Telangana Elections 2023: సీఎం కేసీఆర్ పాలనతో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారు. హైదరాబాద్ లో సోమవారం మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకే 'బీసీ బంధు' దక్కిందని, కేసీఆర్ పాలనలో దళితులు, బీసీలు, రైతులు ఎవరూ సంతోషంగా లేరని విమర్శించారు. సీఎం భూ దందాలకు పాల్పడుతున్నారని, అసైన్డ్, ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని, రూ.లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వమే స్వయంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని ధ్వజమెత్తారు. కొందరు బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శిస్తున్నాని, అవి రెండూ ఒక్కటైతే తాను గజ్వేల్ లో ఎందుకు పోటీ చేస్తానని ప్రశ్నించారు. బీఆర్ఎస్ ను గద్దె దించడం ఒక్క బీజేపీకే సాధ్యమని, తెలంగాణలో అభివృద్ధి జరగాలంటే కమలం పార్టీ అధికారంలోకి రావాలని ఈటల అన్నారు.
'సీఎం కేసీఆర్ విఫలం'
ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో సీఎం కేసీఆర్ సంపూర్ణంగా విఫలమయ్యారని ఈటల విమర్శించారు. కేసీఆర్ తనను తాను ఎక్కువగా ఊహించుకుంటారని, వాస్తవాలు, నిజాలు తెలుసుకోవడానికి ఇష్టపడరని అన్నారు. కాళ్ల కింద భూమి కదులుతోన్న విషయాన్ని సీఎం గ్రహించడం లేదని, రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
'30 వేల మంది కేసీఆర్ బాధితులు'
హైదరాబాద్ నగరం చుట్టుపక్కల 5,800 ఎకరాల భూమిని అభివృద్ధి పేరిట అతి చౌక ధరలకు కేసీఆర్ కుటుంబం తీసుకుందని, ఒక్క గజ్వేల్ లోనే 30 వేల మంది కేసీఆర్ బాధితులున్నారని ఈటల ఆరోపించారు. కేసీఆర్ అడుగులకు మడుగులు వత్తే వారికే బీసీ బంధు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కలిసి పని చేసిన చరిత్ర కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ఉందని, ఈ 2 పార్టీలు కలిసి బీజేపీపై విష ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ను నిలువరించే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని, హుజూరాబాద్ ఫలితమే గజ్వేల్ లోనూ రిపీట్ అవుతుందని ఈటల ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నామినేషన్ వేయనున్నట్లు ఈటల తెలిపారు.
ప్రచారంలో 40 మంది నేతలు
మరోవైపు, తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారానికి ఆ పార్టీ ముఖ్య నేతలు రాష్ట్రానికి రానున్నారు. ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్ తదితరులు ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం 40 మంది నేతలు ప్రచారంలో పాల్గొననున్నట్లు బీజేపీ ప్రకటించింది.
అటు, ఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మ గౌరవ సభకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సభకు తెలంగాణ ముఖ్య నేతలు సహా, జనసేనాని పవన్ కల్యాణ్ సైతం హాజరు కానున్నారు. ఇప్పటికే సభకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
Also Read: హైదరాబాద్ ఓటర్లకు క్యూలైన్ అప్‌డేట్స్-ఓటింగ్ పెంచేందుకు కొత్త విధానం