గుట్టుగా ముడుచుకుంది అర్ధం వచ్చేలా ఇలా వేసుకునేవారు.
అయితే.. ఒక జడ వేసుకున్నా, రెండు జడలు వేసుకున్నా.. చివరకు కొప్పు పెట్టుకున్నా కూడా జుట్టుని మూడు పాయలు గా విడతీసి త్రివేణీసంగమం లా కలుపుతూ అల్లేవారు. ఈ మూడు పాయలకు రకరకాల అర్ధాలు చెబుతారు పెద్దలు. తానూ, భర్త, తన సంతానం అని ఈ మూడు పాయలకు అర్ధం. ఇంకా, సత్వ, రజ, తమో గుణాలు ....జీవుడు, ఈశ్వరుడు, ప్రకృతి అన్న అర్ధాలు కూడా ఉన్నాయంటారు.
అమ్మాయిలు వేసుకున్న జడని బట్టి వారు పెళ్లైన వారా, పెళ్లికానివారా, పిల్లలు ఉన్నారా-లేరా అనే విషయం తెలిసిపోయేది. హిందువులు పాటించే ప్రతి పద్ధతిలో ఇంత అర్థం ఉంది కాబట్టే...మన సంస్కృతి సంప్రదాయాలపై నానాటికి మక్కువ పెరుగుతోంది.