Inter Girl Student Forceful Death in Suryapeta: సూర్యాపేట (Suryapeta) జిల్లాలోని ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. పట్టణంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన వైష్ణవి గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీ రెండో సంవత్సరం చదువుతోంది. శనివారం ఫేర్వెల్ పార్టీ సందర్భంగా అంతా సందడిగా ఉన్న సమయంలో ఆమె రాత్రి డార్మిటరీ హాల్ లో ఫ్యానుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పార్టీ పూర్తైన అనంతరం ఈ ఘటన జరిగింది. అయితే, హాల్ కు వెళ్లిన ఆమె ఎంతకీ తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన సహ విద్యార్థులు వెళ్లి చూడగా ఫ్యానుకు ఉరి వేసుకోవడం చూసి షాకయ్యారు. వెంటనే ఆమెను కిందకు దించి రక్షించేందుకు యత్నించారు. ఉపాధ్యాయులు, సిబ్బంది సమాచారం ఇచ్చారు. విద్యార్థిని కొన ఊపిరితో ఉండగా ఆమెను అంబులెన్సులో ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే వైష్ణవి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విద్యార్థిని మృతితో స్థానికంగా విషాదం అలుముకుంది.
తల్లిదండ్రుల ఆందోళన
ఈ సమాచారం తెలుసుకున్న వైష్ణవి తల్లిదండ్రులు ఆస్పత్రికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. తమ కుమార్తె ఫేర్వెల్ వేడుకల్లో అప్పటివరకూ సరదాగా గడిపిందని.. ఇంతలోనే ఇలా ఆత్మహత్య చేసుకోవడం ఏంటనే అనుమానాలు వ్యక్తం చేశారు. వైష్ణవి బలవన్మరణానికి కళాశాల అధ్యాపకులే కారణమని వారు ఆరోపించారు. నాణ్యమైన భోజనం పెట్టకపోవడంతో వైష్ణవి ఉపాధ్యాయులను ప్రశ్నించిందని.. దాన్ని మనసులో పెట్టుకునే వేధింపులకు గురి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజ నిర్ధారణ చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గురుకుల కళాశాల ముందు వైష్ణవి కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారికి నచ్చచెప్పారు. మరోవైపు, ఈ ఘటనపై ప్రిన్సిపాల్ ఝాన్సీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. కాగా, వారం రోజుల క్రితం భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఇద్దరు టెన్త్ విద్యార్థినులు ఆత్మహత్య ఘటన మరువక ముందే ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది.
మార్కులు తక్కువ వచ్చాయని
మరోవైపు, ఫలితాల్లో తనకు తక్కువ మార్కులు వచ్చాయని ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన హైదరాబాద్ (Hyderabad)లో శనివారం జరిగింది. మాదాపూర్ (Madhapur) అయ్యప్ప సొసైటీలోని నారాయణ కాలేజీలో విజయ్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక క్యాంపస్ లో విద్యార్థి ఐఐటీ కోచింగ్ తీసుకుంటున్నాడు. ఐఐటీ ఫలితాల్లో తనకు తక్కువ మార్కులు వచ్చాయనే మనస్తాపంతో.. ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. విద్యార్థి స్వస్థలం ఏపీలోని శ్రీకాళహస్తిగా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Kamareddy News: ప్రభుత్వాసుపత్రిలో దారుణం - ఐసీయూలో రోగిన కరిచిన ఎలుకలు, ఎక్కడంటే?