Delhi Air Pollution:
ఉన్నత స్థాయి సమావేశం..
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఉన్నత స్థాయి సమావేశానికి పిలుపునిచ్చారు. నగర వ్యాప్తంగా కాలుష్య (Delhi Air Pollution) తీవ్రత ప్రమాదకరంగా మారుతున్న క్రమంలో అధికారులతో భేటీ కానున్నారు. ఈ సవాలుని దాటుకునేందుకు ఎలాంటి చర్యలు చేపట్టాలో చర్చించనున్నారు. ఈ సమావేశానికి అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ (Gopal Rai) కూడా హాజరు కానున్నారు. పర్యావరణ శాఖకు చెందిన కీలక అధికారులూ పాల్గొననున్నారు. దాదాపు ఐదు రోజులుగా దేశ రాజధానిలో పరిస్థితులు మరింత ఆందోళనకరంగా మారుతూ వస్తున్నాయి. అన్ని చోట్లా పొగ మంచు కప్పేసింది. దీనికి తోడు కాలుష్యం ఇంకాస్త ఇబ్బంది పెడుతోంది. విజిబిలిటీ పూర్తిగా తగ్గిపోయింది. ఎయిర్ క్వాలిటీ (Delhi Air Quality) అంతకంతకూ పడిపోతోంది. AQI ఇంకా "Severe"కేటగిరీలోనే ఉంది. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం..AQI 488గా ఉంది. ఢిల్లీ మొత్తం కాలుష్యం కమ్ముకున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఈ ప్రభావం మరీ తీవ్రంగా ఉంది. ఆర్‌కే పురంలో AQI 466, ITOలో 402, పత్పర్‌గంజ్‌లో 471, మోతి బాగ్‌లో 488గా రికార్డ్ అయింది. ఊపిరాడనంతగా పొగ మంచు కమ్ముకుంది. చాలా మంది శ్వాసకోశ సమస్యలతో బాధ పడుతున్నారు. ఆసుపత్రికి ఈ బాధితుల తాకిడి ఎక్కువైంది. దీంతో పాటు మరి కొందరు కళ్లమంటలతో సతమతం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. PM2.5 పార్టికల్స్ నేరుగా ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకుని పోతాయని హెచ్చరిస్తున్నారు. ఈ పార్టికల్స్ ఉండాల్సిన దాని కన్నా 7-8 రెట్లు ఎక్కువగా ఉంటున్నాయి.
అప్రమత్తమైన కేంద్రం..
ఢిల్లీ సహా పరిసర ప్రాంతాల్లో కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. Graded Response Action Plan (GRAP) చర్యలు తీసుకుంటోంది. కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు ఈ ప్లాన్ అమలు చేస్తోంది. మొత్తం నాలుగు దశల్లో ఈ చర్యలు అమలు చేయనుంది. ఇందులో స్టేజ్ 4 ని సివియర్ కేటగిరీగా పరిగణిస్తారు. AQI 450 కన్నా ఎక్కువగా నమోదైతే వెంటనే ఈ చర్యలు తీసుకుంటారు. ఇందులో భాగంగానే ఢిల్లీలోకి ట్రక్‌లు రావడంపై ఆంక్షలు విధించారు. నిత్యావసర సరుకులు తీసుకొచ్చే ట్రక్‌లు తప్ప మిగతావి నగరంలోకి ఎంటర్ కావద్దని అధికారులు ఆదేశించారు. ఎలక్ట్రిక్, CNG వాహనాలు ఎక్కువగా తిరిగేలా ప్రోత్సహిస్తున్నారు. ఈ చర్యలతో పాటు నిర్మాణ పనులపైనా ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఉద్యోగులు వీలైనంత వరకూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్‌నే తీసుకోవాలని సూచిస్తున్నారు.