గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో దాదాపు 90 లక్షల మందికి ఓటర్లు ఉన్నారు. ఓటర్ల సంఖ్య ఎక్కువగానే ఉన్నా... ఓటు వేసే వాళ్లు తక్కువనే చెప్పాలి. గతంలో జరిగిన ఎన్నికలు బట్టి చేస్తే... గ్రేటర్‌ హైదరాబాద్‌లో నమోదయ్యే ఓటింగ్‌ శాతం తక్కువే. దీనికి గల కారణాలను అన్వేషించారు అధికారులు. పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలైన్లు ఎక్కువగా ఉండటం, మౌలిక సదుపాయాలు సరిగా లేకపోవడం కారణమని గుర్తించారు. అలాగే పోలింగ్‌ కేంద్రాల్లో కనీసం మంచి సదుపాయం కూడా కల్పించకపోవడంతో... కొందరు ఓటర్లు అసలు  ఓటు వేసేందుకు రావడంలేదని తెలుసుకున్నారు. అయితే, ఈసారి వారందరినీ పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.


పోలింగ్‌ కేంద్రాల్లో పరిస్థితి చూసి ఓటు వేయడం ఇష్టం లేని వారు కొందరైతే... భారీ క్యూలైన్లు, గంటల తరబడి వెయిటింగ్‌ నచ్చని వారు ఇంకొదరు. ఇలా రకరకాల కారణాలతో హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం తగ్గుతోందని అధికారులు గుర్తించారు. క్యూలైన్లలో గంటలకు గంటలు ఎక్కడ వేచిఉంటాము అనుకుని... ఓటు వేయడం మానేసేవారు చాలా మందే ఉన్నారని చెప్తున్నారు. ఇలాంటి వారి కోసం ఎన్నికల అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం టెక్నాలజీ సాయంతో కొత్త విధానాలను అవలంభిస్తున్నారు.


తెలంగాణలో ఎన్నికల పోలింగ్‌ ఈనెల 30న జరగనుంది. ఆరోజున ఓటర్లు ఇంటికి పరిమితం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు బల్దియా అధికారులు. ఓటర్ల మొబైల్‌ ఫోన్లకు  మెసేజ్‌లు పంపబోతున్నారు. వారు ఓటు వేయాల్సిన పోలింగ్‌ స్టేషన్‌, అక్కడి క్యూ లైన్ల పరిస్థితిని ఎప్పటికప్పుడు వారికి మెసేజ్‌ రూపంలో అందించబోతున్నారు. పోలింగ్‌ కేంద్రంలో క్యూ తక్కువే ఉంది.. త్వరగా వచ్చి ఓటేయండి అంటూ అలర్ట్‌ మెసేజ్‌ పెట్టనున్నారు. దీని వల్ల పోలింగ్‌ కేంద్రాల్లో క్యూలైన్లు తక్కువగా ఉన్న సమయంలో.. వచ్చి ఓటు వేసే అవకాశం ఉంటుందని జీహెచ్‌ఎంసీ అధికారులు భావిస్తున్నారు. 


గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో అక్ష్యరాసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ కొత్త విధానాన్ని అమలు చేయబోతున్నారు. ఇప్పటికే గ్రేటర్‌ హైదరాబాద్‌ వ్యాప్తంగా మహిళలు,  దివ్యాంగులు, వృద్ధులు, యంగ్‌ ఓటర్ల కోసం థీమాటిక్‌ పోలింగ్‌ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు. అలాగే.. పోలింగ్‌ బూత్‌ల దగ్గర పరిస్థితి, క్యూలైన్‌ వివరాలను స్థానికంగా  ఉండే ఓటర్లకు ఎప్పటికప్పుడు తెలిపితే ఓటింగ్‌ పెరిగే అవకాశం ఉంటుందనేది అధికారుల ఆలోచన. ఇందు కోసం ప్రత్యేకమైన వ్యవస్థను ఏర్పాటు చేసి... బల్క్‌ ఎస్‌ఎంఎస్‌  ద్వారా క్యూలైన్‌ అప్‌డేట్‌ ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగదశలోనే ఉన్నా... పోలింగ్‌ రోజు నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని  చెప్తున్నారు అధికారులు. 


మరోవైపు... గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఇప్పటికే ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. ఇంటింటి ప్రచారంతోపాటు, డోర్‌ స్టిక్కరింగ్‌ వంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇన్ని చేసినా... గడప దాటని ఓటర్లు ఉంటారు. అలాంటి వారిని ఈ అలర్ట్‌ మెసేజ్‌ల పోలింగ్‌ కేంద్రం వరకు తీసుకొస్తాయని అంచనా వేస్తున్నారు. అందుకే.. గ్రేటర్‌ పరిధిలో ఓటింగ్‌ శాతాన్ని పెంచేందుకు టెక్నాలజీని వినియోగిస్తున్నారు. ఇది విజయవంతం అయితే... ఈసారి గ్రేటర్‌ పరిధిలో ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశం ఉంది.