Paddy Procurement In Telangana: పంజాబ్ రాష్ట్రంలో వరి ధాన్యం, గోధుమలను సేకరిస్తున్న మాదిరిగానే తెలంగాణ నుంచి వానాకాలం, యాసంగి  ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని కోరాం, కానీ కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరు, తెలంగాణ ప్రజలను అవమానించిన తీరు గుండెల నిండా బాధనింపిందందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Telangana Minister Vemula Prashanth Reddy). తెలంగాణలో యాసంగిలో పండిన ధాన్యం నూకలవుతాయి. దుకాణంలో గిరాకి ఉన్న పంటనే తీసుకుంటాం అని కేంద్ర మంత్రి అన్నారు. మీ ధాన్యం మీరే కొనండి.. మీ నూకల బియ్యాన్ని మీ ప్రజలకు మీరు అలవాటు చేయండి.. మేము పీడీఎస్ బియ్యం ఆపేస్తాం.. మీరు నూకలను పీడీఎస్ కింద ఇవ్వండి అని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారని తెలిపారు. 


కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా..!
తెలంగాణ ప్రజలను అవమానించిన కేంద్ర మంత్రికి ఇంత కండకావరమా. కేంద్ర మంత్రి క్షమాపణ చెప్పాలి.. తెలంగాణ కు ఒక్క రూపాయి ఇవ్వనన్న ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి రాజకీయంగా ఏమైపోయాడో అందరికీ తెలుసు. తెలంగాణ బీజేపీ నాయకుల నాల్కకు .. మెదడుకు లింకు తెగిపోయింది. వారేం మాట్లాడుతున్నారో వారికే అర్ధం కావడం లేదు. యాసంగిలో వరి వేస్తే కేంద్రంతో నేను కొనిపిస్తాను.. సీఎం కేసీఆర్ ను పట్టించుకోకండి అన్నారు. ఇప్పుడు రాష్ట్రం సహకరించడం లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) అవాక్కులు చెవాక్కులు పేలుతున్నారు. అసలు ఇతడు మనిషేనా ? ఈయన బీజేపీ అధ్యక్షుడా ? అని ప్రశాంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు.


మగాడివైతే ధాన్యం కొనింపించాలి.. మంత్రి సవాల్
బండి సంజయ్ కి ఒంట్లో నెత్తురుంటే, మగాడివైతే కేంద్రం ధాన్యం కొనిపించాలని, రాష్ట్రం పూర్తిగా దానికి సహకరిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్రం తయారుచేసిన షరతుల పేపరు మీద బలవంతంగా సంతకం పెట్టించుకుంది. అది పద్దతికాదని కేంద్రాన్ని కోరవలసిన కిషన్ రెడ్డి ఆ కాగితం చూయించడం బాధాకరం. కేంద్రం రాజకీయ కక్ష్యతో వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తెలుసు. ఇప్పటికైనా కిషన్ రెడ్డి ధాన్యం కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు.


రేవంత్‌కు ఆ విషయం తెలియదా..
రాష్ట్రాల్లో రైతులు పండించిన పంటలను కేంద్రం కొనుగోలు చేస్తుందన్న విషయం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి తెలియదా  అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించకుండా రేవంత్ రాష్ట్రం కొనాలని డిమాండ్ చేయడంలో అర్థం ఏంటో చెప్పాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలు మిలాఖత్ అయి సిగ్గులేని రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. రేవంత్, బండి సంజయ్ లు రాజకీయ నాయకులా ? వీళ్లవి జాతీయ పార్టీలా ? ఈ రాష్ట్ర రైతుల పక్షాన కలసికట్టుగా ఉండాలన్న ఇంగితం లేదా ?. ప్రజలు గమనిస్తున్నారన్న ఇంగితం లేకుండా బండి సంజయ్ మాట్లాడుతున్నారు. కిషన్ రెడ్డి మీద కొంత గౌరవం ఉండేది .. బండి సంజయ్ ని చూసి కిషన్ రెడ్డి అలాగే మాట్లాడుతున్నారు. కేంద్రం వద్దకు మేం వచ్చినా.. పీయూష్ గోయల్ స్వయంగా ఫోన్ చేసి పిలిచినా వస్తున్నా అని చెప్పి కూడా కిషన్ రెడ్డి రాలేదని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గుర్తుచేశారు.


కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పడం తగదు; గంగుల కమలాకర్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అబద్దాలు చెప్పడం తగదని, మార్చి నెల సమావేశానికి రాలేదు.. ఫిబ్రవరి సమావేశాలకు రాలేదు అని అబద్దాలు చెప్పడం బాధాకరం అన్నారు మంత్రి గంగుల కమలాకర్. మినిట్స్ తెప్పించుకుని మాట్లాడితే బాగుంటుంది. టీఆర్ఎస్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణ గడ్డ మీద పుట్టిన కిషన్ రెడ్డి తీరు బాలేదు. 16 సార్లు ఇప్పటి వరకు కేంద్రానికి లేఖలు రాశాం. తెలంగాణలో యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే పండుతాయి. పాత కోటా 5 లక్షల టన్నుల బియ్యం ఇంకా తీసుకపోలేదు. నెలకు 10 లక్షల టన్నుల బియ్యం ఇచ్చే సామర్థ్యం తెలంగాణకు ఉంది. కానీ ఎన్నడూ 3 లక్షల టన్నులకు మించి తీసుకోలేదు. చివరగా మా బృందం వెళ్లి తీవ్ర ఒత్తిడి పెడితే రెండు నెలలు మాత్రం 10 లక్షల టన్నులు తీసుకున్నారని’ మంత్రి గంగుల అన్నారు.
Also Read: Paddy Procurement: తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు - ఉగాది తర్వాత ఉడుకు చూపిస్తాం: రాష్ట్ర మంత్రులు


Also Read: Khammam Congress : ఖమ్మం కాంగ్రెస్ లో నాయకత్వలేమి - ఆశావహులకు చెక్ పెడుతున్న సీనియర్ నేత?