Khammam Congress : ఓ వైపు ముందస్తు ఎన్నికల ప్రచారంతో టీఆర్‌ఎస్ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తుంటే ఖమ్మం కాంగ్రెస్ నేతలు మాత్రం నాయకత్వ లేమితో డీలా పడ్డారు. వలసలతో గులాబీ గూటిలో నేతల మధ్య ఆదిపత్య పోరు నెలకొని ఉండగా జనబలం ఉన్న కాంగ్రెస్‌కు సరైన దిక్చూచి లేక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా హస్తం పార్టీ తయారైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ఒక ముఖ్యమంత్రిని అందించడంతోపాటు ఎందరో నేతలు కాంగ్రెస్ పార్టీ తరుపున ఖమ్మం జిల్లా నుంచే ప్రాతినిధ్యం వహించారు. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరితోపాటు మాజీ మంత్రులు సంబాని చంద్రశేఖర్‌తోపాటు అనేక మంది కీలక నేతలు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2014లో తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రమంతా టీఆర్‌ఎస్ ప్రభంజనం ఉనప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తన ప్రభావాన్ని చాటుకుంది. 2014, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీ కేవలం ఒకే ఒక్క సీటుకు పరిమితమైందంటే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఎంత బలంగా ఉందో ఇట్టే చెప్పవచ్చు.
భరోసా అందించలేని భట్టి
2018 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఆరు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగా దాని మిత్రపక్షంగా ఉన్న టీడీపీ రెండు స్థానాలు గెలుచుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వారిలో నలుగురు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోగా ఇద్దరు మాత్రమే కాంగ్రెస్‌కు మిగిలారు. నేతల వలసలు వెళ్లినప్పటికీ జిల్లాలోని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకత్వం లేకపోవడం వల్ల ఆ పార్టీ కార్యకర్తలు కొందరు టీఆర్‌ఎస్ పార్టీలోకి వెళ్లిపోయారు. మిగిలిన వారు స్థబ్దుగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే జిల్లాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి స్థానికంగా ఉండకపోవడం, జిల్లా రాజకీయాలపై పట్టీపట్టనట్లు ఉంటుండటంతో ఆ పార్టీకి సీఎల్‌పీ నాయకుడు భట్టి విక్రమార్క మాత్రమే దిక్కయ్యారు. అయితే జిల్లాలో పార్టీకి పునర్ వైభవం తెస్తానని నియోజకవర్గాల వారీగా తన అనుచరగణం పెంచిన భట్టి మాత్రం ఎన్నికలు సమీపిస్తునప్పటికీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకులను తయారు చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆశావహులు ఉన్నప్పటికీ భట్టిని కాదని ముందుకెళ్లలేక
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర, పొదెం వీరయ్య ప్రాతినిధ్యం వహిస్తున్న భద్రాచలం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆశావహులు ఉనప్పటికీ వారికి ఆదరణ కరువైందని ఆ పార్టీ కార్యకర్తలే గుసగులాడుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌లో కీలకంగా ఉన్న భట్టి విక్రమార్క తన సొంత జిల్లా వైపు ఇతర నాయకుల ఆదిపత్యం లేకుండా అడ్డుకట్ట వేయడంలో సపలమవుతునప్పటికీ పార్టీని అభివృద్ధి చేయడంలో విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. ప్రధానంగా బలంగా ఉన్న కొత్తగూడెం నియోజకవర్గంలో ఇప్పటికే ఎడవల్లి కృష్ణ, నాగా సీతారాములు లాంటి నాయకులు ఉన్నప్పటికీ వారిని కాదని కొత్తగా భట్టి అనుచరుడిగా పోట్ల నాగేశ్వరరావును ఈ నియోజకవర్గంలో క్యాంపు వేయించడంతో అక్కడ గందరగోళం నెలకొంది. ఎన్నికలు సమీపిస్తునప్పటికీ మిగిలిన నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి నాయకుడిని తయారు చేయడం, వారికి పోత్స్రాహం అందించడంలో భట్టి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుండటంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీ బలహీన పడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. భట్టిని కాదని ముందుకెళితే తమకు టిక్కెట్ రాదని, వేరే నేతలను కలిసినా భట్టితో ఇబ్బందులు వస్తాయనే భావనతో కొంత మంది ఆశావహులు కిమ్మనకుంటా ఉంటున్నారని, దీంతో ఆయా నియోజకవర్గాలో చుక్కాని లేని నావాలా కాంగ్రెస్ పార్టీ తయారైందని పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
నియోజకవర్గానికే పరిమితమైన రాష్ట్ర స్థాయి నాయకుడు
పీసీసీ నేత హోదాలో ఉన్న భట్టి విక్రమార్క గతంలో అనేక మార్లు దక్షిణ తెలంగాణలో పాదయాత్ర చేసి పార్టీని బలోపేతం చేస్తానని ప్రకటించారు. అయితే అనూహ్యంగా ప్రస్తుతం కేవలం మధిర నియోజకవర్గంలోనే పాదయాత్ర చేస్తుండటంతో ఉమ్మడి జిల్లాలోని కార్యకర్తలు అయోమయంలో పడాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో కాంగ్రెస్‌పార్టీకి ఎదురులేని నేతగా తయారైన భట్టి ఇప్పుడు తన సొంత నియోజకవర్గాన్ని కాపాడుకునే పనిలో పాదయాత్రలో ఉన్నారని, దీంతో మిగిలిన నియోజకవర్గాల్లో ఎలాంటి సంకేతాలు వెళతాయనే విషయంపై ఇప్పుడు చర్చ సాగుతుంది. ఏది ఏమైనా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా భావిస్తున్న పీసీసీ నేత భట్టి పార్టీ అభివృద్ధిలో విఫలమయ్యారని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.