Telangana Police Clarity on Childrens Kidnap Fake News: రాష్ట్రంలో చిన్నారులను కిడ్నాప్ చేసే ముఠాలు ప్రవేశించాయని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ తాజాగా కొన్ని సందేశాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. హనుమకొండ (Hanmakonda), నిజామాబాద్, సిద్ధిపేట, వరంగల్, కామారెడ్డి సహా పలు జిల్లాల్లో పిల్లల కిడ్నాప్ ముఠాలు సంచరిస్తున్నాయన్న వార్తలు వైరల్ కావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. అయితే, దీనిపై పోలీసులు స్పందించారు. చిన్నారుల కిడ్నాప్, ముఠాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. అలాంటి ఫేక్ ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని స్పష్టం చేశారు. తాజాగా, కామారెడ్డి (Kamareddy) జిల్లాలో అనుమానాస్పదంగా సంచరిస్తోన్న ఆరుగురిని స్థానికులు గుర్తించి వెంబడించగా వారిలో నలుగురు పరారయ్యారు. ఇద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ క్రమంలో పిల్లలను కిడ్నాప్ చేసే ముఠాల సంచరిస్తున్నాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. ఇదంతా ఫేక్ అని సర్క్యులేట్ అవుతున్న వీడియోల్లో కొన్ని పాతవని క్లారిటీ ఇచ్చారు. మరోవైపు, నిజామాబాద్ (Nizamabad) జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇటీవల చిన్నారులు కిడ్నాప్ నకు గురి కావడం కలకలం రేపింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి ఇద్దరు చిన్నారులను రక్షించి పేరెంట్స్ కు అప్పగించారు. ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో కిడ్నాప్ ముఠాలు తిరుగుతున్నాయని.. పోలీసులు దీనిపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. అయితే, కిడ్నాప్ ముఠాలకు సంబంధించి ఎలాంటి ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దని పోలీసులు స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కు ఫోన్ చేయాలని లేదా 8712685070కు సమాచారం అందించాలని సూచించారు.
Also Read: Suryapeta News: గురుకుల కళాశాలలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - సూర్యాపేట జిల్లాలో ఘటన