తెలంగాణలో డిసెంబర్ 10న జరిగిన స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. నేటి ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ కేంద్రాలలో ఓట్ల లెక్కింపును సిబ్బంది మొదలుపెట్టారు. కౌంటింగ్ ఏర్పాట్లను ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సోమవారం సమీక్షించారు. స్థానిక సంస్థల కోటాలో కరీంన‌గర్‌ జిల్లాలో రెండు స్థానా‌లకు, ఉమ్మడి మెదక్‌, ఆది‌లా‌బాద్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఒక్కో స్థానా‌నికి పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు ఫలితాలు వెల్లడి అయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు.


నేటి ఉదయం ఉదయం 8 గంటలకు స్ట్రాంగ్ రూమ్ ఓపెన్ చేశారు. ఎజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ లు  ఓపెన్ చేసి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు. ఆదిలాబాద్ లో 6 టేబుళ్లు, కరీంనగర్ 9 టేబుళ్లు, మిగతా చోట్లా 5 టేబుళ్లు ఏర్పాటుచేశామని శశాంక్ గోయల్ వెల్లడించారు. 25 ఓట్ల చొప్పున బండిల్స్ కడతారని.. ముందుగా ఫస్ట్ ప్రిఫరెన్స్ (తొలి ప్రాధాన్యత) ఓట్లని లెక్కించి, తరువాత నెక్ట్స్ ప్రయారిటీ ఓట్లని లెక్కిస్తారని శశాంక్ గోయల్ తెలిపారు. కోవిడ్19 నిబంధనలు పాటిస్తూ కౌంటింగ్ ప్రక్రియ కొనసాగిస్తామని చెప్పారు. లాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.


స్థానిక కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో అత్య‌ధికంగా ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాలో 99.70 శాతం పోలింగ్ న‌మోదు కాగా, 1324 మంది ఓట‌ర్ల‌కు గానూ 1320 మంది త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్నారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో 99.22 శాతం, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో 97.01 శాతం, ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో 96.09 శాతం, ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో 91.78 శాతం ఓటింగ్ న‌మోదైంది.


ర్యాలీలకు అనుమతి లేదు.. 
కౌంటింగ్ కేంద్రాల్లోకి కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారికి మాత్రమే అనుమతి కల్పించినట్లు సమాచారం. గుంపులు గుంపులుగా ఉండొద్దని, కొవిడ్ నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మొబైల్ ఫోన్, కెమెరాలు కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు. నల్గొండ, మెదక్ లో కౌంటింగ్ రౌండ్స్ ఎక్కువ ఉన్నాయని శశాంక్ గోయల్ తెలిపారు. ముఖ్యంగా ఫలితాలు వచ్చిన తరువాత విజేతలు ర్యాలీలు చేయడానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఓ ఇద్దరు మాత్రమే వచ్చి సర్టిఫికెట్ తీసుకుని వెళ్లాలని సూచించారు.
Also Read: Weather Updates: ఏపీలో మరో 48 గంటలు ఓ మోస్తరు వర్షాలు.. తెలంగాణలో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు
క‌రీంన‌గ‌ర్‌లో 2 ఎమ్మెల్సీ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌గా టీఆర్ఎస్ నుంచి ఎల్ ర‌మ‌ణ‌, భానుప్ర‌సాద్ రావు బరిలోకి దిగగా.. మొత్తం 10 మంది అభ్య‌ర్థులు పోటీ చేశారు.  ఖ‌మ్మంలో టీఆర్ఎస్ నుంచి తాత మధుసూదన్, కాంగ్రెస్ నుంచి రాయల నాగేశ్వరరావు, ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కొండపల్లి శ్రీనివాసరావు, కొండూరు సుధారాణి బరిలోకి దిగారు. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి ఎంసీ కోటిరెడ్డి, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఈర్పుల శ్రీశైలం, బెజ్జం సైదులు, న‌గేశ్‌, ల‌క్ష్మ‌య్య‌, వెంక‌టేశ్వ‌ర్లు, కొర్ర రామ్‌సింగ్ పోటీ చేశారు. ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో టీఆర్ఎస్ నుంచి యాద‌వ‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి తూర్పు నిర్మ‌ల‌, ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా మ‌ల్లారెడ్డి పోటీ చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థిగా దండె విఠ‌ల్, స్వ‌తంత్ర అభ్య‌ర్థి పుష్ప‌రాణి మధ్య పోటీ నెలకొంది.  ఫలితాలపై కొన్ని చోట్ల ఉత్కంఠ నెలకొంది.
Also Read: Kalyana Laxmi: ఇదేం చిత్రమయ్యా.. 70 ఏళ్ల వృద్ధురాలి ఖాతాలోకి కల్యాణ లక్ష్మీ డబ్బులు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి