Telangana Election Nominations 2023: తెలంగాణలో నామినేషన్ల ప్రక్రియ ఊపందుకుంది. శుక్రవారంతో నామినేషన్ల సమర్పణకు గడువు ముగుస్తుండడంతో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నేతలు నామినేషన్లు సమర్పిస్తున్నారు. గురువారం మంచిరోజు కావడంతో సెంటిమెంట్ గా నేతలు ఈ రోజు అధికంగా నామినేషన్లు సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా నియోజకవర్గాల్లో రిటర్నింగ్ అధికారి కార్యాలయాల వద్ద సందడి నెలకొంది. సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డిల్లో నామినేషన్ దాఖలు చేయగా, మంత్రులు కేటీఆర్ సిరిసిల్ల, హరీష్ రావు సిద్ధిపేటల్లో నామినేషన్ వేశారు. అటు, కాంగ్రెస్ అగ్ర నేతలు, బీజేపీ కీలక నేతలు సైతం ఇవాళ అధికంగా నామినేషన్లు వేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanthreddy) ఇప్పటికే కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి (Utham Kumarreddy) హుజూర్ నగర్ నుంచి నామినేషన్ వేశారు. ఎల్బీనగర్ నుంచి మధుయాష్కీ, నిడమనూరు నుంచి జానారెడ్డి, మధిరలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క (Bhatti Vikaramarka) నామినేషన్ దాఖలు చేశారు. ఇతర నేతలతో కలిసి వెళ్లి రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. తాను 50 వేల మెజార్టీతో గెలవబోతున్నట్లు కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పేదల సంక్షేమం కోరే పార్టీ అని, నియోజకవర్గంలో ప్రతి ఒక్కరినీ కలుపుకొని పని చేస్తామన్నారు. ఎన్నికల్లో గెలిస్తే హుజూర్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు.
చెన్నూరులో ఉద్రిక్తత
చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి నామినేషన్ సందర్భంగా స్వల్ప వాగ్వాదం నెలకొంది. అదే సమయంలో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ నామినేషన్ వేసేందుకు రాగా, ఇరు పార్టీల కార్యకర్తల పోటాపోటీగా నినాదాలు చేశారు. బాల్క సుమన్ వాహనాన్ని లోపలి వరకూ అనుమతించారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరగ్గా పోలీసుల రంగ ప్రవేశంతో వివాదం సద్దుమణిగింది. అనంతరం వివేక్ వెంకటస్వామి తన నామినేషన్ దాఖలు చేశారు. అటు హన్మకొండ జిల్లా పరకాలలోనూ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి రేవూరి ప్రకాష్ రెడ్డి ఒకేసారి రావడంతో కార్యకర్తలు గట్టిగా నినాదాలు చేయడంతో వివాదం నెలకొంది. పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేశారు.
ఇబ్రహీంపట్నలోనూ
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనూ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అభ్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి నామినేషన్ వేసేందుకు రాగా, ఒకేసారి భారీ ర్యాలీలు చేపట్టడంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ర్యాలీగా వెళుతున్న సమయంలో రెండు పార్టీలు ఎదురుపడ్డాయి. దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘటనలో పలువురు నాయకులు, కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు.
మరోవైపు, సూర్యాపేట జిల్లా కోదాడలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినిగా ఉత్తమ్ పద్మావతి నామినేషన్ దాఖలు చేశారు. ఆమె ఎలాంటి ఆర్భాటం లేకుండా భర్త ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట రాగా, ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ సమర్పించారు. అటు, సూర్యాపేట కాంగ్రెస్ అభ్యర్థిగా రాంరెడ్డి దామోదర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ తనకే ఇస్తుందన్న నమ్మకంతో నామినేషన్ వేశానని, సూర్యాపేటతో పాటు తుంగతుర్తి, పాలేరు నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయింపు పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతుండగానే, ఆ పార్టీ తరఫున టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్న బత్తుల లక్ష్మారెడ్డి తన నామినేషన్ దాఖలు చేశారు. స్థానిక తుంగపహాడ్ గ్రామం నుంచి వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు వెంట రాగా భారీ ర్యాలీగా బయలుదేరిన ఆయన మిర్యాలగూడ రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేశారు. టికెట్ కేటాయింపు విషయం అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. అధికార పార్టీ ప్రలోభాలకు ప్రజలు లొంగవద్దని కోరారు.
మాజీ మంత్రుల నామినేషన్
వరంగల్ తూర్పులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కొండా సురేఖ నామినేషన్ దాఖలు చేశారు. పరకాల కాంగ్రెస్ అభ్యర్థిగా రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నాయిని రాజేందర్ రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కార్యాలయంలో కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సత్తుపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా మట్టా రాగమయి నామినేషన్ దాఖలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేకే మహేందర్ రెడ్డి నామినేషన్ వేశారు.
బీజేపీ నేతలు సైతం
బీజేపీ నేతలు సైతం గురువారం నామినేషన్లు వేశారు. హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ప్రత్యేక హెలికాప్టర్ లో అక్కడికి చేరుకున్నారు. ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అటు, వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా రావు పద్మా అమరేందర్ రెడ్డి నామినేషన్లు వేశారు. స్టేషన్ ఘన్పూర్ బీజేపీ అభ్యర్థిగా విజయరామారావ్ నామినేషన్లు సమర్పించారు.