Uttam Kumar Reddy Review: తెలంగాణలో కొత్త రేషన్‌ కార్డుల జారీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కొత్త రేషన్ కార్డులు కావాలనుకునేవారి నుంచి త్వరలోనే అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. ఇందుకోసం విధివిధానాలను కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించనుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. సచివాలయంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులతో నీటి పారుదల, సివిల్ సప్లయ్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త రేషన్ కార్డుల జారీతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డులపై కూడా అధికారులతో మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.


కొన్ని నెలలుగా రేషన్‌ తీసుకోని కార్డులు ఉంచాలా.. తీసేయాలా అనేదానిపై అధికారులతో చర్చలు చేశారు. అసలైన అర్హులకే కార్డులుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. కొత్త కార్డులకు ఎవరు అర్హులనే దానిపై చర్చలు కొనసాగాయి. సంక్షేమ పథకాలకు, రేషన్‌ కార్డులకు అనుసంధానం లేకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సంక్షేమ పథకాలకు రేషన్‌ కార్డు అనుసంధానిస్తే.. కార్డుల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కొత్త కార్డుల జారీకి ఆదాయ పరిమితి ఎంత విధించాలనే దానిపై ఈ వారంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అది ఓ కొలిక్కి వస్తే కొత్త రేషన్‌ కార్డుల కోసం ప్రజల ఎదురుచూపులు ఫలించనున్నాయి. గత 9 ఏళ్లుగా కొత్త రేషన్‌ కార్డులు జారీ కాని సంగతి తెలిసిందే.


రూ.500 కే వంట గ్యాస్ పైనా చర్చ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో భాగంగా త్వరలో మహాలక్మి పథకం కింద రూ.500 కు వంట గ్యాస్ సిలిండర్ ఇచ్చే అంశంపై కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చర్చించారు. రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరణ.. రేషన్ లబ్దిదారులకు నాణ్యమైన బియ్యం సరఫరా అంశాలను కూడా మరోసారి చర్చించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, సివిల్ సప్లయ్ కమిషనర్ అనిల్ కుమార్ పాల్గొన్నారు.