Revanth Reddy Comments in Sonia Gandhi Birthday Celebrations: కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ (Sonis Gandhi) జన్మదినం తెలంగాణ ప్రజలకు ఓ పండుగ అని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. ఆమె జన్మదినం రోజే ప్రత్యేక రాష్ట్రం ప్రకటన వచ్చిందని గుర్తు చేశారు. సోనియా గాంధీ 78వ పుట్టిన రోజు వేడుకలను గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. పీసీసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీఎం సహా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు, వీహెచ్, ఇతర సీనియర్ నేతలు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా 78 కిలోల కేక్ ను పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్ తో రేవంత్ కట్ చేయించారు. అనంతరం నాయకులకు వీహెచ్ కేక్ తినిపించారు.


'ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తాం'


2009, డిసెంబర్ 9న తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలైందని, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని ఉక్కు సంకల్పంతో సోనియమ్మ మన ఆకాంక్షలు నెరవేర్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. 'తెలంగాణ తల్లి ఎలా ఉంటుందో మనం చూడలేదు. తెలంగాణ తల్లి సోనియమ్మ రూపంలో ఉంటుందని మనకు భరోసా ఇచ్చింది. తెలంగాణ ప్రజలు కృతజ్ఞత భావంతో ఉంటారని మొన్నటి ఎన్నికల తీర్పుతో నిరూపించారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు ప్రజలు నాకు ఈ బాధ్యత ఇచ్చారు. వారి సేవకుడిగా అందరి ఆకాంక్షలు నెరవేరుస్తాను. కార్యకర్తలకు కచ్చితంగా న్యాయం చేస్తాను.' అని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వమని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన ఉంటుందని పేర్కొన్నారు. పదేళ్లు కార్యకర్తలు వేల కేసులు ఎదుర్కొన్నారని, భుజాలు కాయలు కాసేలా కష్టపడ్డ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. సోనియా గాంధీ వందేళ్లు సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. శాసనసభలో అడుగు పెడుతున్న సందర్భంగా ప్రజల ఆశీర్వాదం ఇవ్వాలన్నారు. 6 గ్యారంటీల హామీల్లో రెండింటిని సోనియా పుట్టిన రోజు నుంచి ప్రారంభించాలని నిర్ణయించడం సంతోషకరమని కాంగ్రెస్ నేతలు తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, కష్టంతోనే అధికారంలోకి వచ్చామని, వారి ఆశీస్సులతో అసెంబ్లీకి వెళ్తున్నామని చెప్పారు.


2 పథకాలకు శ్రీకారం


అసెంబ్లీ ఆవరణలోని ఒకటో గేటు వద్ద సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2 పథకాలను ప్రారంభించనున్నారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, పేదలందరికీ రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద రూ.10 లక్షల ఉచిత వైద్య సదుపాయం చేయూత పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.






Also Read: Telangana Assembly meeting: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బహిష్కరించిన బీజేపీ - అక్బరుద్దీన్ ఎదుట ప్రమాణం చేయమని స్పష్టీకరణ