రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి పెడుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. రాష్ట్రం ఆ దిశగా  వేగంగా ముందుకు సాగుతోందన్నారు. సీఎం కేసీఆర్ కలలు కన్న ఆరోగ్య తెలంగాణగా రాష్ట్రం మారుతోందన్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆసుపత్రులు, ఆసుపత్రుల్లో అవసరమైన అధునాతన వైద్య పరికరాలు, తగినంత వైద్య సిబ్బందిని అందుబాటులోకి తెచ్చి ప్రభుత్వ రంగ ఆస్పత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహిస్తోందన్నారు. నిమ్స్ హాస్పిటల్ లో 1989 నుంచి 2021 వరకు 1398 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తే,  2013 లో జీవన్ దాన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 816 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిమ్స్ లో జరిగాయని మంత్రి అన్నారు. 


ఎనిమిదేళ్లలో 742 ఆపరేషన్లు


తెలంగాణ ఏర్పాటుకు ముందు 25 ఏళ్లలో 649   కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగితే  2014 తర్వాత ఈ ఎనిమిదేళ్లలో 742 ఈ ఆపరేషన్లు చేశామని మంత్రి హరీశ్ రావు అన్నారు. 2016 నుంచి నిమ్స్ ఆసుపత్రిలో ప్రతీ ఏడాది వందకు పైగా కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు జరిగాయన్నారు. 2016 లో 111, 2017 లో 114 ఆపరేషన్లు, 2018లో 111, 2019 లో 107 ఆపరేషన్లు జరిగాయని గుర్తుచేశారు. 2020లో కరోనా కారణంగా ఈ ఆపరేషన్లు తగ్గినా, ఈ ఏడాది  ఇప్పటి వరకు 100 ఆపరేషన్లు జరగడం విశేషమన్నారు. ఇందులో భాగంగా  ఈ ఒక్క ఏడాదిలో జరిగిన వంద కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సల్లో 97 మందికి ప్రభుత్వమే ఉచితంగా నిర్వహించిందని మంత్రి తెలిపారు. 90 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు ఆరోగ్య శ్రీ ద్వారానే నిర్వహిస్తున్నామని తెలిపారు. 


Also Read:  వరంగల్ కు జెన్పాక్ట్ ఐటీ కంపెనీ... మంత్రి కేటీఆర్ తో జెన్పాక్ట్ బృందం భేటీ...


కిడ్నీ రోగులకు ప్రాణదానం


ఈ శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించి 25 మంది మహిళలకు, 75 మంది పురుషులకు కిడ్నీ మార్పిడి చేశారని మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఎంతో నేర్పుతో ఓర్పుతో ఈ శస్త్ర చికిత్సలు నిర్వహించిన నిమ్స్ డాక్టర్లకు, నర్సులకు, ఇతర వైద్య సిబ్బంది అందరికీ అభినందనలు తెలిపారు. ఇదే స్పూర్తితో మరిన్ని శస్త్రచికిత్సలు నిర్వహించి కిడ్నీ రోగులకు ప్రాణదానం చేయాలని కోరారు. ప్రభుత్వ రంగంలోని ఆస్పత్రులు, కార్పోరేట్ ఆస్పత్రులతో పోటీ పడేలా వైద్య సేవలు ఉండాలని సూచించారు. అందుకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు, అత్యాధునిక వైద్య పరికరాలు  అందుబాటులోకి తెస్తోందని మంత్రి తెలిపారు.


Also Read: మా పార్టీ ఆదేశిస్తే కేసీఆర్ మీద పోటీ చేస్తా.. నేను బయటకు రాలేదు.. వాళ్లే రాజీనామా చేయమన్నారు


వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం


తెలంగాణ వచ్చాక ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒక్కో శస్త్రచికిత్సకు దాదాపు పది నుంచి 12 లక్షల వరకు ఖర్చు అవుతుందని, 7800 మంది అవయవాల మార్పిడి కోసం జీవన్ దాన్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఎదురుచూస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అవయవదానం కార్యక్రమాన్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తోందన్నారు. ఈ అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను పేదలకు  ప్రభుత్వమే ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా చేయిస్తోందని తెలిపారు. అవయవమార్పిడి శస్త్ర చికిత్సలు చేయడంతో పాటు అనంతరం  అవసరమయ్యే మందులను జీవితకాలానికి ఉచితంగా అందిస్తోందని గుర్తుచేశారు. 


Also Read:  చిన్నారులు సినిమాల్లో నటించాలంటే.. కలెక్టర్ పర్మిషన్ ఉండాల్సిందే.. రెమ్యూనరేషన్ పైనా క్లారిటీ 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి