డబుల్ బెడ్ రూం ఏమయ్యాయని.. సీఎం కేసీఆర్ ను బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రశ్నించారు. ఉద్యోగాలు ఏమయ్యాయో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావ్ నీచంగా ప్రవర్తించాడు అని హుజూరాబాద్ ఎన్నికల తరువాత తెలిసిపోయిందన్నారు. ప్రజల నాడిని బట్టి నాయకులు నిర్ణయాలు తీసుకుంటారని.. టీఆర్ఎస్ మునిగిపోయే నావ అని తెలిసిన తరువాత అందులో ఎవరు ఉంటారని ఈటల విమర్శించారు.


'టీఆర్ఎస్ లో ఎవరు కూడా తృప్తి గా లేరు. అందరూ బయటపడే వారే. నేను పార్టీలు మారే వాడిని కాదు. పూటకో మాట, రోజుకో నిర్ణయం తీసుకొనే వాడిని కాదు. కుటుంబ పాలన అంతమే నా లక్ష్యం.  2002 నుంచి కేసీఆర్ కు.. చేదోడువాదోడుగా ఉన్న.. ఉద్యమ పార్టీలో నావంతు కర్తవ్యం నిర్వహించాను. తెలంగాణ ఆత్మగౌరవం నిలబెట్టిన అని ప్రజలతో శబాష్ అనిపించుకున్నాను. కేసీఆర్ ప్రభుత్వంలో ఏ నిర్ణయం అయిన ఆయన ఒక్కడి నిర్ణయాలే. సంక్షేమ పథకాలు పేదవారికి ఇస్తారు తప్ప డబ్బులు ఉన్నవారికి కాదు అని చెప్పిన వాడిని నేను. తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికే సంక్షేమ పథకాలు ఇస్తారు కానీ భూస్వాములకు, గుట్టలకు, బీడు భూములకు కూడా రైతు బంధు ఇస్తున్నారు. డబ్బులు కేసీఆర్ ఇంట్లోవి కావు. తెలంగాణ ప్రజల చెమట పైసలు.' అని ఈటల వ్యాఖ్యానించారు. 


రైతు బీమా ఇస్తున్నారు మంచిదేనని ఈటల అన్నారు.  కానీ రైతు కూలీలకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. రైతు కూలీలకు..  రెక్కడితేకానే డొక్కాడదనే విషయాన్ని కేసీఆర్ మర్చిపోయినట్టున్నారని అన్నారు. మా రక్తాన్ని కళ్ళ చూసిన వారికి ఎమ్మెల్సీ టిక్కెట్స్ ఇచ్చారని.. అతనికి డబ్బులు ఇచ్చి తనను ఒడగొట్టాలని చూశారన్నారు.  డబ్బులు ఇచ్చి తన మీద తప్పుడు రాతలు రాయించారని ఈటల పేర్కొన్నారు. 
నేను టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటికి రాలేదు. రాజీనామా చేస్తావా లేదా అని డిమాండ్ చేస్తే ఇజ్జత్ ఉన్న వాడిని కాబట్టి రాజీనామా చేసి బయటికి వచ్చిన. అప్పుడు కేసీఆర్ అసలు రూపం బయటపడింది. ఈటల రాజేందర్ ముఖం అసెంబ్లీ కనిపించవద్దు అని.. ఒకే లక్ష్యంతో పని చేశారు. కేసీఆర్ కి వ్యతిరేకంగా ఉన్న వారిని అణచివేయడం ఇంటిలిజెన్స్ పని. నేను ఉద్యోగాలు పెట్టించిన వారందరినీ తీసివేసి వారిని ఇబ్బంది పెట్టారు హరీష్ రావు. భర్తలు లేని మహిళలకు ఉద్యోగాలు ఇస్తే వారిని కూడా ఉద్యోగాల నుండి తొలగించారు. ం
                                                                         - ఈటల రాజేందర్, హుజూరాబాద్ ఎమ్మెల్యే


ఎన్నికలు ముగిసేలోపే దళితబందు ఇవ్వమని డిమాండ్ చేశా.. కానీ ఇవ్వకుండా మోసం చేశారని ఈటల అన్నారు. దళితుల మీద ప్రేమతో కాదు హుజూరాబాద్ లో గెలవడానికి తెచ్చిన పథకం దళిత బందు అన వ్యాఖ్యానించారు.  దళితబంధు రాష్ట్రమంతా అమలు చేయాలన్నారు. చర్మం వలిచి చెప్పులు కుట్టించినా హుజూరాబాద్ ప్రజల రుణం తీర్చుకోలేనిదని చెప్పారు.  సందర్భం రానివ్వండి కేసీఆర్ భరతం పడతాం అని అందరూ ఎదురుచూస్తున్నారన్నారు.
 
బీజేపీలో గ్రూప్ లు ఉన్నాయి అనేది కేసీఆర్ టీం ప్రచారం.. మిత్రబేదం సృష్టించడం ఆయన నైజం అని ఈటల చెప్పారు. ధరణితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని..  రైతు ప్రభుత్వం నిజమే అయితే రైతులు ఎందుకు ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేస్తున్నారు? అని ప్రశ్నించారు. 


Also Read: Bhatti Vikramarka: టీచర్ల బదిలీలపై తొందరెందుకు... పైరవీల కోసమే ఆఫ్ లైన్ విధానమా..?


Also Read: DS Meets Sonia : సోనియాతో డీఎస్ భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం !