పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు మెరుగైన పాలన అందించాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనలో భాగంగా ఈ కొత్త సెక్రటేరియట్ భవన నిర్మాణం జరిగింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి, అగ్నిమాపక శాఖ, జీహెచ్ఎంసి తదితర శాఖల నుంచి అవసరమైన అనుమతులు పొందిన తర్వాత 2021 జనవరిలో నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ ఏప్రిల్ నెలాఖరు నాటికి సరిగ్గా 26 నెలల సమయం పూర్తవుతుంది. ఆర్ అండ్ బి శాఖ ఐజీబీసీ (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్), టిఎస్ టెక్నలాజికల్ సర్వీసెస్, రాష్ట్ర పోలీసు విభాగాల సూచనలతో ఎలాంటి లోపం లేకుండా ఈ భవన నిర్మాణం జరిగింది. దేశంలోని చారిత్రక కట్టడాల కన్నా దీనిని ఎక్కువ ఎత్తులో నిర్మించారు. అందులో రెండుసార్లు 45 రోజుల చొప్పున కరోనాతో పనులు ఆగిపోయాయి. అయినా కార్మికులను ఎక్కువ మందిని తీసుకొచ్చి ఈ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొదటగా ఈ నిర్మాణం ప్రారంభించినప్పుడు 1500 మందితో ప్రారంభమై చివరకు 4000 మంది కార్మికులు ఈ నిర్మాణం కోసం పనిచేశారు.
సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణ
నూతన సచివాలయాన్ని పరిపాలనా సౌలభ్యంగా ఉండేలా అత్యాధునిక పద్ధతుల్లో నిర్మించారు. సందర్శకులకు ఇబ్బంది కలుగకుండా ఎ,బి,సి,డి విభాగాలుగా సచివాలయన్ని విభజించారు. ఒక్కో విభాగాన్ని కొన్ని శాఖలకు కేటాయించారు. అన్ని అంతస్థుల్లో ఉద్యోగులకు లంచ్ రూమ్ లను నిర్మించారు. ఆరో అంతస్థులో క్యాబినెట్ మీటింగ్ హాల్, కాన్ఫరెన్స్, హాళ్లను ఏర్పాటు చేశారు. సచివాలయంపై నిర్మించిన గుమ్మటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఆహ్లాదకరంగా ఉండేందుకు సచివాలయం ముందు, భవనం మధ్య భాగంలో గ్రీనరీ ఏర్పాటు చేశారు. చుట్టూ రోడ్లతో పాటు నలుదిక్కులా గేట్లను అమర్చారు. అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు భవనం చుట్టూ ఫైరింజిన్ తిరిగేలా ఏర్పాట్లు చేశారు.
మొత్తం 28 ఎకరాలు! అందులో రెండున్నర ఎకరాల్లోనే భవనం!
ప్రధాన గుమ్మటాలపై ఏర్పాటు చేసిన అశోకుడి చిహ్నం నేలపై నుంచి 265 అడుగుల ఎత్తులో ఉంది. గాలి, వెలుతురు ధారళంగా వచ్చే విధంగా నిర్మించారు. 28 ఎకరాల్లో 2.5 ఎకరాల్లో మాత్రమే భవనాన్ని నిర్మించారు. పార్కింగ్ ను 6 ఎకరాల్లో చేసేలా తగిన విధంగా ఏర్పాట్లు చేశారు. 2వేల మంది ఉద్యోగులు పనిచేసే విధంగా నూతన సచివాలయాన్ని నిర్మించారు. లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో స్టోర్స్, రికార్డ్ రూంలు, వివిధ సేవలకు కేటాయించారు. ఉద్యోగుల కోసం ప్రతి అంతస్థులో ఒక లంచ్ రూమ్ ఉంది. రికార్డులు, సెక్యూరిటీ, హౌస్ కీపింగ్, భవన నిర్వహణ తదితర ఆఫీసులను గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేశారు. ఫైర్ స్టేషన్, క్రెషి, డిస్పెన్సరీ, ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్, సెక్యూరిటీ సిబ్బందికి వెస్ యాన్సిలరీ బిల్డింగ్ లు ఉన్నాయి. సౌత్ వెస్ట్ వైపు ఆలయం, మసీదు, చర్చిలను నిర్మించారు. సందర్శకుల కోసం 160 కార్లు, 300 బైక్ లకు సౌత్ ఈస్ట్ వైపు పార్కింగ్ సౌకర్యం ఉంది.
అరు అంతస్తులే కానీ 11 అంతస్తుల నిర్మాణంగా కనిపిస్తుంది
635 గదులు. 30 సమావేశ మందిరాలు. 34 గుమ్మటాలు. అదే తెలంగాణ రాష్ట్ర కొత్త సచివాలయ రూపురేఖలు. సచివాలయ ప్రధాన భవనం ఆరు అంతస్తుల్లో ఉంటుంది. ప్రధాన గుమ్మటం వద్ద మరో ఐదు అంతస్తులతో 11 అంతస్తుల నిర్మాణంగా కనిపిస్తుంది. ముందువైపు 10 ఎకరాల్లో పచ్చిక మైదానం ఉండగా, కోర్ట్ యార్డులో 2 ఎకరాల్లో లాన్ ఏర్పాటు చేశారు. ఢిల్లీలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు భవనం సెంట్రల్ విస్టా కన్నా ఎక్కువ విస్తీర్ణంలో ఉంది. భవన నిర్మాణానికి రూ.617 కోట్లకు పరిపాలన అనుమతులిచ్చారు. అప్పట్లో 6 శాతంగా ఉన్న జీఎస్టీ తర్వాత 18 శాతానికి పెరిగింది. నిర్మాణ సామాగ్రి పనులు పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం దాదాపు 30 శాతానికి పైగా పెరిగింది. ఆరో అంతస్తులోని సీఎంవోకు చేరుకునేందుకు రెండు లిప్టులు ఏర్పాటు చేశారు. మంత్రులు, ఆ స్థాయి వారి కోసం 24 చాంబర్లను రూపొందించారు. మంత్రి, కార్యదర్శి, ఆ శాఖ అధికారులంతా ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేశారు. ఇలాంటి వ్యవస్థ ఉన్న సచివాలయం దేశంలో ఇదొక్కటే. విదేశీ ప్రతినిధులు, ఇతర అతి ముఖ్యమైన వ్యక్తులు వచ్చినప్పుడు హై టీ, రాయల్ డిన్నర్లలకు డైనింగ్ హాలుని వినియోగిస్తారు. అక్కడి నుంచి నగర అందాలు 360 డిగ్రీల కోణంలో వీక్షించవచ్చు. ఈ ప్రాంతాన్ని స్కై లాంజ్‌గా వ్యవహరిస్తారు.