సాధారణంగా ఉద్యోగుల బదిలీలకు నెలల తరబడి టైం ఇచ్చే సర్కారు.. లక్ష మంది టీచర్ల బదిలీ వ్యవహారాన్ని పది పదిహేను రోజుల్లోనే పూర్తి చేయాలని తొందరపడటం వెనక ఆంతర్యమేమిటని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. టీచర్ల బదిలీలను హేతుబద్ధంగా నిర్వహించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి బదిలీలను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ఆగమేఘాల మీద బదిలీలను చేపట్టడం వల్ల ఉపాధ్యాయులు తీవ్ర అయోమయంలో ఉన్నారని భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ ఉద్యమం స్థానికత అంశంపై జరిగిందని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకోవాలన్నారు. నూతన జిల్లాలకు ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయించే విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఇందుకు విరుద్ధంగా 317  జీవో  జారీచేయడం సరికాదన్నారు. 


Also Read: సోనియాతో డీఎస్ భేటీ.. త్వరలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం !


సీనియారిటీ లిస్టులు ప్రకటించకుండా ఆఫ్షన్లు


ఉపాధ్యాయులను నూతన జిల్లాలకు కేటాయించే విషయంలో ఎక్కడా స్థానికతను పరిగణనలోకి తీసుకోలేదని భట్టి విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టే పరిస్థితి వస్తుందన్నారు. కరోనా కారణంగా పాఠశాలలను మూసివేయడంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారన్న ఆయన... ఇప్పుడిప్పుడే విద్యార్థులు చదువు బాట పడుతున్న క్రమంలో ప్రభుత్వం విద్యా సంవత్సరం మధ్యలో అనాలోచితంగా ఉపాధ్యాయుల బదిలీలు చేపట్టడం సరికాదన్నారు. ఉపాధ్యాయులు ఆందోళనకు దిగితే విద్యార్థులకు ఈ ఏడాది కూడా నష్టం జరిగే అవకాశం కనిపిస్తున్నదన్నారు. సీనియారిటీ లిస్టులు ప్రకటించకుండా టీచర్ల నుంచి బలవంతంగా ఆప్షన్ ఫారాలను తీసుకున్నారని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నట్లు చెప్పారు. ఆప్షన్లు పెట్టిన రెండు, మూడు రోజులకు సీని యారిటీ లిస్టుల డ్రాఫ్టులను డీఈవోలు రిలీజ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. 


Also Read:  శిల్పా చౌదరికి బెయిల్ మంజూరు... పక్కా స్కెచ్ తో రూ.కోట్లు కొట్టేసిందా?... శిల్ప కాల్ డేటా విశ్లేషిస్తోన్న పోలీసులు


 ఆన్లైన్ లో బదిలీలు చేపట్టాలి 


కనీసం సీనియారిటీ లిస్టులు ప్రకటించిన తర్వాత ఎడిట్ ఆప్షన్లకు కూడా ఛాన్స్ ఇవ్వకుండా తొందర పెట్టడం సరికాదని భట్టి విక్రమార్క అన్నారు. కొత్త జిల్లాల అలకేషన్ పై  స్పష్టమైన గైడ్ లైన్స్ ఇవ్వాలన్నారు. కొత్త జిల్లాలకు అలాట్ అయిన వెంటనే ఆ టీచర్లను స్కూళ్లకు కేటాయిస్తారా..? లేక, ఈ విద్యా సంవత్సరం పూర్తయ్యే వరకూ పాత జిల్లాల్లోనే కొనసాగిస్తారా..? అనేదానిపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం పనిచేస్తోన్న జిల్లాలు వచ్చిన వారిని పాత స్కూల్లోనే కొనసాగిస్తారా..? లేక కొత్త స్కూల్ కు పంపిస్తారా..? అనే అనుమానాలు టీచర్లకు ఉన్నాయని ప్రభుత్వం వాటిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. భార్య భర్తలు ఇద్దరూ ఉపాధ్యాయులు అయితే వారిని ఒకే చోట ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జివైనల్ డయాబెటిక్ పిల్లలున్నా ఉపాధ్యాయులను జిల్లా హెడ్ క్వార్టర్ లోనే పని చేసే అవకాశం కల్పించాలని లేకుంటే వైద్య పరంగా ఇబ్బందులు ఉంటాయన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఆన్లైన్లో చేపడతామని ప్రకటించి ఆఫ్ లైన్ లోకి మార్చడం పైరవీలకు ఆస్కారం ఇవ్వడమేనని అన్నారు.  పైరవీలు చేసుకోవడానికి అవకాశం ప్రభుత్వమే కల్పించడం సిగ్గుచేటన్నారు.


Also Read:  ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక చొరవ.. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి