New MLAs Oath in Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Legislative Assembly) ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్, ఎంఐఎంకు చెందిన చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణం చేయించారు. తొలుత సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), తర్వాత భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), ఆ తర్వాత మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సమావేశాలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. తొలుత గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం వీరు అసెంబ్లీకి చేరుకున్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ శాసన సభా పక్ష నేతగా మాజీ సీఎం కేసీఆర్ (KCR)ను ఎన్నుకున్నారు. అనారోగ్యం కారణంగా మాజీ సీఎం కేసీఆర్ సభకు హాజరు కాలేదు. ఆయనకు సర్జరీ దృష్ట్యా ప్రమాణ స్వీకారానికి కేటీఆర్ సైతం రాలేదు. ప్రమాణ స్వీకారానికి తనకు మరో రోజు సమయం ఇవ్వాలని ఆయన శాసన సభ సెక్రటరీని కోరారు. ఈ రోజు హాజరు కాని కొందరు ఎమ్మెల్యేలతో కలిపి ప్రమాణ స్వీకారానికి మరో తేదీని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, మొత్తం 109 మంది ఎమ్మెల్యేలు తొలి రోజు శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. తొలిసారి 51 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అడుగుపెట్టారు.
14కు వాయిదా
తెలంగాణ అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సమావేశాలు వాయిదా వేశారు. ఈ నెల 14కు శాసనసభను వాయిదా వేస్తూ ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ నిర్ణయం తీసుకున్నారు. అంతకు ముందు రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాలు ప్రారంభిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు.
బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరు
ఈ సమావేశాలకు బీజేపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని, ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ను ఎంపిక చేయడం పట్ల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అసెంబ్లీ సమావేశాలు బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయనున్నారు. అంతకు ముందు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తో గవర్నర్ తమిళిసై ప్రమాణం చేయించారు.
'అది లోపాయికారి ఒప్పందం'
కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. అందులో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా ఎంపిక చేశారని మండిపడ్డారు. సీనియర్ ఎమ్మెల్యేలను కాదని ఏ ప్రాతిపదికన అక్బరుద్దీన్ ను ఎంపిక చేశారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒక్క స్థానం నుంచి 8 స్థానాలకు ఎదిగామని అన్నారు. ఈ ఎన్నికల్లో కమలం పార్టీని ప్రజలు ఆదరించారని, వారి నమ్మకం నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. 'మా ఓటు బ్యాంకు 6 నుంచి 14 శాతానికి పెరిగింది. కాంగ్రెస్ తన పాత అలవాటు ప్రకారం శాసనసభ గౌరవాన్ని కాలరాసింది. మజ్లిస్ తో ఒప్పందం ప్రకారమే ఆ పార్టీ అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ ను చేసింది. ఈ నిర్ణయాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోంది. సీనియర్ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నా అక్బరుద్దీన్ ను ప్రొటెం స్పీకర్ గా చేశారు. ఆయన ఎదుట బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేయరు. ఈ అంశంపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తాం. స్పీకర్ ఎన్నికల ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. రెగ్యులర్ స్పీకర్ ఎన్నిక తర్వాతే బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణం చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుమ్మినా, దగ్గినా పడిపోతుంది. అందుకే మజ్లిస్ ను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తోంది.' అని కిషన్ రెడ్డి విమర్శించారు.